ప్లై వుడ్ కంపెనీలో అగ్ని ప్రమాదం
ABN, First Publish Date - 2023-02-05T01:16:26+05:30
ఉప్పల్ పారిశ్రామిక వాడలో ప్లైవుడ్ తయారు చేసే ఎగ్‌వుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో శనివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది.
ఉప్పల్ పారిశ్రామిక వాడలో ఘటన
మంటలను వెంటనే అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది
ఉప్పల్, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): ఉప్పల్ పారిశ్రామిక వాడలో ప్లైవుడ్ తయారు చేసే ఎగ్‌వుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో శనివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. కంపెనీ నుంచి దట్టమైన పొగలు వస్తుండడంతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలు అగ్నిమాపక స్టేషన్‌కు ఫోన్ చేశారు. తార్నాకలోని మౌలాలి ఫైర్ సిబ్బందితోపాటు నాచారంలోని మల్కాజిగిరి, హయత్‌నగర్, మేడ్చల్ ప్రాంతా ల అగ్నిమాపక అధికారుల ఆధ్వర్యంలో గంట వ్యవవధిలోనే మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలను ఆర్పేందుకు జలమండలి అధికారులు సైతం 4 ట్యాంకు ల నీటిని పంపించారు. ఉదయం 7.30గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ కారణం గా కంపెనీ మొదటి అంతస్తులోని ప్లైవుడ్ తయారీకి ఉపయోగించే ముడి సరుకు కు మంటలు అంటుకున్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చామని మౌలాలి, నాచారం ఫైర్ ఆఫీసర్లు దుర్గాప్రసాద్, మల్లే్‌షలు తెలిపారు. మొదటి అంతస్తులో విశాలమైన 25 కిటికీలు ఉండడంతో అగ్ని ప్రమాదం తీవ్రత ఎక్కువగా లేదన్నారు. మంటలు ఇతర యూనిట్లకు విస్తరించక పోవడంతో పెనుప్రమాదం తప్పిందన్నారు. ప్రమాదం వల్ల సుమారు రూ.12 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని వారు వెల్లడించారు. ఈ ప్రమాదం విద్యుత్ షాక్‌తోనే జరిగిందా.. మరే ఇతర కారణాల వల్ల జరిగిందా అనే దానిపై విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీ నుంచి దట్టమైన పొగలు రావడంతో పరిసర ప్రాంతాల్లోని రామంతాపూర్, హబ్సిగూడ కాలనీల ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. సంఘటనా స్థలానికి ఉప్పల్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ ఉప్పల్ సర్కిల్ అధికారులు చేరుకొని ప్రమాద తీవ్రత, పరిస్థితిని అంచనా వేశారు. మేడ్చల్ జిల్లా అగ్నిమాపక అధికారి నాగేశ్వర్‌రావు, సహాయ అధికారి రంజిత్‌రెడ్డి సహాయక చర్యలను పర్యవేక్షించారు.
Updated Date - 2023-02-05T01:16:27+05:30 IST