Inter Board: ఇంటర్ బోర్డులో రచ్చ
ABN, First Publish Date - 2023-01-31T03:17:50+05:30
ఇంటర్ బోర్డులో మరో వివాదం తెరపైకి వచ్చింది. బోర్డు కార్యాలయంలో సీసీ కెమెరాల ట్యాంపరింగ్ జరిగిందంటూ అధికారులు ఆదివారం రాత్రి బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
మధుసూదన్ రెడ్డిపై బోర్డు అధికారుల ఫిర్యాదు
సీసీ కెమెరాల పాస్‌వర్డ్ మార్చినట్టు కేసు నమోదు
బోర్డులో భద్రత వ్యవస్థ ట్యాంపరింగ్‌కు గురైంది
ఇంటర్ బోర్డును ఓ అదృశ్య వ్యక్తి నడిపిస్తున్నాడు
అధికారిని బెదిరించి పాస్‌వర్డ్‌ను తస్కరించారు: బోర్డు కార్యదర్శి
ఆన్‌లైన్ వాల్యుయేషన్‌పై ముందుకేనని నవీన్ మిత్తల్ స్పష్టీకరణ
టెండర్లపై మాట్లాడినందుకే కేసు: మధుసూదన్ రెడ్డి
హైదరాబాద్, అఫ్జల్‌గంజ్ జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ఇంటర్ బోర్డులో మరో వివాదం తెరపైకి వచ్చింది. బోర్డు కార్యాలయంలో సీసీ కెమెరాల ట్యాంపరింగ్ జరిగిందంటూ అధికారులు ఆదివారం రాత్రి బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డిపై ఈ మేరకు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాంపల్లిలో ఉన్న బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్‌లోని కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ కార్యాలయంలోకి మధుసూదన్‌రెడ్డి అనుమతి లేకుండా ప్రవేశించి కంప్యూటర్‌లోని పాస్‌వర్డ్‌ను మార్చారని.. కొంత డేటా డిలీట్ చేశారని.. అంతటితో ఆగక తమపై దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించారని బోర్డు డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి మధుసూదన్‌రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని.. మంగళవారం మధుసూదన్‌రెడ్డికి నోటీసులు అందజేసి అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఆన్‌లైన్ వాల్యుయేషన్ టెండర్ పక్రియపై మధుసూదన్‌రెడ్డి రెండు రోజుల క్రితం పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపైనే అధికారులు పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేయడం గమనార్హం.
సూత్రధారులెవరో తేలుతుంది..
ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్‌మిత్తల్ సోమవారం దీనిపై విలేకరుల సమావేశం నిర్వహించారు. బోర్డులో భద్రత వ్యవస్థ ట్యాంపరింగ్‌కు గురైందని.. సీసీ కెమెరాలకు సంబంధించిన పాస్‌వర్డ్ చోరీ జరిగిందని.. కొంతమంది ఉద్దేశ్యపూర్వకంగానే ఈ పని చేశారని, దీన్ని గుర్తించగానే పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆయన చెప్పారు. దీని వెనుక సూత్రధారులెవరో, ఏ అవసరాల కోసం ఈ చర్యకు పాల్పడ్డారో దర్యాప్తులో తేలుతుందన్నారు. బోర్డుకు సంబంధించిన ఓ అధికారిని నేరచరిత్ర ఉన్న ఓ వ్యక్తి బెదిరించి, భయపెట్టి పాస్‌వర్డ్‌ను తస్కరించినట్టు ప్రాథమికంగా తెలిసిందన్నారు. దీనిపై శాఖాపరమైన విచారణకూ ఆదేశాలిచ్చినట్టు మిట్టల్ తెలిపారు. అంతేకాదు.. ఇంటర్ వ్యవస్థను ఒక వ్యక్తి గుప్పిట్లో పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. ‘‘నేను ఒక అధికారితో మాట్లాడిన విషయాలు మూడో వ్యక్తికి వెంటనే తెలిసిపోతున్నాయి. సీసీ కెమెరాల పాస్‌వర్డ్‌ను కూడా ప్రస్తుతం ఉద్యోగంలో లేని వ్యక్తి