రాయలసీమ ఎత్తిపోతలతో తెలంగాణకు అన్యాయం
ABN, First Publish Date - 2023-02-12T04:23:15+05:30
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా బేసిన్‌లో నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే తెలంగాణ రాష్ట్రానికి తీరని నష్టం కలుగుతుందని సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
పాలమూరు-రంగారెడ్డి సహా ప్రాజెక్టుల నత్తనడక
అసెంబ్లీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా బేసిన్‌లో నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే తెలంగాణ రాష్ట్రానికి తీరని నష్టం కలుగుతుందని సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రోజుకు 10 టీఎంసీల నీటిని తీసుకెళ్లేలా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుకు రూపకల్పన చేసిందని, అదే జరిగితే కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి, శ్రీశైలం, నాగార్జున సాగర్ ఎడమ కాలువలకు సాగునీరు రాదని, ఖమ్మం జిల్లాలోని వైరా, మధిర, సత్తుపల్లి ప్రాంతాలకు తాగునీటికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో శనివారం పద్దులపై జరిగిన చర్చలో భట్టి మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డితో సహా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం నత్తనడకన సాగుతోందన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కాలగర్భంలో కలిపేసి రంగారెడ్డి జిల్లాకు సాగునీరు రాకుండా చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు చెబుతున్నారని, డిస్ట్రిబ్యూటరీ కాలువలే నిర్మించనపుడు అదెలా సాధ్యమైందని ప్రశ్నించారు. బయటి నుంచి వచ్చినవాళ్లకు ప్రాజెక్టు చూపించి భజన చేయించుకుంటున్నారని, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను మాత్రం ప్రాజెక్టుకు పోనీయకుండా అరెస్టులు చేస్తున్నారన్నారు.
మమ్మల్ని కట్టేసి కొరడా వాళ్లకిచ్చి కొట్టించినట్లు ఉంది!
అసెంబ్లీలో అధికార పక్ష సభ్యులు మాట్లాడేందుకే ఎక్కువ సమయం ఇస్తున్నారని, ప్రతిపక్ష పార్టీల సభ్యుల గొంతు నొక్కుతున్నారని భట్టి అన్నారు. ‘మమ్మల్ని కట్టేసి... కొరడా వాళ్లకిచ్చి కొట్టించినట్లు’ అసెంబ్లీలో పరిస్థితి తయారైందన్నారు. మైకు అడిగిన ప్రతిసారి తాము ఐదుగురే ఉన్నామని అంటున్నారని, ప్రతిపక్ష సభ్యులు ఒక్కరున్నా కూడా ప్రజా సమస్యలను వినిపించటమే ప్రజాస్వామ్యమని అన్నారు. దీనిపై మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ మీరు సరిగా పనిచేయలేదనే ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని, తమపై నమ్మకం ఉన్నందుకే వరుసగా రెండుసార్లు అఽధికారం ఇచ్చారన్నారు. మూడోసారి కూడా గెలిచేది బీఆర్‌ఎస్ పార్టీయేనని, తమ నాయకుడు కేసీఆర్ అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని, మళ్లీ అదే సబ్జెక్టుపై ఎందుకు మాట్లాడుతున్నారని, 13 డిమాండ్లపై మాట్లాడటానికి సమయం సరిపోదని స్పీకర్ పోచారం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. భట్టి స్పందిస్తూ అవినీతి జరగలేదని మీరెలా చెబుతారని ప్రశ్నించారు. ‘ఐ యామ్ ద ఎవిడెన్స్... నన్ను బెదిరిస్తారా?‘ అని పోచారం ప్రతిస్పందించారు. ‘మిమ్మల్ని బెదిరించేంత ధైర్యం మాకు ఉందా?’ అని భట్టి వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-02-12T04:23:16+05:30 IST