విదేశాల్లో వైద్య విద్యకు ఆసక్తి!
ABN, First Publish Date - 2023-06-26T03:40:33+05:30
విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించేందుకు రాష్ట్ర విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే నీట్ ఫలితాలు కూడా రావడంతో అనుకున్న సంస్థల్లో సీటు దొరికిన, దొరక్కపోయిన....
వివరాల కోసం కన్సల్టెన్సీలకు విద్యార్థుల క్యూ..
రాష్ట్రం నుంచి ఏటా 2 వేల మంది పయనం
రాష్ట్రాల్లో విదేశీ వర్సిటీల ఎడ్యుకేషన్ ఫెయిర్‌లు
ఎఫ్‌ఎంజీఈలో పాసవుతోంది 20% లోపే..
అన్ని తెలుసుకునే పంపాలంటున్న నిపుణులు
ఆషాఢమాసంలో జరిగే బోనాల సందడి షురూ అయ్యింది. గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ రెండో బోనాల ఉత్సవాల్లో భాగంగా గోల్కొండ కోట ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. పెద్ద సంఖ్యలో భక్తులు బోనాల ఊరేగింపులో పాల్గొన్నారు. అలాగే, హైదరాబాద్ లోయర్ ట్యాంక్‌బండ్ జగదీశ్ ఆలయం వద్ద శాతవాహన సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకలోనూ పెద్ద సంఖ్యలో మహిళలు బోనమెత్తారు.
హైదరాబాద్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించేందుకు రాష్ట్ర విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే నీట్ ఫలితాలు కూడా రావడంతో అనుకున్న సంస్థల్లో సీటు దొరికిన, దొరక్కపోయిన ఏ దేశంలో మెడిసిన్ చదివితే బాగుంటుందన్న దానిపై కన్సల్టెన్సీల ద్వారా ఆరా తీస్తున్నారు. తెలిసిన వారి ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. తమ ఆర్థిక పరిస్థితి మేరకు ఏ దేశమైతే బాగుంటుందనేది ఇంటర్నెట్‌లో వెతికి మరీ తెలుసుకుంటున్నారు. ఏటా తెలంగాణ నుంచి సుమారు 2 వేల మంది మెడిసిన్ చదివేందుకు విదేశాలకు వెళ్తున్నారని అంచనా.. ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఆ పది దేశాలకే ఎక్కువగా..
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా పది దేశాల్లో మెడిసిన్ చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. వాటిలో రష్యా, ఉక్రెయిన్, జార్జియా, చైనా, బిట్రన్, అమెరికా, జర్మనీ, కెనడా, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, వియత్నాం, పోలెండ్ వంటి దేశాలున్నాయి. ఇందులో రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కారణంగా ప్రస్తుతం ఉక్రెయిన్‌కు వెళ్లేందుకు విద్యార్థులు ఆసక్తి చూపట్లేదు.. మరోవైపు రష్యా 2023-24 విద్యా సంవత్సరానికి గాను 5 వేల మంది భారత విద్యార్థులకు మెడిసిన్ సీట్లు ఆఫర్ చేస్తోంది. అక్కడి యూనివర్సిటీలు సైతం జాతీయ వైద్య కమిషన్ రెగ్యులేషన్స్‌కు తగ్గట్లుగా ఇంగ్లిషు మీడియంలో వైద్య విద్యను అందిస్తున్నాయి. మొత్తంగా ఆరేళ్ల వైద్య విద్యకు రూ.25 లక్షల టూష్యన్ ఫీజును అక్కడి యూనివర్సిటీలు వసూలు చేస్తున్నాయి. ఆ దేశానికి చెందిన నాలుగైదు యూనివర్సిటీలు దేశంలోని పలు రాష్ట్రాల్లో మెడికల్ ఎడ్యుకేషన్ ఫెయిర్‌లను సైతం నిర్వహిస్తున్నాయి. ఇక వివిధ దేశాల యూనివర్సిటీలు వాటి గ్రేడ్ల మేరకు ఫీజును వసూలు చేస్తున్నాయి. జార్జియాలోని వర్సిటీలు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు.. కెనడా వర్సిటీలు కనీసంగా రూ.కోటిన్నరకు పైగానే వసూలు చేస్తున్నాయి.
తల్లిదండ్రులు చూస్తోంది ఇవే..
