సింగరేణి ప్రైవేటీకరణకు కుట్రలు పన్నుతున్న బీజేపీ, బీఆర్‌ఎస్
ABN, First Publish Date - 2023-03-28T00:15:26+05:30
సింగరేణి ప్రైవేటీకరణకు బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్రలు పన్నుతున్నాయని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ ఆరోపించారు.
డీసీసీ అధ్యక్షుడు మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్
గోదావరిఖని, మార్చి 27: సింగరేణి ప్రైవేటీకరణకు బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్రలు పన్నుతున్నాయని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ ఆరోపించారు. సోమవారం ఆర్‌జీ-1 జీడీకే 2ఇంక్లైన్‌లో సింగరేణి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని బొగ్గు గనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక వైపు, రాష్ట్ర ప్రభుత్వం మరో వైపు చర్యలు ముమ్మరం చేశాయన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి హయాంలో సింగరేణి ఏరియాలో 18వేల ఇళ్లకు పట్టాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. సింగరేణి కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగులు ప్రసాదిస్తున్నారని, వారికి ఇన్‌కంటాక్స్ రద్దు చేయాలన్నారు. సింగరేణి మెడికల్ కళాశాలలో 40శాతం రిజర్వేషన్ కల్పించి సింగరేణి ఉద్యోగుల పిల్లలకు మెడికల్ సీట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మళ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీ గెలిస్తే సింగరేణిని భూస్థాపితం చేస్తారని, సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మహంకాళి స్వామి, ఎండీ ముస్తాఫా, పెద్దెల్లి తేజస్వినిప్రకాష్, నాయకులు మాదరబోయిన రవికుమార్, గట్ల రమేష్, తాళ్లపల్లి యుగంధర్, తిప్పారపు శ్రీనివాస్, గడ్డం శేఖర్, దాసరి విజయ్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-28T00:15:26+05:30 IST