Hyderabad City: రాజేశ్‌గౌడ్ మోసాలు ఎన్నెన్నో!
ABN, First Publish Date - 2023-01-15T00:44:20+05:30
నకిలీ భూమిపత్రాలతో ఎన్నారైని మోసం చేసిన కేసులో పరారీలో ఉన్న సస్పెండెడ్ ఆర్‌ఐ కర్నాటి రాజేశ్‌గౌడ్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
సస్పెండైన ఆర్‌ఐ నేరాలు వెలుగులోకి
రెవెన్యూ శాఖలో పలువురి సహకారం!
పోలీసులను ఆశ్రయిస్తున్న బాధితులు
హైదరాబాద్ సిటీ, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): నకిలీ భూమిపత్రాలతో ఎన్నారైని మోసం చేసిన కేసులో పరారీలో ఉన్న సస్పెండెడ్ ఆర్‌ఐ కర్నాటి రాజేశ్‌గౌడ్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు, పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పిస్తానని రాజేశ్‌గౌడ్ పలువురిని మోసం చేసి రూ.లక్షలు వసూలు చేశాడు. దీనిపై వనస్థలిపురం పోలీ్‌సస్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. ధరణి వెబ్‌సైట్‌లో మార్పులు చేయించడం, నకిలీ పత్రాలతో సొసైటీకి చెందిన భూమిని ఎన్నారైకి విక్రయించేందుకు అంబర్‌పేట ఇన్‌స్పెక్టర్‌తో కలిసి చేసిన ప్రయత్నం బెడిసికొట్టడంతో రాజేశ్‌గౌడ్‌పై మరో కేసు నమోదైంది. మంచాల, మహేశ్వరం, మొయినాబాద్‌లో రెవెన్యూశాఖలో కొంతకాలం పనిచేయడం వల్ల ఆ శాఖలో ఉన్న పరిచయాలతో ధరణి పోర్టల్‌లో మార్పులు చేయించినట్లు, ఇతడి మోసాలకు రెవెన్యూ శాఖలో కొంతమంది సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు వివరాలు బహిర్గతం కావడంతో రాజేశ్‌గౌడ్‌పై ఫిర్యాదు చేసేందుకు మరికొంత మంది బాధితులు వనస్థలిపురం పోలీ్‌సస్టేషన్ వద్దకు చేరుకున్నారు. ప్లాట్ రెగ్యులరైజేషన్, ధరణి పోర్టల్‌లో మార్పులు చేయిస్తానంటూ పలువురి నుంచి రాజేశ్‌గౌడ్ అందినకాడికి దండుకున్నాడు. సస్పెండయినా తీరు మార్చుకోకుండా నకిలీ ఐడీ కార్డులు చూపించి మరికొంత మందిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
రిటైర్ట్ ఎక్సైజ్ ఎస్సై నుంచి రూ.12 లక్షలు..
సస్పెన్షన్‌కు గురైన తర్వాత రాజేశ్‌గౌడ్ నకిలీ ఐడీ తయారు చేసుకొని ఎక్సైజ్ శాఖలో ఎస్సైగా పనిచేసి రిటైరయిన అధికారిని మోసం చేశాడు. ఆ అధికారి తనకు వికారాబాద్‌లో ఉన్న స్థలాన్ని క్రమబద్ధీకరించుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. రాజేశ్‌గౌడ్ పరిచయమయ్యాడు. తాను తహసీల్దార్‌గా పనిచేస్తున్నానని, స్థలాన్ని క్రమబద్ధీకరింపజేయిస్తానని చెప్పి, సర్వేయర్, వెరిఫికేషన్ పేరు చెప్పి పలు దఫాలుగా రూ.12 లక్షల వరకు వసూలు చేశాడు. మళ్లీ డబ్బులు డిమాండ్ చేయడంతో నిలదీయగా ముఖం చాటేశాడు.
Updated Date - 2023-01-15T12:16:40+05:30 IST