విదేశాలకు వెళ్లే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రధానంగా ఐదారు అంశాలపై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా ఆయా దేశాల్లో భద్రత గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. విదేశాలకు వెళ్తున్న వారిలో అమ్మాయిలే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో ఎక్కడ ఎక్కువ భద్రత ఉంటుందనేది తెలుసుకున్న తర్వాతే ఆ దేశాలకు పిల్లలను పంపుతున్నారని ఏజెన్సీలు చెబుతున్నాయి. ఇక రెండోది ఇంగ్లిషులోనే మెడిసిన్ ఉంటుందా లేదా అన్న దానికి ప్రాధాన్యతనిస్తున్నారు. చైనా లాంటి కొన్ని దేశాల్లో వారి భాషల్లోనే వైద్య విద్య బోధన చేస్తుంటాయి. దాంతో మన విద్యార్థులకు పూర్తిగా అర్థం కాక ఎక్కువగా నేర్చుకోలేకపోతున్నారు. అందుకే ఇంగ్లిషులో మెడిసిన్ విద్య ఉండే దేశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక మూడోది జాతీయ వైద్య కమిషన్ రెగ్యులేషన్స్‌కు తగ్గట్లుగా 54 నెలల మెడికల్ కోర్సు, 12 నెలల ఇంటర్న్‌షి్‌పను ఉందా లేదా తెలుసుకుంటున్నారు. నాల్గోది ఏ దేశంలో చదివిన వారు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్‌ఎంజీఈ)ను పాసవుతున్నారో చెక్ చేసుకుంటున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
వైద్య విద్య కోసం విదేశాలకు పిల్లలను పంపే ముందు తల్లిదండ్రులు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కొన్ని కన్సల్టెన్సీలు ఆరేళ్ల ఫీజు ముందే తీసేసుకుంటున్నాయి. కొన్నిసార్లు యూనివర్సిటీలకు చెల్లించడం లేదు. దీంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలా కాకుండా యూనివర్సిటీకే నేరుగా ఫీజులు చెల్లిస్తున్నాయా లేదా అన్నది చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే అక్కడ వర్సిటీల్లో ఇక్కడి కన్సల్టెన్సీలు చెబుతున్నట్లు ఫ్యాకల్టీ, మౌలిక సదుపాయాలు, కాలేజీలకు అనుబంధ ఆస్పత్రులున్నాయో లేదా చెక్ చేసుకోవాలి అంటున్నారు. కొన్ని దేశాల్లో మానవ శరీరానికి బదులుగా టాయ్స్(బొమ్మ)లను చూపించి, శరీరాకృతి, ఇతర అంశాల గురించి వివరిస్తారు. మనదేశంలో మానవ శరీరాన్ని కోసి ఏ భాగం ఏ విధంగా పనిజేస్తుంది? ఎటువంటి సమస్యలొస్తాయి? అన్నది నేరుగా చూపిస్తారు. దీంతో మానవ శరీరంపై అవగాహన, జబ్బులపై పట్టు లభిస్తుందని.. అలాంటి దేశాలనే ఎంచుకోవాలంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా తమ పిల్లలకు మెడిసిన్ చదవగల సత్తా ఉందా లేదా అన్నది తల్లిదండ్రులు గుర్తించాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆరేళ్ల పాటు చదివి, ఇక్కడికి వచ్చి ఎఫ్‌ఎంజీఈలో ఉత్తీర్ణత సాధించకపోతే ఉపయోగం ఉండదు. కేవలం 10 శాతం నుంచి 20 శాతం లోపే విద్యార్థులు ఎఫ్‌ఎంజీఈలో పాసవుతున్నారని వైద్య వర్గాలంటున్నాయి.
విదేశాలకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది
కొవిడ్ తర్వాత విదేశాల్లో మెడిసిన్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాలకు నుంచి ఒక్క జార్జియాకే 500-600 మంది వెళ్తున్నారు. వీసా ప్రక్రియ కూడా చేస్తున్నాం. అక్కడ చదువుతున్న విద్యార్థులతో ఇక్కడి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడిస్తున్నాం. అలాగే వీడియో కాల్ ద్వారా వసతి సౌకర్యం, కాలేజీ, మౌలికసదుపాయుయాలు ఎలా ఉన్నాయో నేరుగా చూపిస్తున్నారు. వారు కూడా ఇంటర్నెట్ ద్వారా శోధించి తెలుసుకుంటున్నారు. ఆ తర్వాతే చేరుతున్నారు.
- డాక్టర్ ఉదయ్‌కుమార్, రైట్‌పాత్ ఓవర్సీస్ మేనేజ్‌మెంట్, హైదరాబాద్
ఆ కాలేజీల్లోనే చేరితేనే మంచిది
విదేశాల్లో మెడిసిన్ చదవాలనుకునే వారు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ (ఎఫ్‌ఎంజీఈ) ఎక్కువగా పాసవుతున్న వారి కాలేజీలనే ఎంపిక చేసుకోవాలి. విదేశాల్లో మెడిసిన్ విద్యను ఆఫర్ చేసే యూనివర్సిటీలు ప్రమాణాలు పాటించడం లేదు. దాంతో ఇండియన్ ఫారిన్ మెడికోలు ఎఫ్‌ఎంజీ ఎగ్జామ్‌లో 20 శాతం కూడా పాసవ్వట్లేదు. తల్లిదండ్రులు కన్సల్టెన్సీలను గుడ్డిగా నమ్మొద్దు. ఎన్‌ఎంసీ వెబ్‌సైట్‌లో విదేశీ వర్సిటీల్లో వేటికి గుర్తింపు ఉందో చెక్ చేసుకోవాలి. తక్కువ ఖర్చు అని విదేశాలకు పంపుతున్నారు. అంత తక్కువకు ఆరేళ్ల కోర్సు ఆఫర్ చేస్తున్నారంటే ఏ మేరకుప్రమాణాలుంటాయో అర్థం చేసుకోవాలి.
- డాక్టర్ పుట్ట శ్రీనివాస్, వైద్య విద్య మాజీ సంచాలకులు
Updated Date - 2023-06-26T21:47:51+05:30 IST