పన్ను కట్టకపోతే.. ఆస్తులు జప్తు
ABN, First Publish Date - 2023-03-02T01:29:43+05:30
జీహెచ్‌ఎంసీ కఠిన నిర్ణయాలకు సిద్ధమవుతోంది. .
పలు సర్కిళ్లలో వారెంట్లు జారీ
ఇప్పటికే రెడ్ నోటీసులు
పన్ను వసూలుపై ప్రత్యేక దృష్టి
మొండి బకాయిదారుల వివరాలేవి..?
అందుబాటులో లేని వైనం
ఇప్పటి వరకు రూ.1,514 కోట్లు వసూలు
అత్యధికంగా శేరిలింగంపల్లిలో రూ.205 కోట్లు
అత్యల్పంగా ఫలక్‌నుమాలో రూ.8.8 కోట్లు
ఆస్తి పన్ను వసూళ్లే లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ కఠిన నిర్ణయాలకు సిద్ధమవుతోంది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు చేరుకుంటున్న నేపథ్యంలో బకాయిదారులపై ప్రత్యేక దృష్టి సారించింది. చట్టపరమైన చర్యలకు శ్రీకారం చుడుతోంది. వారికి ఇప్పటికే రెడ్ నోటీసులు జారీ చేసింది. తాజాగా వారెంట్ల జారీ మొదలు పెట్టింది. నిర్ణీత గడువులోపు పన్ను బకాయిలు చెల్లించని పక్షంలో ఆస్తుల సీజ్‌కు రంగం సిద్ధం చేస్తోంది.
హైదరాబాద్ సిటీ, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ఆస్తి పన్ను వసూళ్లపై అధికారులు దృష్టి సారించారు. దాదాపు అన్ని సర్కిళ్లలో బకాయిదారులకు వారెంట్లు జారీ చేస్తున్నట్లు చెబుతున్నారు. జీహెచ్‌ఎంసీ చట్టం సెక్షన్ 269 ప్రకారం వారెంట్ (డిస్ర్టెస్ నోటీ్‌స)లు ఇస్తున్నారు. ఇప్పటికే దాదాపు ఐదు లక్షల మందికి సెక్షన్ 213 కింద రెడ్ నోటీసులు జారీ చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.2000 కోట్ల పన్ను వసూలు చేయాలని జీహెచ్‌ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఫిబ్రవరి 28 వరకు రూ.1514.39 కోట్ల పన్ను వసూలైంది. 30 రోజుల్లో లక్ష్యాన్ని చేరుకునేందుకు రోజు వారీగా ప్రణాళికలు నిర్దేశించారు. పన్ను చెల్లించని వారి భవనాల్లో ఉన్న ఫర్నిచర్, ఇతరత్రా వస్తువులు, బకాయి మొత్తాన్ని బట్టి భవనాన్నీ సీజ్ చేస్తామని ఓ అధికారి చెప్పారు. బకాయి పన్నుపై వడ్డీ పడుతుందన్న అధికారుల హెచ్చరికల నేపథ్యంలో మంగళవారం రూ.20 కోట్ల పన్ను వసూలు కావడం గమనార్హం.
టాప్ డిఫాల్టర్ల వివరాలేవి..?
గతంలో టాప్-100, 500, 1000 బకాయిదారులను గుర్తించి వారి నుంచి పన్ను వసూలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించే వారు. పలుమార్లు నోటీసులిచ్చినా స్పందించని వారి పేర్లను హోర్డింగ్‌లపై ప్రదర్శించడం, పత్రికలు, ప్రసార మాధ్యమాలకు ఇవ్వడం వంటివి చేశారు. దీంతో పరువు పోతుందని భావించి చాలా మంది పన్ను చెల్లింపునకు ఆసక్తి చూపేవారు. కొన్నేళ్లుగా ఈ ప్రక్రియకు స్వస్తి పలికారు. టాప్ బకాయిదారుల వివరాలు సర్కిళ్ల అధికారులకు అందించడం లేదు. ఇది కూడా పన్ను వసూళ్లపై ప్రభావం చూపుతోంది.
వసూళ్లలో టాప్ శేరిలింగంపల్లి
అత్యధికంగా శేరిలింగంపల్లి సర్కిల్‌లో రూ.205.51 కోట్ల పన్ను వసూలైంది. రూ.152.81 కోట్లతో రెండో స్థానంలో జూబ్లీహిల్స్, రూ.122.07 కోట్లతో ఖైరతాబాద్ మూడో స్థానంలో ఉంది. ఎప్పటిలానే చార్మినార్ జోన్‌లో పన్ను వసూలు అంతంతమాత్రంగా సాగుతోంది. అత్యల్పంగా ఫలక్‌నుమాలో రూ.8.8 కోట్లు, చాంద్రాయణగుట్టలో రూ.9.39 కోట్లు వసూలైంది. సంస్కరణల్లో భాగంగా జీహెచ్‌ఎంసీ అమలులోకి తీసుకువచ్చిన స్వీయ మదింపు ప్రక్రియ పన్ను వసూళ్లపై ప్రభావం చూపుతోంది. ‘పౌరులు ఆన్‌లైన్‌లో ఆస్తి మదింపు కోసం దరఖాస్తు చేసుకుంటారు.. ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు భవనాల వద్దకు వెళ్లవద్దు’ అని కమిషనర్ లోకే్‌షకుమార్ గతంలో ఆదేశించారు. దీంతో మదింపు బాధ్యతలు లేనప్పుడు.. వసూలుతో మాకేం పని అన్నట్టుగా కొందరు బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై ఫిర్యాదులు అందడంతో పన్ను వసూలు చేయాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరించారు. దీంతో బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు కూడా క్షేత్రస్థాయిలో పన్ను వసూళ్లకు రంగంలోకి దిగారు.
Updated Date - 2023-03-02T01:31:02+05:30 IST