మల్లు స్వరాజ్యం జీవితం.. స్ఫూర్తిదాయక గ్రంథం
ABN, First Publish Date - 2023-03-21T03:59:12+05:30
మల్లు స్వరాజ్యం జీవితం ఓ స్ఫూర్తిదాయక గ్రంథం అని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ కోశాధికారి పుణ్యవతి అన్నారు.
ఐద్వా నాయకురాలు పుణ్యవతి
‘యోధ-స్వరాజ్యం యాదిలో’ పుస్తకావిష్కరణ
హైదరాబాద్ సిటీ, మార్చి20(ఆంధ్రజ్యోతి): మల్లు స్వరాజ్యం జీవితం ఓ స్ఫూర్తిదాయక గ్రంథం అని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ కోశాధికారి పుణ్యవతి అన్నారు. ఇవాళ అనుభవిస్తున్న స్వాతంత్య్ర ఫలాలన్నీ స్వరాజ్యం వంటి యోధుల త్యాగ ఫలమే అని ఉద్ఘాటించారు. నాటి నిజాం పాలిత హైదరాబాద్ రాజ్యంలో ఆర్‌ఎ్‌సఎస్ అడుగుపెట్టకుండా అడ్డుకున్న ఘనత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికే దక్కుతుందన్నారు. అయితే, తొలితరం ఉద్యమకారుల నెత్తుటి ధారలపై నడుస్తున్న మనం మాత్రం... పిల్లలను అమెరికా, ఆస్ట్రేలియా దేశాలకు పంపుతున్నామని, డబ్బు సంపాదనే ప్రధానం అని వారికి నూరిపోసేంత సంకుచితతత్వానికి చేరుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లు స్వరాజ్యం ప్రథమ వర్ధంతి సందర్భంగా ఐద్వా ఆధ్వర్యంలో సోమవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ‘‘యోధ-స్వరాజ్యం యాదిలో’’ పుస్తకాన్ని పుణ్యవతి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న వివిధ మహిళా సంఘాల నాయకులంతా మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం పుణ్యవతి మాట్లాడారు. దేశంలో హిందూత్వ శక్తులు ఇవాళ కట్టుబాట్లు, సంప్రదాయాల పేరుతో మహిళల స్వేచ్ఛను కాలరాస్తున్నాయని ఆమె ఆరోపించారు. ఈ తీరును ఆమె ‘నయా తాలిబానిజం’గా నిర్వచించారు. స్వరాజ్యం జీవితాన్ని తరచి చూడటం ద్వారా ప్రజాతంత్ర ఉద్యమాలను మరింత ముందుకు తీసుకెళ్లగలం అని నొక్కిచెప్పారు. అనంతరం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్ కె. శ్రీనివాస్ మాట్లాడారు. గత పోరాటాల చరిత్రలో స్వరాజ్యం కేవలం ఓ భాగంగా ఉండటానికి ఇష్టపడలేదని అన్నారు. తన తుదిశ్వాస వరకూ బిగించిన పిడికిలి ఎత్తిపట్టి, మతోన్మాద ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడదామనే గొప్ప సందేశాన్ని చాటారని పేర్కొన్నారు. ఇవాళ దేశం ఎదుర్కొంటున్న ప్రమాదం గురించి తగినంత ఆందోళన చెందడమే ఆమెకు మనం అర్పించే అసలైన నివాళి అని పేర్కొన్నారు. అనంతరం సీనియర్ జర్నలిస్టు తెలకపల్లి రవి మాట్లాడారు. తెలంగాణలోనే కాకుండా దేశంలోనే మహిళా చైతన్యానికి ప్రతీక, సమగ్రమైన పోరాటానికి ప్రతిబింబం స్వరాజ్యం అని అన్నారు. అనంతరం ఎంవీ ఫౌండేషన్ ప్రతినిధి ఎం. వెంకటరెడ్డి మాట్లాడారు. కేవలం మతతత్వ శక్తులనేగాక, లిక్కర్‌స్కాంతో సహా పాలకుల అవినీతికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు రాజీలేకుండా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హైమావతి సభాధ్యక్షత వహించగా, దండ్యాల ఇందిరా, ఆశాలత, జ్యోతి, ప్రజా గాయని విమలక్క, ప్రగతిశీల మహిళా సంఘం ఝాన్సీ, పీవోడబ్ల్యూ సంధ్య, భూమిక ఉమెన్స్ కలెక్టీవ్ కొండవీటి సత్యవతి, సామాజిక కార్యకర్త కాకర్ల సజయ, రైతు సంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, పశ్య పద్మ, ఐద్వా ఏపీ కార్యదర్శి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-21T03:59:12+05:30 IST