హామీల అమలులో కేసీఆర్ ప్రభుత్వం విఫలం
ABN, First Publish Date - 2023-07-21T00:00:24+05:30
హామీల అమలులో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు.
పెద్దపల్లిటౌన్, జూలై 20: హామీల అమలులో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. జిల్లా కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ కోసం ఆరేళ్లుగా నిరీక్షిస్తున్న అభ్యర్థులకు ఖాళీగా ఉన్న 20వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చి 10ఏళ్లయినా కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులను ఎందుకు పర్మినెంట్ చేయలేదని ప్రశ్నించారు. కరోనా సమయంలో దేశాన్ని కాపాడిన పారిశుధ్య కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ చుట్టూ పేదల అసైన్డ్ భూములను ప్రభుత్వమే గుంజుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు 2 లక్షల 60 వేల ఇళ్లు కట్టిస్తామన్న హామీ ఇంకా పునాదుల దశలోనే ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ నిధులు ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లో వేలాదిమంది లబ్ధిదారులకు అన్యాయం చేశారన్నారు. బీసీ కుల, చేతి వృత్తుల రుణాల కోసం లక్షల్లో దరఖాస్తులు చేసుకుంటే మొక్కుబడిగా ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు విడుదల చేయడంతో ఏ విధంగా బీసీలకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లబ్ధిదారుల ఎంపిక అధికార పార్టీ ఎమ్మెల్యే చేతుల్లో పెట్టి దళిత బంధును బీఆర్‌ఎస్ బంద్‌గా మార్చారన్నారు. బీఎస్పీ రాష్ట్రకార్యదర్శి దాసరి హను మయ్య, నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి ఉష,జిల్లా అధ్యక్షుడు గొట్టే రాజు, ఉపాధ్య క్షుడు తోట వెంకటేష్ పటేల్, జోనల్ మహిళా కన్వీనర్ కుమ్మరి సవిత, జిల్లా ఇన్ చార్జి బాల కళ్యాణ్ పంజా, మొలుమూరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-07-21T00:00:24+05:30 IST