ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజారోగ్యానికి ‘ఫుడ్‌ సేఫ్టీ’ ఎసరు!

ABN, First Publish Date - 2023-04-12T02:45:03+05:30

రాష్ట్రంలో ఆహార భద్రత (ఫుడ్‌ సేఫ్టీ) వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది. ఆహార పదార్థాల కల్తీ పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ ఫుడ్‌ సేఫ్టీ విభాగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అస్తవ్యస్థంగా ఆహార భద్రత వ్యవస్థ

మామూళ్ల మత్తులో అధికారులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆహార భద్రత (ఫుడ్‌ సేఫ్టీ) వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది. ఆహార పదార్థాల కల్తీ పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ ఫుడ్‌ సేఫ్టీ విభాగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. మామూళ్ల మత్తులో పడి ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తూతూమంత్రంగా నమూనాలు సేకరిస్తున్నారు. హోటళ్లు, ఆహార పదార్థాల ఉత్పత్తి సంస్థల అక్రమాలను చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. ఆహార పదార్థాల కల్తీ, నాసిరకాలపై ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులందుతున్నాయి. వీటిని పరిశీలించి తనిఖీలు చేపట్టాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు గతంలోనే ఫుడ్‌ సేఫ్టీ అధికారులను ఆదేశించారు. దీంతో ఫిబ్రవరి చివరి వారం నుంచి మార్చి మొదటి వారం మధ్యలో కాస్త హడావుడి చేశారు. ఆకస్మిక తనిఖీలు చేపట్టి నమూనాలు సేకరించారు. ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. ప్రతీనెలా ఒక్కో ఫుడ్‌ సేఫ్టీ అధికారి తూతూమంత్రంగా ఆరు శాంపిల్స్‌ తీస్తున్నారు. కొందరైతే అవి కూడా తీయడం లేదు. హైదరాబాద్‌లో శానిటరీ ఇన్‌స్పెక్టర్లకే ఫుడ్‌సేఫ్టీ బాధ్యతలు అప్పగించారు. అయితే శానిటరీ ఇన్‌స్పెక్టర్లకు, ఫుడ్‌ సేఫ్టీకి ఏమాత్రం సంబంధం లేదు. ఆ విభాగం వేరుగా ఉండాలి. కానీ ఉన్నతాధికారుల పట్టించుకోవడం లేదు. గ్రేటర్‌ పరిధిలోని శానిటరీ ఇన్‌స్పెక్టర్ల ఒక్కో హోటల్‌ నుంచి ప్రతీ నెలా విధిగా రూ.5 వేల చొప్పున వసూలు చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. దీనిపై మంత్రి హరీశ్‌కు ఫిర్యాదులందాయి.

ఆహార పదార్థాల తనిఖీలు, నాణ్యతను పరిశీలించేందుకు ప్రభుత్వం 9 మంది అసిస్టెంట్‌ ఫుడ్‌సేఫ్టీ కంట్రోల్‌ అధికారులను నియమించాల్సి ఉంది. ఇందులో జోన్‌ 1లో 4 పోస్టులుండగా, జోన్‌ 2లో 5 పోస్టులున్నాయి. కానీ రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్నది ముగ్గురే.. ఇక ఇందులోనూ ఇద్దరిపై అవినీతి ఆరోపణలున్నాయి. ఒక అధికారిపై పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన్ను తొలగించాలని మంత్రి హరీశ్‌ ఆదేశాలిచ్చారు. కానీ ఉన్నతాధికారులు మాత్రం ఆ అధికారికే ఏకంగా 4 ఉమ్మడి జిల్లాల బాధ్యతలను అప్పగించారు. గత నెల 29న కొత్త జిల్లాల బాధ్యతలను అప్పగిస్తున్నట్లు సర్క్యులర్‌ జారీ చేశారు. ఇక మరో అధికారిపై ఎక్కువగానే ఆరోపణలున్నా ఏకంగా 4 ఉమ్మడి జిల్లాల బాధ్యతలను ఆ అధికారికే అప్పగించారు. ఇక నిజాయితీ గల అధికారిగా పేరున్న ఒక అధికారిణిని మాత్రం ఒక్క జిల్లాకే పరిమితం చేశారు.

మంత్రి ఆదేశించినా పట్టని అధికారులు..

వాస్తవానికి ఫుడ్‌ సేఫ్టీ కంట్రోలర్‌ ఆఫీసర్‌ పోస్టులను రేషనలైజ్‌ చేయాలని కొద్ది రోజుల కిందే మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. రేషనలైజేషన్‌ చేసి, ఒక్కో జిల్లాకు ఒక్కో అధికారిని నియమించాలని సూచించారు. కానీ మంత్రి ఆదేశాలను ఉన్నతాఽధికారులు పట్టించుకోవట్లేదు. కేవలం ఎంచుకున్న సూపర్‌ మార్కెట్ల నుంచే ఒకట్రెండు ఆహార పదార్థాల నమూనాలను సేకరించి మమ అనిపిస్తున్నారు. ఉత్పత్తుల్లో కల్తీ ఉందని తేలినా తయారీదారులకు కేవలం నోటీసులిచ్చి చేతులు దులుపుకుంటున్నారు.

Updated Date - 2023-04-12T02:46:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising