బీఆర్‌ఎస్ నేతల్లో ‘అసంతృప్తి’
ABN, First Publish Date - 2023-08-05T00:37:32+05:30
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీఆర్‌ఎస్ పార్టీలోని పలువురు నాయకుల్లో దాగి ఉన్న అసంతృప్తి పెల్లుబుకుతున్నది. ఒక్కరొక్కరుగా బయటకు వస్తూ విమర్శలు సంధిస్తూ పార్టీని ఇరకాటంలోకి నెట్టి వేస్తున్నారు. ఈ వ్యవహారం ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారగా, పార్టీ అధిష్ఠాన పెద్దలు దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడంతో రోజురోజుకు పార్టీకి నష్టం వాటిల్లుతున్నదని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
ఫొటో
- రామగుండంలో చందర్‌కు వ్యతిరేకంగా పోరు
- పెద్దపల్లిలో పార్టీని వీడుతున్న నాయకులు
- దిద్దుబాటు చర్యలు చేపట్టని అధిష్ఠానం
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీఆర్‌ఎస్ పార్టీలోని పలువురు నాయకుల్లో దాగి ఉన్న అసంతృప్తి పెల్లుబుకుతున్నది. ఒక్కరొక్కరుగా బయటకు వస్తూ విమర్శలు సంధిస్తూ పార్టీని ఇరకాటంలోకి నెట్టి వేస్తున్నారు. ఈ వ్యవహారం ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారగా, పార్టీ అధిష్ఠాన పెద్దలు దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడంతో రోజురోజుకు పార్టీకి నష్టం వాటిల్లుతున్నదని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. రామగుండం నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌పై తిరుగుబాటు జెండా ఎగురవేయగా, పెద్దపల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సహా పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు పార్టీని వీడుతున్నారు. మరికొందరు నాయకులు తమకంటూ వర్గాలను ఏర్పాటు చేసుకుని టిక్కెట్ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు లేని చోట ఇన్‌చార్జీలకు పార్టీ అధినేత సకల అధికారాలను కట్టబెట్టడంతో దానిని అదనుగా చేసుకుని పార్టీలో తమకు ఎవరు పోటీ లేకుండా ఉండేందుకు అణగదొక్కే ప్రయత్నాలు చేశారనే విమర్శలు ఉన్నాయి. ఆ చర్యలను గమరిస్తున్న అసంతృప్త నేతలు అదను చూసి బాణాలు ఎక్కుపెడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో తమలో ఉన్న అసంతృప్తిని బయట పెట్టకుంటే భవిష్యత్తులో తమను ఎవరూ పట్టించుకోరనే భావనతో బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. తామేమిటో నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమకూ పార్టీ టిక్కెట్ కావాలంటూ ముందుకు వస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లి ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. రామగుండం నియోజకవర్గానికి చెందిన మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, పాలకుర్తి జడ్పీటీసీ సభ్యురాలు కందుల సంధ్యారాణి, పార్టీ నాయకులు పాతిపెల్లి ఎల్లయ్య, సింగిల్‌విండో చైర్మన్ బయ్యపు మనోహర్‌రెడ్డి ఎమ్మెల్యే చందర్‌పైనే బాణాలు ఎక్కుపెట్టారు. వచ్చే ఎన్నికల్లో చందర్‌కు టిక్కెట్ ఇస్టే పార్టీ ఓటమి చెందుతుందని, ఇక్కడి నుంచి టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పోటీ చేయాలని, లేదంటే తమలో ఎవరికైనా ఒకరికి టిక్కెట్ ఇవ్వాలని అంటున్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ ఉద్యోగాల పేరిట చందర్ అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ప్రజా ఆశీర్వాద యాత్ర పేరిట నియోజకవర్గంలోని డివిజన్లలో, బొగ్గు గనుల మీదకు వెళ్లి మూడోసారి బీఆర్‌ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకరావాలని, ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను చేయాలంటూ ప్రచారం చేస్తున్నారు. ఈనెల 6వ తేదీన గోదావరిఖనిలో ఒక సభను కూడా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభకు అసంతృప్త నేతలను సమీకరించి, జన సమీకరణ చేయాలని భావిస్తున్నారు. అయితే సదరు నాయకుల వెనుక పార్టీకి చెందిన పెద్ద నాయకులు ఉన్నారనే ప్రచారం జరుగుతున్నది. చందర్ వ్యవహార శైలి మారిన కారణంగానే అసంతృప్త నేతలు బయటకు వస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతున్నది. అయితే ఇది ఎటువైపు దారి తీస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. చందర్ వారిని కలిసి మాట్లాడే ప్రయత్నాలు చేయలేదని విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకవెళ్లారని తెలుస్తున్నది.
పెద్దపల్లిలో పార్టీని వీడుతున్న నేతలు..
పెద్దపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి వ్యవహారశైలిపై గుర్రుమన్న మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎలువాక రాజయ్య, తదితరులు పార్టీని వీడి శుక్రవారం హైదరాబాద్ గాంఽధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో చేరారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, పార్టీ సమావేశాలు జరిగితే ఆహ్వానం లేదని, ఒక నియంతలా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. నియోజకవర్గంలో ఎన్నడూ లేని అవినీతి జరిగిందని అసంతృప్త నేతలు ఆరోపించారు. ఆయన మరోసారి గెలిస్తే నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడనున్నారని, రాక్షస పాలనకు చరమ గీతం పాడుతామని అన్నారు. సదరు నాయకులు బీఆర్‌ఎస్ పార్టీని వీడుతున్నారని పది రోజుల క్రితం నుంచే ప్రచారం జరుగుతున్నది. వాళ్లు పార్టీని వీడకుండా ఉండేందుకు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఒకరిద్దరు మాజీ ప్రజాప్రతినిధులను మాత్రం నిలువరించారు. మరికొందరు నాయకులు పార్టీని వీడే అవకాశాలు కనబడుతున్నాయి. అసంతృప్త నేతలు పార్టీని వీడుతుంటే టిక్కెట్ ఆశిస్తున్న పార్టీ నాయకులు నల్ల మనోహర్‌రెడ్డి, జూలపల్లి జడ్పీటీసీ బొద్దుల లక్ష్మీనారాయణ, టీఎస్‌టీఎస్ మాజీ చైర్మన్ చిరుమల్ల రాకేశ్‌లు తమకంటూ వర్గాలను ఏర్పాటు చేసుకుంటూ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేకు, సదరు నాయకుల మధ్య సమన్వయం లేదు. ప్రభుత్వపరంగా చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు రాక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కక్కలేక, మింగలేక ఈ గండం నుంచి బయటపడేది ఎలా అంటూ కొందరు పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు లోలోపల కుమిలిపోతున్నారు. మొత్తంమీద జిల్లాలోని రామగుండం, పెద్దపల్లి నియోజకవర్గాల్లో పార్టీకి చెందిన అసంతృప్త నాయకులు బహిరంగంగానే బయటకు వచ్చి తమ అసంతృప్తిని వెళ్లగక్కడం వల్ల పార్టీ కొంత బలహీనపడుతున్నది. ఇప్పటికైనా ముఖ్య నాయకులు రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టకుంటే పార్టీ మరింత నష్టపోయే అవకాశాలున్నాయి.
Updated Date - 2023-08-05T00:37:32+05:30 IST