ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sadabainama: సాదాబైనామా సంగతేంటి?

ABN, First Publish Date - 2023-07-12T04:02:04+05:30

సాదాబైనామా భూముల పరిష్కారం కోసం రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. దాదాపు మూడేళ్ల క్రితం స్వీకరించిన 9.24 లక్షల దరఖాస్తులను కేసీఆర్‌ ప్రభుత్వం మూలన పడేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరిశీలనకు నోచుకోని 9.24 లక్షల దరఖాస్తులు

మూడేళ్లుగా మూలన పడేసిన రాష్ట్ర ప్రభుత్వం

రైతుబంధు, బీమా, పరిహారానికి దూరంగా రైతులు

ఎన్నికలే లక్ష్యంగా పెండింగ్‌ అంశాలపై సీఎం దృష్టి

ఈ సారి ఎన్నికల్లోపైనా మోక్షం కలిగేనా?

పరిష్కారం చూపాలని కేసీఆర్‌కు రైతుల విన్నపాలు

హైదరాబాద్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి): సాదాబైనామా భూముల పరిష్కారం కోసం రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. దాదాపు మూడేళ్ల క్రితం స్వీకరించిన 9.24 లక్షల దరఖాస్తులను కేసీఆర్‌ ప్రభుత్వం మూలన పడేసింది. అధికారులు వాటిని పరిశీలించిన పాపాన పోలేదు. ఎన్నికలే లక్ష్యంగా పెండింగ్‌ పనులపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్‌ సాదాబైనామా దరఖాస్తులను పరిశీలించాలని రైతులు కోరుతున్నారు. సాదాబైనామా ద్వారా (తెల్లకాగితంపై) కొనుగోలు చేసిన భూములను లబ్ధిదారులు ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నారు. కబ్జాలో ఉంటూ సాగుచేసుకుంటున్నారు. ఆ భూములకు యజమానులుగా ఉన్నా డిజిటల్‌ పట్టాదారు పాస్‌పుస్తకాలు లేకపోవడంతో వారికి రైతు బంధు రావడం లేదు. రైతుబీమా వర్తించడం లేదు.

పంటనష్ట పరిహారం రావడం లేదు. బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్‌ డబ్బులు కూడా రావడం లేదు. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న సంక్షేమ పథకాలు వీరికి వర్తించడం లేదు. సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణకు ఎన్నో ఏళ్లుగా మోక్షం కలగడం లేదు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరిస్తారేమోనన్న ఆశతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఎదురు చూస్తున్నారు. ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న అంశాలపై దృష్టి సారిస్తోంది. ఇటీవల కేసీఆర్‌.. మంత్రులు, ఉన్నతాధికారులతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. ఇప్పటికే పలు కీలక సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు రూపొందించాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించిన విషయం తెలిసిందే.

ప్రధానంగా 58, 59 జీవోల కింద వచ్చిన దరఖాస్తుల క్రమబద్ధీకరణ, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేసే అంశానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం లాంటి కీలక నిర్ణయాలు జరిగిపోయాయి. నోటరీ ఆస్తుల క్రమబద్ధీకరణకు త్వరలోనే మార్గదర్శకాలు వెలువడనున్నాయి. అంతే కాకుండా గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేశారు. ఎన్నో ఏళ్లుగా చెబుతూ వస్తున్న 111 జీవోను రద్దు చేశారు. ఇలా అనేక దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేందుకు నిర్ణయం తీసుకుంటున్న ప్రభుత్వం తమ సమస్య పరిష్కారం దిశగా ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని సాదాబైనామా భూముల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కేబినెట్‌ భేటీలోనూ ఊసెత్తని వైనం

సాదాబైనామా సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా గాలికొదిలేసినట్లు అనిపిస్తోంది. భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్‌ సబ్‌ కమిటీ, ఇటీవల సీఎం కేసీఆర్‌ అధ్యక్షత నిర్వహించిన కేబినేట్‌ సమావేశాల్లో ఈ విషయాన్ని ఇప్పటి వరకు ప్రస్తావించన దాఖలాలు లేవు. ధరణిలో పోర్టల్‌లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కొత్త మాడ్యూల్స్‌ జారీకి సబ్‌ కమిటీ ప్రతిపాదనలు చేసింది. కానీ సాదాబైౖనామా అంశాన్ని ఏనాడూ ప్రస్తావించలేదు. ఈ సమస్య పరిష్కారం పట్ల సర్కారు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

హైకోర్టుకు చేరిన అంశం

ప్రభుత్వం 2020 అక్టోబరు-నవంబరు మాసాల్లో మీసేవా కేంద్రాల ద్వారా అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. 2014 జూన్‌ 2కు ముందు తెల్లకాగితాలపై కొనుగోలు చేసి, ఆ భూమిని అనుభవిస్తున్న (కబ్జాలో) వారు మాత్రమే క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. 2020 అక్టోబరు 30 నుంచి కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చినందున దరఖాస్తుల స్వీకరణను ఆ ఏడాది నవంబరు 10 వరకు పొడిగించింది. మొత్తమ్మీద రెండు దఫాలుగా 9.24 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ఈ దరఖాస్తులను పరిష్కరించే క్రమంలో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఈ పక్రియకు బ్రేక్‌ పడింది.

అడుగు ముందుకు పడేనా?

గ్రామీణ ప్రాంతాల్లో సాదాబైనామా భూములకు హక్కులు కల్పించే విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామంటూ ప్రభుత్వం పదే పదే చెబుతున్నా కార్యరూపం దాల్చడం లేదు. గతంలో చెప్పిన ప్రకటనలే తప్పా ఇప్పటి వరకు అడుగు కూడా ముందుకు పడటం లేదు. వీటి విషయంలో కేబినెట్‌ సబ్‌ కమిటీ ఎలాంటి విధానపరమైన నిర్ణయమూ తీసుకోలేదు. సాదాబైనామా అంశాన్ని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని 9.24 లక్షల మంది దరఖాస్తుదారులు కోరుతున్నారు. పాత రెవెన్యూ చట్టం ప్రకారం ఫీజు కట్టించుకొని తహసీల్దార్ల ద్వారా క్రమబద్థీకరించే అవకాశం ఉండేది. ఈ చట్టాన్ని రద్దు చేయడంతో ధరణి వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఇందులో క్రమబద్ధీకరణకు ఆప్షన్‌ లేదు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన సబ్‌ కమిటీ తీసుకునే విధానపరమైన నిర్ణయాలపైనే ఈ సమస్య ముడిపడి ఉందని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు.

Updated Date - 2023-07-12T04:02:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising