లక్ష కడితే.. రెండు లక్షలు
ABN, First Publish Date - 2023-09-13T01:13:33+05:30
లక్ష కడితే.. 20 నెలల్లో రెండు లక్షల రూపాయలు ముట్టచెబుతామంటూ ఓ కంపెనీ ఘరానా మోసానికి పాల్పడింది.
లక్ష కడితే.. రెండు లక్షలు
కంపెనీ ఘరానా మోసం
లబోదిబోమంటున్న బాధితులు
గట్టుప్పల్, సెప్టెంబనే 12: లక్ష కడితే.. 20 నెలల్లో రెండు లక్షల రూపాయలు ముట్టచెబుతామంటూ ఓ కంపెనీ ఘరానా మోసానికి పాల్పడింది. పలువురు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్‌కు చెందిన ఓ కంపెనీ నాలుగేళ్ల క్రితం ఏర్పడింది. తమకు లక్ష రూపాయలు చెల్లిస్తే నెలకు రూ.10 వేల చొప్పున 20 నెలల పాటు చెల్లిస్తామని ఒక స్కీంను ప్రారంభించారు. గ్రామాల్లో అమాయకపు ప్రజలను ఈ స్కీంలో చేర్పించేందుకు కంపెనీ కొంద రు కమీషన ఏజెంట్లను సైతం నియమించుకుంది. లక్షకు రెండు లక్షలు వస్తున్నాయనే ఆశతో వందలాది మంది ప్రజలు ఈ స్కీంలో చేరారు. ఇందులో మొదట చేరిన వారికి సక్రమంగానే డబ్బులు చె ల్లించారు. ఇలా రెండోసారి చేరిన వారికి కూడా డబ్బులు వచ్చాయి. దీంతో కంపెనీపై నమ్మకం ఏర్పడటంతో ఈ స్కీంలో చేరేందుకు ప్రజలు అధిక సంఖ్యలో ఆసక్తి చూపించారు. దీనిని ఆసరాగా చేసుకొన్న ఆ కంపెనీ లక్ష కడితే నెలకు రూ.8 వేల చొప్పున 25 నెలల పాటు చెల్లిస్తామని మరో స్కీంను ప్రారంభించింది. ఇందులో చేరిన వారికి కేవలం 6 నెలలు మాత్రమే రూ.8 వేల చొప్పున చెల్లించి ఆపేశారు. 10 నెలలు గడుస్తున్నా కంపెనీ డబ్బులు చెల్లించకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తమ డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారంటూ మంగళవారం ఉప్పల్‌లోని కంపెనీ కార్యాలయం వద్ద గట్టుప్పల్, మునుగోడు, చండూరు మండలాలకు చెందిన బాధితులు నిలదీశారు. పిల్లల చదువు కోసం, కుమార్తెల వివాహం కోసం దాచుకున్న డబ్బులను కమీషన ఏజెంట్ల మాటలు నమ్మి కంపెనీకి చెల్లించామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2023-09-13T01:13:33+05:30 IST