పంట నష్టపోయిన రైతులను ఆదుకోండి
ABN, First Publish Date - 2023-03-20T02:23:21+05:30
అకాల వర్షాలు, వడగండ్ల వానలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని..
మంత్రి నిరంజన్‌రెడ్డిని కలిసిన జగ్గారెడ్డి, కోదండరెడ్డి..వీహెచ్, గడ్డం ప్రసాద్, రాములు నాయక్
వరికి ఎకరాకు రూ.12 వేలు చెల్లించాలి
మిగతా పంటలకూ పరిహారమివ్వాలి: జగ్గారెడ్డి
హైదరాబాద్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): అకాల వర్షాలు, వడగండ్ల వానలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని.. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి, కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, పార్టీ సీనియర్ నేతలు వి. హన్మంతరావు, గడ్డం ప్రసాద్, రాములు నాయక్‌లు కోరారు. మంత్రుల క్వార్టర్స్‌లో ఆదివారం మంత్రి నిరంజన్‌రెడ్డిని కలిసిన వారు.. ఈ మేరకు వినతిపత్రం అందించారు. అనంతరం మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అనుకోకుండా పడిన వర్షాలు, వడగండ్ల కారణంగా వరి, కూరగాయలు, ఆకుకూరలు.. ఇతర పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టానికి గాను రైతులకు వెంటనే పరిహారం ఇవ్వాలని మంత్రి నిరంజన్‌రెడ్డిని కోరినట్లు వెల్లడించారు. కూరగాయలు, ఆకుకూర పంటల నష్టానికి ఎకరాకు రూ.35 వేల చొప్పున, వరి పంటకు ఎకరాకు రూ.12 వేల చొప్పున, మొక్కజొన్నకు ఎకరాకు రూ.15 వేల చొప్పున, మామిడి తోటలకు ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని కోరామన్నారు.
అకాల వర్షాలు, వడగండ్ల వానల కారణంగా పంటలకు నష్టం జరిగిన ప్రాంతాలను సందర్శించాల్సిందిగా మంత్రిని కోరినట్లు తెలిపారు. పంట నష్టం జరిగిన ప్రాంతాలను కాంగ్రెస్ పార్టీ నేతలూ సందర్శించనున్నట్లు చెప్పారు. అకాల వర్షాల కారణంగా అనేక చోట్ల ఇళ్లు కూలిపోయాయన్నారు. ఇళ్ల స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం డబ్బులిస్తామని చెప్పిందంటూ గుర్తు చేసిన జగ్గారెడ్డి.. అకాల వర్షాల కారణంగా ఇళ్లు కూలిపోయిన వారికి.. తిరిగి ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల చొప్పున డబ్బులు ఇవ్వాలని కోరామన్నారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న కోళ్లు, డైరీ ఫారాల రుణాలకు వడ్డీ మాఫీ చేయాలన్నారు. ఆయా ఫారాల రైతులకు సబ్సిడీపైన దాణా సరఫరా చేయాలని కోరారు. షెడ్ల పునర్నిర్మాణానికి ఆర్థిక సాయం చేయాలని మంత్రిని కోరామని జగ్గారెడ్డి తెలిపారు. కాగా మంత్రి నిరంజన్‌రెడ్డి చెయ్యి విరిగిందని, ఇందుకు సంబంధించిన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నామని చెప్పారు.
Updated Date - 2023-03-20T02:23:21+05:30 IST