సీనియర్ జర్నలిస్టు రాజేశ్వరరావు కన్నుమూత
ABN, First Publish Date - 2023-03-08T03:30:38+05:30
సీనియర్ పాత్రికేయుడు చెన్నమనేని రాజేశ్వరరావు(83) అనారోగ్యంతో కన్నుమూశారు.
పలు జర్నలిస్టు సంఘాల నాయకుల నివాళి
హైదరాబాద్ సిటీ, మార్చి7 (ఆంధ్రజ్యోతి): సీనియర్ పాత్రికేయుడు చెన్నమనేని రాజేశ్వరరావు(83) అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి చనిపోయారు. రాజేశ్వరరావు స్వస్థలం కరీంనగర్ జిల్లా వెదిర గ్రామం. ‘డైలీన్యూస్’ ఆంగ్లపత్రికలో సబ్‌ఎడిటర్‌గా 1950వ దశకంలో రాజేశ్వరరావు పాత్రికేయ జీవితం ప్రారంభించారు. ‘ఆంధ్ర పత్రిక’, ‘ఆంధ్రజ్యోతి’, ‘డెక్కన్ క్రానికల్’, ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ తదితర పత్రికల్లో సుదీర్ఘకాలం పనిచేశారు. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ప్రభుత్వాల్లో సమాచార వ్యవహారాల సలహాదారుగా వ్యవహరించారు. రాజేశ్వరరావు మృతిపట్ల ఇండియన్ జర్నలిస్టుల యూనియన్, తెలంగాణ రాష్ట్రవర్కింగ్ జర్నలిస్టుల సంఘం ప్రతినిధులతోపాటు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సంతాపం ప్రకటించారు. మంగళవారం తిరుమలగిరిలోని స్వగృహంలో రాజేశ్వరరావు భౌతికకాయాన్ని సీనియర్ జర్నలిస్టులు రామచంద్రమూర్తి, శ్రీనివాసరెడ్డి, లక్ష్మణరావు, రచయిత వెల్చాల కొండలరావు సందర్శించి, నివాళులర్పించారు. రాజేశ్వరరావు అంత్యక్రియలు తిరుమలగిరిలోని హస్మత్‌పేట స్వర్గవాటికలో ముగిశాయి.
Updated Date - 2023-03-08T03:30:38+05:30 IST