హరితహారం లక్ష్య సాధనకు ప్రణాళికలు సిద్ధం చేయాలి
ABN, First Publish Date - 2023-05-02T00:15:58+05:30
హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులకు సూచించారు.
- జిల్లాలో 43.70 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం
- కలెక్టర్ ఆర్వీ కర్ణన్
కరీంనగర్, మే 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో హరితహారం, పల్లె ప్రకృతి వనం, ఉపాధిహామీ పనులు, కంటి వెలుగు, ఆరోగ్య మహిళ కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించి, నిర్దేశించిన 43 లక్షల 70 వేల లక్ష్యాన్ని అధిగమించాలని సూచించారు. బ్లాక్ ప్లాంటేషన్, బండ్ ప్లాంటేషన్, కమ్యూనిటీ ప్లాంటేషన్, అదనపు ప్రకృతి వనాలను, రోడ్లకు ఇరువైపులా అవసరమైన ప్రతి ప్రదేశంలో మొక్కలు నాటడానికి స్థలాలను గుర్తించి అంచనాలు తయారు చేసుకోవాలన్నారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలని, అకాల వర్షాలతో సమస్యలు ఎదురవకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, శిక్షణ కలెక్టర్ నవీన్ నికోలస్, అటవీ శాఖ అధికారి బాలామణి, డీఆర్డీవో శ్రీలత, డీపీవో వీరబుచ్చయ్య, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ పాల్గొన్నారు.
కార్మికులు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
భవన, ఇతర నిర్మాణ కార్మికులు హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. సోమవారం మే డే సందర్భంగా కృషి భవన్‌లో సీఎస్‌సీసీ హెల్త్‌కేర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్మిక ఆత్మీయ సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవన, ఇతర నిర్మాణ కార్మికుల కోసం మూడు రోజులపాటు వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్‌బాబు మాట్లాడుతూ గుర్తింపు కార్డులు ఉన్న భవన నిర్మాణ కార్మికులకు కార్మిక ఆత్మీయ సంబరాల్లో భాగంగా మే 1 నుంచి 3 వరకు సీఎస్సీ ఆధ్వర్యంలో 3,200 విలువ గల ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు సంక్షేమ పథకాలు సహజ మరణం కింద ఒకరికి 1,30,038 రూపాయల చొప్పున మొత్తం 20 మంది లబ్ధిదారులకు 26,00,769 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేశామని, ప్రసూతి లబ్ది కింద 161 మందికి 48,36,118 రూపాయలు, వివాహ కానుక కింద 42 మందికి 12,61,596 రూపాయలు జమ చేశామని తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందించారు. జిల్లా హ్యాండ్లూమ్ శాఖాధికారి జి సంపత్ జౌళిశాఖలోని 118 మంది లబ్ధిదారులకు 8,44,000 రూపాయల చెక్కును కార్మికులకు అందించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ప్రియాంక, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, జిల్లా చేనేత శాఖ అధికారి సంపత్‌కుమార్, ఏఎస్‌సీ హెల్త్ కేర్ కో ఆర్డినేటర్ బాబ, సహాయ కార్మిక కమిషనర్ ఎం కోటేశ్వర్లు, కార్మిక శాఖాధికారులు నజీర్ అహ్మద్, డి చక్రధర్ రెడ్డి, డి చందన పాల్గొన్నారు.
Updated Date - 2023-05-02T00:15:58+05:30 IST