ప్రభుత్వ ఉద్యోగం అధికారం కాదు.. బాధ్యత
ABN, First Publish Date - 2023-06-11T00:14:22+05:30
ప్రభుత్వ ఉద్యోగం అధికారం కాదని, బాధ్యత అని గుర్తించి సేవలందించాలని కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ సూచించారు. కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన తెలంగాణ సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు.
- కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ
పెద్దపల్లి, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగం అధికారం కాదని, బాధ్యత అని గుర్తించి సేవలందించాలని కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ సూచించారు. కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన తెలంగాణ సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల వద్దకు ప్రభుత్వ పాలన, పథకాలను అందించేందుకు ప్రభుత్వం పరిపాలన సులభతరం చేసిందన్నారు. నూతన జిల్లాలు రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలను ఏర్పాటు చేసిందన్నారు. పెద్దపల్లి నూతన జిల్లాను ఏర్పాటు చేయడంతో పాటు జిల్లాలో మూడు మండలాలను, రెండు మున్సిపాలిటీలను, 65 గ్రామపంచాయతీలను కొత్తగా ఏర్పాటు చేసుకున్నామన్నారు. నీటిపారుదల శాఖ, ఆర్‌అండ్‌బీ శాఖ మొదలగు శాఖలలో సైతం పునర్వ్యవస్థీకరణ జరిగిందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పాలనలో ఈ-గవర్నెన్స్ పెరిగిందని, ప్రజలు ఇంటి వద్ద నుంచి కూడా వారి సమస్యలపై దరఖాస్తు సమర్పించడానికి అవకాశం ఉందన్నారు. రైతులు పండిస్తున్న పంటను క్రాప్ బుకింగ్ ఆన్‌లైన్‌లో చేస్తున్నామని, ధరణి ద్వారా స్లాట్ బుక్ చేసుకొని కొద్ది సమయంలో రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని అన్నారు. ప్రభుత్వం వివిధ రకాల అనుమతులను సింగిల్ విండో ద్వారా అందించే పాలసీలను రూపొందించిందని, పరిశ్రమల స్థాపనకు, భవనాలు నిర్మాణానికి అనేక అనుమతులు అవసరమయ్యేవని, ప్రస్తుతం టీఎస్‌ఐపాస్ ద్వారా పరిశ్రమలకు, టీఎస్‌బీపాస్ ద్వారా భవన నిర్మాణాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే నిర్దిష్ట సమయంలో వివిధ శాఖల నుంచి రావాల్సిన అనుమతులు సమన్వయం చేసుకుంటూ అందిస్తున్నామని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారన్నారు. రాష్ట్రంలో ప్రజలకు మరింత విస్తృతంగా సేవలు అందించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని, సమాజంలో ప్రజలకు సేవ చేసే అమూల్యమైన అవకాశం మనకు లభించిందని దానిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే అధికారం కాదు బాధ్యత అని ప్రతి ఒక్కరూ గుర్తుంచు కోవాలని, చివరి లబ్ధిదారుడి వరకు సేవలు అందే దిశగా అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో కృషిచేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి లక్ష్మీనారాయణ, కుమార్ దీపక్, ఆర్డీవోలు వెంకట మాధవరావు, కె వీరబ్రహ్మచారి, డీఆర్‌డీవో శ్రీధర్, డీసీవో చంద్రమౌళి, ఆర్‌అండ్‌బీ ఈఈ నరసింహచారి, జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రమోద్‌కుమార్, ఆయా శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఏవోలు పాల్గొన్నారు.
Updated Date - 2023-06-11T00:14:22+05:30 IST