కవులు, కళాకారులకు పుట్టినిల్లు కరీంనగర్
ABN, First Publish Date - 2023-03-05T00:39:52+05:30
కవులు, కళాకారులకు పుట్టినిల్లు కరీంనగర్ అని ఎంపీ బండి సంజయ్‌కుమార్ అన్నారు. జ్యోతీబాపూలే పార్క్‌లో నిర్వహిస్తున్న కరీంనగర్ బుక్ ఫెయిర్‌కు శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
కరీంనగర్ కల్చరల్, మార్చి 4: కవులు, కళాకారులకు పుట్టినిల్లు కరీంనగర్ అని ఎంపీ బండి సంజయ్‌కుమార్ అన్నారు. జ్యోతీబాపూలే పార్క్‌లో నిర్వహిస్తున్న కరీంనగర్ బుక్ ఫెయిర్‌కు శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం, చరిత్ర, సంస్కృతీపాంప్రదాయాలు తెలుస్తాయని అన్నారు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా పుస్తకం చదివితే వచ్చే తృప్తి వేరని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ బుక్ ఫెయిర్ గురించి వివరించారు. అంతకుముందు బండి సంజయ్ బుక్‌స్టాల్స్‌ను ప్రారంభించి స్టాళ్లను సందర్శించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ప్రియాంక, ట్రైనీ కలెక్టర్ లెనిన్, కార్పోరేటర్ చొప్పరి జయశ్రీ, డీడబ్ల్యుఓ సబితాకుమారి, మార్కెటింగ్ అధికారి పద్మావతి, బుక్ ఫెయిర్ కార్యదర్శి కోయ చంద్రమోహన్ పాల్గొన్నారు. అనంతరం మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారత, మహిళలు-చట్టాలు-నాయకత్వం అంశంపై ముఖాముఖి నిర్వహించారు. సాయంత్రం చల్లూరుకు చెందిన తాండ్ర శంకర్ బృందం సాధనాశూరుల ప్రదర్శన, గిన్నీస్ బుక్ రికార్డ్ హోల్డర్ కిషన్‌చే జాగ్లర్ జిమ్నాస్టిక్, ఎలబాకకు చెందిన వి జితేందర్‌రావు ఏకపాత్రాభినయం ప్రదర్శించారు. రాత్రి ముద్దసాని రాంరెడ్డి పేరిట 10 వేల రూపాయల నగదు పురస్కారాన్ని స్వేచ్ఛాకవి సుదర్శనం వేణుశ్రీకి కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అసిస్టెంట్ కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్, కలెక్టర్ తండ్రి, తమిళ కవి జననేసన్ వీరరాఘవన్ అందజేశారు. బుక్‌టాక్‌లో భాగంగా జాషువా రాసిన గబ్బిలం కావ్యంలోని సాహిత్యాన్ని కందుకూరి అంజయ్య చదివి వినిపించారు. అనంతరం సాహిత్య సమాలోచనలో భాగంగా ముత్యంపేట గౌరీశంకరశర్మ, ముదిగొండ అమరనాథశర్మ సంస్కృతాంధ్ర అష్టావధానం నిర్వహించారు.
- పుస్తకాలు కొనండి... చదవండి
- చిన్నారులతో కలెక్టర్ ఆర్వీ కర్ణన్
కరీంనగర్ మహాత్మా జ్యోతీబాపూలే పార్క్‌లో జరుగుతున్న కరీంనగర్ బుక్ పెయిర్‌ను శనివారం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సందర్శించారు. ఈ క్రమంలో పలు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు పుస్తకాలను తిలకిస్తుంటే వారితో మాట్లాడారు. వారితో ఫోటోలు దిగారు. విద్యార్థులతో మాట్లాడిన అనంతరం వేదిక వద్ద కూర్చొన్న వృద్ధ మహిళలను పలకరించారు. తన సతీమణి ప్రియాంకను పరిచయం చేస్తూ జడ్పీ సీఈవోగా పని చేస్తుందని తెలిపారు.
- ఉచితంగా పుస్తకాల అందజేత
కరీంనగర్‌కు చెందిన ఇంగ్లీష్ లెక్చరర్ డాక్టర్ బొద్దుల వెంకటేశం పరిశోధనాత్మక, సాఽధికారిక గ్రంధాలు 30 వరకు రచించారు. ఆయన రెండు సంవత్సరాల క్రితం మృతి చెందారు. ఆయన వారసులు వెంకటేశం సాహిత్యం అందరికీ అందాలని భావించారు. ఇందుకు కరీంనగర్ బుక్‌ఫెయిర్‌ను వేదికగా చేసుకున్నారు. వేంకటేశం సాహిత్యాన్ని 43వ స్టాల్‌లో పెట్టి, ఒక్కో సెట్‌గా చేసి ఉచితంగా కావాల్సిన వారికి అందిస్తున్నారు.
Updated Date - 2023-03-05T00:39:52+05:30 IST