రన్ చేస్తున్నాడు. ఇలా ఇంటర్ బోర్డును ఓ అదృశ్యవ్యక్తి నడిపిస్తున్నాడు’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో ఆయన.. మీడియా కూడా పెయిడ్ న్యూస్ వేస్తోందని ఆరోపించడంతో విలేకరులు తీవ్ర నిరసన తెలిపారు. దీంతో మిట్టల్ క్షమించాలని కోరారు. మ్యాన్యువల్ వాల్యుయేషన్ ద్వారా డబ్బులు సంపాదించే వారు ఆన్‌లైన్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని, లేనిపోని అనుమానాలు, అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
కొంతమంది ఇంటర్ బోర్డును ఆదాయ వనరుగా మార్చుకున్నారని, ఇకపై వారి ఆటలు చెల్లవని చెప్పారు. అన్ని విషయాలూ ఆలోచించాకే ఈ ఏడాది నుంచి ఇంటర్ సమాధాన పత్రాల ఆన్‌లైన్ మూల్యాంకనం చేపడుతున్నామని మిట్టల్ తెలిపారు. దీనివల్ల మూల్యాంకనం పారదర్శకంగా ఉంటుందని, త్వరగా పూర్తవుతుందని, తప్పులు నివారించడం సాధ్యమని వివరించారు. ఇన్నాళ్లుగా విద్యార్థి రీ వాల్యుయేషన్ కోరితే జిల్లాల నుంచి పేపర్లు తెప్పించడంలో తీవ్ర జాప్యం జరిగేదని, ఆన్‌లైన్ విధానంలో ఆ పని వేగంగా అవుతుందని చెప్పారు. పేపర్లు దిద్దేవారికి ఇచ్చే టీఏ, డీఏ ఖర్చునూ నివారించవచ్చన్నారు. దీనికి సంబంధించిన టెండర్లలో ఎలాంటి అవకతవకలూ జరిగే ఆస్కారమే లేదన్నారు. ఇప్పటికే అన్ని దేశాలూ, విశ్వవిద్యాలయాలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయని, ఆన్‌లైన్ మూల్యంకనం కోసం అధ్యాపకులకు అవసరమైన శిక్షణ కూడా ఇస్తామని తెలిపారు. ఈ ఏడాది ప్రయోగాత్మకంగా ఆర్ట్స్, కామర్స్, భాషలకు చెందిన 35 లక్షల పేపర్లను ఆన్‌లైన్ ద్వారా వాల్యుయేషన్ చేస్తున్నట్టు తెలిపారు. రెండేళ్లలో ఈ విధానాన్ని పూర్తిగా విస్తరిస్తామన్నారు. ఇలాంటి కార్యక్రమంపై ఏ అర్హతా లేని, నేర చరిత్ర ఉన్న వ్యక్తి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. గతంలో ప్రైవేటు కాలేజీలు సమాధాన పత్రాలు ఎక్కడకు వెళ్తున్నాయో తెలుసుకుని దాన్ని తమక అనుకూలంగా మార్చుకునేవనే ఆరోపణలున్నాయని.. ఇప్పుడు అలాంటివి సాగవనే ఉద్దేశ్యంతో ఏసీబీ కేసులున్న వ్యక్తి పనిగట్టుకుని బోర్డ్ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడని ధ్వజమెత్తారు.
నా ప్రాణాలకు ముప్పు..
కొన్ని ఐటీ కంపెనీలతో కలిసి కొంతమంది అధికారులు తనకు హాని చేయడానికి సిద్ధమయ్యారని, తనను అంతం చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. భౌతికంగా తనకు ఏ హాని జరిగినా.. అందుకు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్‌మిత్తల్ బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. ఇంటర్ బోర్డును సవ్యంగా నిర్వహించలేక తనపై తప్పుడు అరోపణలు చేస్తున్నారని ఆయన వెల్లడించారు. నవీన్ మిట్టల్ చేసిన ఆరోపణలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఆయన కోరారు. తనపై నవీన్‌మిట్టల్ చేసిన ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. ఓ కార్పొరేట్ సంస్థకు ఆన్‌లైన్ వాల్యుయేషన్ టెండర్ కేటాయించి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న, అవినీతికి పాల్పడుతున్న మిట్టల్‌ను తక్షణమే బోర్డు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
Updated Date - 2023-01-31T03:48:44+05:30 IST