SUN BURN: చినుకా.. కినుకా?
ABN, First Publish Date - 2023-06-19T02:41:37+05:30
తొలకరి జల్లులతో ఆహ్లాదంగా ఉండాల్సిన వాతావరణం నిప్పుల కొలిమిని తలపిస్తోంది.. జూన్ సగం గడిచినా చినుకు జాడ లేదు..!
10 రోజులుగా ఏపీలోనే ఆగిన రుతుపవనాలు
బలహీనంగా ఉండడంతో విస్తరణలో జాప్యం
రాష్ట్రంలో తీవ్రస్థాయిలో ఎండలు, వడగాలులు
2,3 రోజుల్లో నైరుతి విస్తరణకు చాన్స్..!
హైదరాబాద్, విశాఖపట్నం, అమరావతి, జూన్ 18(ఆంధ్రజ్యోతి): తొలకరి జల్లులతో ఆహ్లాదంగా ఉండాల్సిన వాతావరణం నిప్పుల కొలిమిని తలపిస్తోంది.. జూన్ సగం గడిచినా చినుకు జాడ లేదు..! సరికదా.. ఎండలు మండిపోతూ తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. నాలుగు నెలల నైరుతి సీజన్‌లో అత్యంత కీలకమైనది ఈ నెలనే. రుతు పవనాలేమో పది రోజులుగా ఏపీలో ఆగిపోయి రానంటూ మొరాయిస్తున్నాయి. బలహీనంగా ఉండడంతో వాటి విస్తరణలో జాప్యం చోటుచేసుకుంటోంది. ఇలా ఆలస్యమయ్యే కొద్దీ.. వర్షాల శాతం తగ్గుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో అదును దాటితే పంట దిగుబడి పడిపోతుందని అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే రుతుపవనాల రాక షెడ్యూల్ కంటే చాలా వెనుకబడింది. వాస్తవానికి తమిళనాడు, కేరళ తీరాన్ని ఈ నెల 8-9 తేదీల్లోనే తాకాయి. 10వ తేదీ నాటికి కర్ణాటక, ఏపీలోని రాయలసీమకు విస్తరించాయి. ఆ వెంటనే తెలంగాణకు రావాలి. కానీ, అక్కడినుంచి వాటి పురోగతి లేదు. ఏపీలోకీ ఆలస్యంగా ప్రవేశించిన రుతుపవనాలు.. ఆ రాష్ట్రమంతా విస్తరించకుండా ఉసూరనిపిస్తున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల మేరకు మరిన్ని ప్రాంతాలకు విస్తరించి విస్తారంగా వర్షాలు కురిసేందుకు మరింత సమయం పట్టే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమలోని మిగిలిన ప్రాంతాలకు సోమవారం రుతుపవనాలు విస్తరిస్తాయని ఏపీలోని వాతావరణ శాఖ తొలుత ప్రకటించింది. కానీ, వాతావరణంలో అనుకూల మార్పులు లేనందున మరో రెండు, మూడు రోజుల్లో పురోగతి ఉంటుందని ఆదివారం పేర్కొంది. సాధారణంగా రుతుపవనాలు జూన్ 15 నాటికి దక్షిణాది రాష్ట్రాలతో పాటు, బిహార్, జార్ఖండ్, ఒడిశాలోని చాలా ప్రాంతాలు, మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌ను కవర్ చేస్తాయి. గుజరాత్ దక్షిణ ప్రాంతాలకూ చేరతాయి. అయితే, ఆదివారం నాటికి దక్షిణ కొంకణ్, గోవా, కర్ణాటకలో సగం, రాయలసీమ, ఈశాన్య భారతం, సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లోని ఉప హిమాలయ, ఈశాన్య బిహార్‌కు విస్తరించాయి. సజావుగా సాగితే జూలై 5 నాటికి దేశమంతా విస్తరించి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. కానీ, ఇంతవరకు దేశంలో 25 శాతం కూడా వ్యాపించకపోవడం గమనార్హం.
మూడ్రోజుల్లో తీపి కబురు
నైరుతి రుతుపవనాలు 2-3 రోజుల్లో దక్షిణ భారతంలోని మరికొన్ని భాగాలకు విస్తరించే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు. దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా వాయువ్య, పశ్చిమ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే మూడు రోజులు తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. స్కైమెట్ సైతం చల్లని కబురు చెప్పింది. తూర్పు భారతం మీదుగా రుతుపవనాల పురోగతికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని వెల్లడించింది. రాజస్థాన్‌లోని మధ్య ప్రాంతాలపై ఉన్న అల్పపీడనం క్రమంగా యూపీలోని మధ్య ప్రాంతాల మీదుగా కదులుతుందని తెలిపింది. ఈ అల్పపీడనం బంగాళాఖాతం నుంచి రుతుపవన ప్రవాహాలను లాగుతుందని వివరించింది. కాగా, రాజస్థాన్‌లో కొనసాగుతున్న వాయుగుండం పూర్తిగా బలహీనమయ్యే వరకు దక్షిణాదిలో రుతుపవనాలు బలపడవని ఇస్రో వాతావరణ నిపుణుడు ఒకరు చెప్పారు. రానున్న 2 రోజుల్లో వాయుగుండం పూర్తిగా బలహీనమై, తర్వాత రెండు, మూడు రోజులకు గానీ ఏపీలో నైరుతి బలపడదన్నారు.
మండిన ఎండ.. వడగాలితో దడ
పెద్దపల్లి జిల్లా ఈసాల తక్కెళ్లపల్లిలో ఆదివారం అత్యధికంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మల్యాలపల్లి, అకినపల్లిలలో 44.4 డిగ్రీలు, జంబుగల (ఆసిఫాబాద్)లో 44.5, నేలకొండపల్లి (ఖమ్మం)లో 44.3, కుంచెవెల్లిలో (ఆసిఫాబాద్) 44, నేరేళ్లలో (జగిత్యాల) 43.9, యానంబైలు (భద్రాద్రి కొత్తగూడెం)లో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే మూడు రోజుల పాటు వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
వడదెబ్బతో మరో నలుగురి మృతి
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): రాష్ట్రంలో వడగాలులు హడలెత్తిస్తున్నాయి. వడదెబ్బతో చాలామంది మంచం పడుతున్నారు. నిత్యం ఐదారుగురు ఎండలకు పరిస్థితి విషమించి మరణిస్తున్నారు. తాజాగా మరో నలుగురు మృత్యువాతపడ్డారు. భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రానికి చెందిన గీత కార్మికుడు మార్క రాజు (38), ఖమ్మం జిల్లా బోనకల్ గ్రామానికి చెందిన కార్పెంటర్ పారుపల్లి సత్యనారాయణ (65), తల్లాడ మండలం మంగాపురం గ్రామానికి చెందిన పర్చూరి తిరుపతమ్మ (102), భద్రాద్రి జిల్లా కొత్తగూడెం రైల్వేస్టేషన్ (భద్రాచలం రోడ్)లో గుర్తు తెలియని యాచకురాలు (55) ఎండలకు అస్వస్థతకు గురై మృతి చెందారు.
Updated Date - 2023-06-19T02:41:45+05:30 IST