ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నేడో, రేపో కాంగ్రెస్‌ తొలి జాబితా

ABN, First Publish Date - 2023-09-22T00:51:32+05:30

కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం అసెంబ్లీ బరిలోకి దింపే అభ్యర్థుల తొలి జాబితాను ఒకటిరెండు రోజుల్లో ప్రకటించే అవకాశమున్నది. ఢిల్లీలో రాష్ట్రం నుంచి పంపించిన జాబితాలోని పేర్ల వడబోత ప్రారంభమైంది. అభ్యర్థుల బలాలు, బలహీనతలు వివిధ సర్వేల్లో వెల్లడైన అభిప్రాయాలు, పార్టీ నేతల నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి అభ్యర్థులను ఎంపిక చేయడంలో ఒక అవగాహనకు రావడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసింది.

- ఉమ్మడి జిల్లాలో మెజార్టీ అభ్యర్థుల పేర్లు ప్రకటన

- ఢిల్లీలో స్ర్కీనింగ్‌ కమిటీ చర్చలు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం అసెంబ్లీ బరిలోకి దింపే అభ్యర్థుల తొలి జాబితాను ఒకటిరెండు రోజుల్లో ప్రకటించే అవకాశమున్నది. ఢిల్లీలో రాష్ట్రం నుంచి పంపించిన జాబితాలోని పేర్ల వడబోత ప్రారంభమైంది. అభ్యర్థుల బలాలు, బలహీనతలు వివిధ సర్వేల్లో వెల్లడైన అభిప్రాయాలు, పార్టీ నేతల నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి అభ్యర్థులను ఎంపిక చేయడంలో ఒక అవగాహనకు రావడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని మెజార్టీ స్థానాల అభ్యర్థులను తొలి జాబితాలోనే ప్రకటిస్తారని తెలుస్తున్నది. ఉమ్మడి జిల్లా పరిధిలో 13 అసెంబ్లీ స్థానాలు ఉండగా మంథని నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జగిత్యాల నుంచి టి జీవన్‌రెడ్డి, మానకొండూర్‌ నుంచి డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ, సిరిసిల్ల నుంచి కేకే మహేందర్‌రెడ్డి, వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్‌, కోరుట్ల నుంచి జువ్వాడి నర్సింగారావు, పెద్దపల్లి నుంచి విజయరమణారావు, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జగిత్యాల డీసీసీ అద్యక్షుడు అడ్లూరి లక్ష్మన్‌కుమార్‌ అభ్యర్థిత్వాలను ఖరారు చేసి తొలి జాబితాలోనే ప్రకటిస్తారని తెలుసున్నది.

రామగుండం, హుజురాబాద్‌ను పెండింగ్‌ పెట్టే అవకాశం

పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు రాజ్‌ ఠాకూర్‌, హుజూరాబాద్‌ నుంచి బల్మూరి వెంకట్‌ పేర్లు కూడా తొలి జాబితాలోనే వచ్చే విధంగా మొదట ఒక అవగాహనకు వచ్చినా ఆ రెండు నియోజకవర్గాల్లో మరోసారి పరిశీలన జరుపాలనే నిర్ణయానికి వచ్చారని విశ్వసనీయ సమాచారం. బల్మూరి వెంకట్‌ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడే కాకుండా హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో పోటీ చేసిన సందర్భంలో జనరల్‌ ఎలక్షన్‌లో కూడా పోటీ చేసే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఆమేరకు ఆయనకు ఈసారి కూడా టికెట్‌ ఖాయమని చెబుతున్నారు. స్థానికంగా వస్తున్న అభ్యంతరాలను, సర్దుబాటు చేసి ఆయన పేరు ప్రకటిస్తారని అంటున్నారు. రామగుండం టికెట్‌ ఆశిస్తున్న రాజ్‌ఠాకూర్‌ పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన అభ్యర్థిత్వానికి పెద్దగా పోటీ ఏమి లేకున్నా కొందరు నేతల అభిప్రాయం మేరకు తొలి జాబితాలో ఆయన పేరు రాక పోవచ్చని పార్టీవర్గాలు చెబుతున్నాయి. మొదటి జాబితాలో రాజ్‌ ఠాకూర్‌ పేరు ప్రకటించడానికి, ప్రకటించకపోవడానికి 50 శాతం అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

హుస్నాబాద్‌ రేసులో పొన్నం, అల్గిరెడ్డి

హుస్నాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ, పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక మాజీ అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌, మాజీ శాసనసభ్యుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ప్రవీణ్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేర్చుకునే సమయంలో టికెట్‌ ఇస్తామన్న హామీ ఇచ్చారని ప్రచారం జరిగింది. ఆయన అభ్యర్థిత్వం దాదాపు ఖరారేనని భావించిన తరుణంలో పొన్నం ప్రభాకర్‌ హుస్నాబాద్‌లో పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్నారు. బీసీ ఓట్లు అధికంగా ఉండడం, అందులో గౌడ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కూడా అధికంగా ఉండడం, కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని నియోజకవర్గమే కావడంతో ప్రభాకర్‌ గట్టి అభ్యర్థిగా మారారు. ప్రవీణ్‌రెడ్డి కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌కు వెళ్లి తిరిగి కాంగ్రెస్‌లో చేరారని, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ప్రవీణ్‌రెడ్డి సన్నిహితుడని, ఆయనను బీజేపీలో చేరాలనే ప్రయత్నాలు కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే ప్రారంభించారని ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఆయనకు కాకుండా పొన్నం ప్రభాకర్‌కే టికెట్‌ ఇవ్వాలని ఆయన వర్గీయులు కోరుతున్నారు.

కరీంనగర్‌ టికెట్‌ ఎవరికో..?

ఉమ్మడి జిల్లా రాజకీయాలకు గుండె కాయగా నిలిచే కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్‌లో కీలకంగా మారింది. ఈ నియోజకవర్గం నుంచి మైత్రీ గ్రూప్‌ చైర్మన్‌ కొత్త జయపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి ఎం రోహిత్‌రావు, మరో అధికార ప్రతినిధి కొనగాల మహేశ్‌, మాజీ అధికార ప్రతినిధి రేగులపాటి రమ్యారావు, బొమ్మకల్‌ సర్పంచ్‌ పురమల్ల శ్రీనివాస్‌, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు సత్యప్రసన్నరెడ్డి, టీపీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్‌కుమార్‌, డీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, మైనార్టీ నాయకులు సమద్‌ నవాబ్‌, రహమత్‌ హుస్సేన్‌, యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పడాల రాహుల్‌తోపాటు మరికొందరు దరఖాస్తు చేసుకున్నారు. ప్రధానంగా కొత్త జయపాల్‌రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, రోహిత్‌రావు, కొనగాల మహేశ్‌, పురమల్ల శ్రీనివాస్‌ అభ్యర్థిత్వం కోసం పోటీపడినా మూడు పేర్లు మాత్రమే స్ర్కీనింగ్‌ కమిటీకి పంపించారని సమాచారం. కొత్త జయపాల్‌రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి హైదరాబాద్‌లో జరిగిన సోనియాగాంధీ సభకు భారీ సంఖ్య వాహనాలను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున జనాన్ని తరలించారు. కొత్త జయపాల్‌రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఇతర ప్రముఖ నాయకుల మద్దతు ఉందని, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డికి శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి అండగా నిలుస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. వీరిద్దరిలోనే ఒకరికి అవకాశం దక్కుతుందని పార్టీవర్గాలు అంటున్నాయి. కరీంనగర్‌, హుస్నాబాద్‌ అభ్యర్థుల పేర్లు మొదటి జాబితాలో ఉండే అవకాశం ఏమాత్రం లేదని చెబుతున్నారు.

Updated Date - 2023-09-22T00:51:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising