Telangana Debt : తెలంగాణ అప్పు 5.29 లక్షల కోట్లు
ABN, First Publish Date - 2023-02-14T02:59:29+05:30
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు కలిపి రూ.5.29 లక్షల కోట్ల మేర అప్పులు తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ప్రభుత్వం తీసుకున్నది రూ.2.83 లక్షల కోట్లు
కార్పొరేషన్ల పేరిట మరో రూ.1.49 లక్షల కోట్లు
గోదాముల నిర్మాణానికి నాబార్డు ఇచ్చింది 85 వేల కోట్లు
రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న అప్పు రూ.75వేల కోట్లే
లోక్‌సభలో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
తెలంగాణప్రభుత్వం చేసిన అప్పులు ఇలా..
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు కలిపి రూ.5.29 లక్షల కోట్ల మేర అప్పులు తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో ప్రభుత్వ అప్పులు రూ.2,83,452కోట్లు ఉండగా.. ప్రభుత్వం రంగ సంస్థలు, కార్పొరేషన్ల పేరిట చేసిన అప్పులు రూ.1,49,472 కోట్లు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సోమవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ ప్రభుత్వంపై రూ.75,577కోట్ల రుణ భారం మాత్రమే ఉందని తెలిపారు. 2014-15 నుంచి 2021-22 వరకు ఏడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.2,07,875కోట్ల మేర కొత్త అప్పులు చేయగా.. మొత్తంగా అది రూ.2,83,452 కోట్లకు చేరిందని వెల్లడించారు. దీనికి అదనంగా గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిఽధి కింద నాబార్డు నుంచి రూ.7,144 కోట్లు తీసుకుందని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు 2014 జూన్ నుంచి 2022 అక్టోబరు మధ్య 12 జాతీయ బ్యాంకుల నుంచి రూ.1,30,904 కోట్ల మేర అప్పులు తీసుకున్నాయనివెల్లడించారు.
ఇవి కాకుం డా.. గోదాముల నిర్మాణానికి వేర్‌హౌస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిధి కింద నాబార్డు రూ.92,728.89 కోట్లు మంజూరు చేసి రూ. 85,227.94 కోట్లను విడుదలచేసిందని తెలిపారు. ఆహార శుద్ధి నిధి కింద ఖమ్మం జిల్లా సత్తుపల్లి, బూర్గుపాడులో మెగా ఫుడ్ పార్కు ఏర్పాటుకు టీఎ్‌సఐఐసీకి రూ.2,883 కోట్ల మేర రుణాన్ని మంజూరు చేసి రూ. 1007.1కోట్లు విడుదల చేసిందని వెల్లడించారు. పలు ప్రాజెక్టుల నిర్మాణానికి మౌలిక సదుపాయాల అభివృద్ధి సహకారం కింద రూ.14516.65 కోట్లను మంజూరు చేసి.. 11424.66కోట్లను విడుదల చేసిందని వివరించారు.
Updated Date - 2023-02-14T03:54:47+05:30 IST