ప్రగతి భవన్‌ను పేల్చేయాలన్న రేవంత్‌పై చర్యలు తీసుకోండి
ABN, First Publish Date - 2023-02-09T03:50:55+05:30
ప్రగతి భవన్‌ను నక్సలైట్లు గ్రనైట్లు పెట్టి పేల్చివేసినా తమకు అభ్యంతరం లేదంటూ మంగళవారం రాత్రి ములుగు జిల్లా కేంద్రంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
డీజీపీకి ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు
మాజీ నక్సలైటైన సీతక్క ప్రోద్బలంతోనే
ఆ వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు
పలు పోలీస్ స్టేషన్లలోనూ రేవంత్‌పై ఫిర్యాదు
హైదరాబాద్/మహబూబాబాద్ టౌన్/ములుగు/ ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): ప్రగతి భవన్‌ను నక్సలైట్లు గ్రనైట్లు పెట్టి పేల్చివేసినా తమకు అభ్యంతరం లేదంటూ మంగళవారం రాత్రి ములుగు జిల్లా కేంద్రంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. రేవంత్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎల్. రమణ, శంబీపూర్ రాజు, తక్కెళ్లపల్లి రవీందర్, తాతా మధు, దండె విఠల్‌లు బుధవారం హైదరాబాద్‌లో డీజీపీ అంజనీకుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. సీఎం పరిపాలన కార్యాలయం, ప్రగతిభవన్‌ను డైనమెట్లు పెట్టి పేల్చివేయాలని మాట్లాడడం అప్రజాస్వామికమన్నారు. చట్టసభలో సభ్యుడిగా ఉండి అధికార భవనాలను కూల్చివేయాలని మాట్లాడడమంటే ఖచ్చితంగా ఇది చట్టవ్యతిరేక చర్యగా భావించాలని వారు కోరారు. నక్సలైట్ వలే విధ్వంసాన్ని సృష్టించేందుకు యత్నిస్తున్న రేవంత్‌రెడ్డికి ఎంపీగా కొనసాగే అర్హత లేదని, ఆయనపై అనర్హత వేటు వేయాలని పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎల్. రమణ లోకసభ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. బుధవారం శాసనమండలి మీడియా పాయింట్‌లో వారు విలేకరులతో మాట్లాడు తూ.. రేవంత్‌కు ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని విమర్శించారు.
రేవంత్‌పై పీడీ యాక్టు పెట్టాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. రేవంత్ వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేతలు సమర్థిస్తారా అని ప్రశ్నించారు. మరోవైపు బీఆర్‌ఎస్ ములుగు మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్ ఆధ్వర్యంలో స్థానిక పోలీసు స్టేషన్‌లో మంగళవారం రాత్రి రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్కపై ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి నివాసం ఉండే ప్రభుత్వ అధికారిక భవనాన్ని పేల్చివేయాలని నిషేధిత మావోయిస్టులకు బహిరంగంగా పిలుపునివ్వడం వెనుక కుట్రకోణం దాగి ఉందని ఆరోపించారు. ముఖ్యమంత్రి ప్రాణానికి హాని చేయడానికి నక్సలైట్లతో లోపాయికారికంగా ఒప్పందం జరిగిందని, మాజీ నక్సలైట్ అయిన ఎమ్మెల్యే సీతక్క ప్రోద్బలంతోనే ఆ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. బుధవారం ములుగులో జాతీయ రహదారిపై, మంగపేటలోనూ రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ మీడియా తో మాట్లాడుతూ రేవంత్‌పై పీడీ యాక్టు నమోదు చేయాలన్నారు. రేవంత్ వ్యాఖ్యలపై మావోయిస్టులు స్పం దించాలన్నారు. భూపాలపల్లి పోలీ్‌సస్టేషన్‌లో రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.
Updated Date - 2023-02-09T03:50:56+05:30 IST