నేటి నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు
ABN, First Publish Date - 2023-02-21T04:09:48+05:30
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.
ఐదేళ్ల తర్వాత ప్రధానాలయంలో నిర్వహణకు ఏర్పాట్లు
27న ఎదుర్కోలు, 28న కల్యాణం, మార్చి 1న రథోత్సవం
పట్టు వస్త్రాలు సమర్పించనున్న కేసీఆర్ దంపతులు
యాదాద్రి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 3 వరకు 11 రోజుల పాటు వైభవంగా జరిగే ఈ ఉత్సవాలకు మంగళవారం ఉదయం 10 గంటలకు ఆగమ శాస్త్ర రీతిలో శ్రీకారం చుట్టనున్నారు. స్వామివారి విశేష అలంకారాలు, దివ్యవాహన సేవలు ఆలయ పునర్నిర్మాణం అనంతరం తొలిసారిగా ఈ ఏడాది ప్రధానాలయ ప్రాంగణంలోనే జరుగుతుండటంతో ఆధ్యాత్మిక శోభ సంతరించేకునేలా చలువ పందిళ్లు, విద్యుత్ కాంతులు విరజిల్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వేలాది మంది భక్తులు హాజరుకానుండడంతో అందుకు అనుగుణంగా వసతులు కల్పిస్తున్నారు. ఈ నెల 28న నిర్వహించే తిరుకల్యాణ వేడుకలకు సీఎం కేసీఆర్ దంపతులు హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు ఈ నెల 21న ఉదయం స్వస్తివాచనం, రక్షాబంధనం, 22న ఉదయం అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణం, సాయంత్రం భేరీపూజ, హవనం, 23న ఉదయం మత్స్యావతార అలంకార సేవ, రాత్రికి శేషవాహన సేవ, 24న ఉదయం వఠపత్రశాయి, రాత్రికి హంసవాహన అలంకార సేవ, 25న ఉదయం శ్రీకృష్ణాలంకార(మురళీకృష్ణుడు)సేవ, రాత్రికి పొన్న వాహన సేవ, 26న గోవర్ధనగిరిధారిగా, రాత్రికి సింహరూఢుడిగా అలంకార సేవ, 27న జగన్మోహుడి అలంకారం, రాత్రికి అశ్వవాహనంపై ఎదుర్కోలు, 28న తిరుల్యాణ మహోత్సవం, మార్చి 1న దివ్య విమాన రథోత్సవం, శ్రీమహావిష్ణువు అవతారంలో గరుడవాహన సేవ, రాత్రికి ప్రధానాలయం తిరువీధుల్లో రథోత్సవం, 2న ఉదయం మహాపూర్ణాహుతి, చక్రతీర్థం, రాత్రికి శ్రీపుష్పయాగం, దోపోత్సవం నిర్వహిస్తారు. ఉత్సవాల చివరి రోజు 3న ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రికి శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి.
Updated Date - 2023-02-21T04:09:49+05:30 IST