గులాబీ నేతల్లో గుబులు..
ABN, First Publish Date - 2023-09-04T01:06:16+05:30
మరో మూడు మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లను ఆకర్శించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుక వచ్చిన పలు సంక్షేమ పథకాలు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులకు తలనొప్పిగా మారాయి.
- బీఆర్‌ఎస్ నేతలకు తలనొప్పిగా మారిన పథకాలు
- ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులపై పెరుగుతున్న ఒత్తిళ్లు
- వేలల్లో దరఖాస్తులు, మంజూరు తక్కువే
- రాజకీయంగా నష్టం కలగవచ్చనే భయం
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
మరో మూడు మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లను ఆకర్శించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుక వచ్చిన పలు సంక్షేమ పథకాలు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులకు తలనొప్పిగా మారాయి. ఆ పథకాల ద్వారా కొందరిని మాత్రమే సంతృప్తిపరిచే పరిస్థితి ఉండడంతో మిగతా వారితో రాజకీయంగా తమకు నష్టం కలగవచ్చనే భయం ఆ పార్టీ నేతలను పట్టుకున్నది. ఈ సమయంలో ఆ పథకాలను తీసుకురాకున్నా పెద్దగా ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు మాసాల క్రితం సీఎం కేసీఆర్ పలు పథకాలకు శ్రీకారం చుట్టారు. అందులో ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న గృహలక్ష్మి పథకం ఒకటి. సొంత ఇంటి స్థలం ఉండి ఎలాంటి ఇల్లు లేనివారికి ఇంటి నిర్మాణం కోసం 3లక్షల రూపాయల ఇస్తామని ప్రకటించింది. ఈ పథకం ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు గత నెలలో నాలుగు రోజులు మాత్రమే గడువు ఇచ్చారు. అయినా జిల్లా వ్యాప్తంగా 33,079 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులపై గతనెల 11వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ఇంకా విచారణ కొనసాగుతున్నది.
ఫ జిల్లా వ్యాప్తంగా 8,475 ఇళ్లు..
ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వం 3వేల చొప్పున ఇళ్లు కేటాయించగా, జిల్లా వ్యాప్తంగా 8,475 ఇళ్లు మంజూరు చేయనున్నారు. దరఖాస్తుల సంఖ్య బాగా రావడంతో ఇళ్ల మంజూరు కోసం ఎమ్మెల్యేలపై పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇళ్ల మంజూరు కోసం తీవ్రంగా ఒత్తిడి తీసుకవస్తున్నారు. ఇళ్లు ఎవరికి మంజూరు చేయాలో తెలియనిస్థితి ఏర్పడింది. డబుల్ బెడ్‌రూముల ఇళ్లు ఎలాగూ రాలేదు. కనీసం 3 లక్షల ఇంటినైనా దక్కించుకుందామనే యోచనలో ఉన్నారు. అలాగే దళితబంధు పథకం పరిస్థితి కూడా అదే. ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు దళితుడైతే చాలు అనే నిబంధన విధించారు. చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మంజూరుచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొదటి విడతలో నియోజకవర్గానికి 100 చొప్పున కేటాయించగా, రెండవ విడతలో 1100 చొప్పున జిల్లాకు 2849 యూనిట్లు కేటాయించారు. ఈ పథకం ద్వారా 10 లక్షల రూపాయల యూనిట్ మంజూరు చేయనుండడంతో డిమాండ్ బాగా పెరిగింది. ఈ పథకం కింద దళితులు నేరుగా ప్రభుత్వ అధికారులకు దరఖాస్తు చేసుకునే విధానం లేకపోగా, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల వద్దకు వెళ్లి దరఖాస్తులు సమర్పిస్తున్నారు. యూనిట్లు 1100 ఉంటే 10 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని సమాచారం. ఈక్రమంలో పార్టీ నాయకుల నుంచి ఎమ్మెల్యేలపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ముందుగా బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు తమ పేరిట దరఖాస్తులు చేసుకోగా, ఇతర కులాలకు చెందిన ప్రజాప్రతినిధులు తమ వారికి యూనిట్లు మంజూరు చేయాలంటూ ఎమ్మెల్యేలకు మొర పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు యూనిట్ మంజూరు చేసేందుకు 2 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పథకం వల్ల 1100 కుటుంబాల నుంచి వచ్చే ఓట్లకంటే యూనిట్ మంజూరు కానీ ఓటర్ల నుంచే ఎక్కువ నష్టం వాటిల్లవచ్చని ఆందోళన చెందుతున్నారు. కొందరు నాయకులు ఈ పథకం ఎంత ఆలస్యం అయితే అంత బాగుండుననే భావనతో ఉన్నారని తెలుస్తున్నది.
ఫ ‘లక్ష’ సాయానికి 8543 మంది అర్హులు..
బీసీ కుల వృత్తుల వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం 14 కులాలకు చెందిన వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు 10759 దరఖాస్తులు రాగా, ఇందులో 8543 మంది అర్హులుగా గుర్తించారు. ప్రతి నెలా 15వ తేదీన నియోజకవర్గానికి 300 మందికి లక్ష రూపాయల ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లాలో 900 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి చెక్కులు పంపిణీ చేశారు. దీంతో మిగతా వారి నుంచి ఎమ్మెల్యేలపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. దీనికితోడు గీత కార్మికులు, పద్మశాలి, ముదిరాజు, యాదవులు, మున్నూరు కాపు కులస్తులకు ఈ పథకాన్ని వర్తింపజేయక పోవడంతో ఆ కులాలకు చెందిన వాళ్లు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. మైనార్టీలకు కూడా లక్ష ఆర్థిక సాయం అందించే పథకాన్ని తీసుక వచ్చింది. ఈ పథకం కింద 3086 దరఖాస్తులు వచ్చాయి. మొదటి విడతలో 106 మంది లబ్ధిదారులకు మంజూరు చేశారు. ఇందులో 52 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేయగా, ఇంకా 54 మందికి చెక్కులను పంపిణీ చేయాల్సి ఉంది. దశల వారీగా ఈ పథకం కింద యూనిట్లను మంజూరు చేయనున్నారు. ఇప్పటివరకు ఎంపికైన లబ్ధిదారులు నెలరోజుల్లోగా కావాల్సిన పరికరాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ పథకాల కింద ప్రభుత్వం ఇచ్చే డబ్బులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో ఎన్నికల షెడ్యూల్ రాక ముందే మంజూరు చేయించుకోవాలనే ఆతృత దరఖాస్తుదారుల్లో ఉంది. ఈలోపు 30 శాతం మందికి కూడా లబ్ధి చేకూర్చే పరిస్థితి లేకపోవడంతో మిగతా వాళ్లు ఎక్కడ దూరం అవుతారోననే ఆందోళన బీఆర్‌ఎస్ నేతలను పట్టుకున్నది. ఈ పథకాల వల్ల ప్రయోజనం కంటే నష్టమే చేకూర్చవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Updated Date - 2023-09-04T01:06:16+05:30 IST