ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TSRTC: అప్పుల ఊబిలో..

ABN, First Publish Date - 2023-04-22T02:58:05+05:30

‘‘ప్రతి ఏటా రాష్ట్ర బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.1000 కోట్లు కేటాయిస్తాం. ప్రభుత్వం నుంచి చెల్లించాల్సిన రాయితీలను ఎప్పటికప్పుడు క్లియర్‌ చేస్తాం. ఆర్టీసీని నష్టాల నుంచి బయటపడేస్తాం. ఉద్యోగుల సీసీఎస్‌, పీఎఫ్‌ బకాయిలు చెల్లిస్తాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదాయ వనరులు పెరిగినా ఆర్టీసీది గడ్డు స్థితే

రూ.10 వేల కోట్లకు చేరువలో బకాయిలు

ఏటా వెయ్యి కోట్లు కేటాయిస్తామని

2019లో ప్రకటించిన సీఎం కేసీఆర్‌

3 ఏళ్లలో 2,325 కోట్లు మాత్రమే విడుదల

చార్జీల రాయితీలు చెల్లించని సర్కారు

ఏటేటా పెరిగిపోతున్న బకాయిలు

బ్యాంకు రుణాల కోసం ఎదురుచూపు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రతి ఏటా రాష్ట్ర బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.1000 కోట్లు కేటాయిస్తాం. ప్రభుత్వం నుంచి చెల్లించాల్సిన రాయితీలను ఎప్పటికప్పుడు క్లియర్‌ చేస్తాం. ఆర్టీసీని నష్టాల నుంచి బయటపడేస్తాం. ఉద్యోగుల సీసీఎస్‌, పీఎఫ్‌ బకాయిలు చెల్లిస్తాం. ప్రతి ఉద్యోగికీ రూ.లక్ష బోనస్‌ అందేలా కృషి చేస్తాం’’ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో 2019 డిసెంబరు 2న వారితో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలివి. ఆర్టీసీ కార్మికులు 55 రోజులపాటు ఉధృతంగా చేసిన సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా డిపోల నుంచి ప్రతినిధులను ప్రగతి భవన్‌కు పిలిపించి సమావేశమైన ముఖ్యమంత్రి.. వారిపై పెద్ద ఎత్తున హామీల వరాలు కురిపించారు. అందులో సంస్థను ఆర్థికంగా ఆదుకునేందుకు ఏటా రూ.1000 కోట్లుఇస్తానన్నది ప్రధానమైనది. ముఖ్యమంత్రి ప్రకటన చేసేనాటికి టీఎ్‌సఆర్టీసీ సుమారు రూ.6వేల కోట్ల నష్టాల్లో ఉంది. ప్రస్తుతం 2023 ఏప్రిల్‌ నాటికి సుమారు రూ.10వేల కోట్ల నష్టాల్లో ఉంది. అంటే మూడున్నరేళ్ల కాలంలో ఆర్టీసీ అప్పులు సుమారు రూ.4వేలకోట్లు పెరిగాయి. ఆర్టీసీకి రోజుకు రూ.10.50 కోట్ల ఆదాయం వస్తోందని, దీనిని మరో రూ.కోటి మేర పెంచేలా ఉద్యోగులు కష్టపడితే సంస్థ లాభాల్లోకి వస్తుందని ఆత్మీయ సమావేశంలో సీఎం కేసీఆర్‌ అన్నారు. కానీ, ప్రస్తుతం రోజుకు రూ.14కోట్ల నుంచి రూ.16కోట్ల దాకా ఆదాయం వస్తోంది.

అయినా నష్టాలు అలాగే ఉన్నాయి. ఏటా బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించినా.. ఆ తరువాతి ఆర్థిక సంవత్సరం 2020-21 బడ్జెట్‌లో ప్రభుత్వం ఆర్టీసీకి రూ.600 కోట్లు మాత్రమే కేటాయించి విడుదల చేసింది. అయితే ఈ మొత్తం నుంచే వివిధ వర్గాలకు ప్రయాణ చార్జీల్లో అమలు చేస్తున్న రాయితీలనూ తీసుకోవాల్సిందిగా ఆర్టీసీకి సూచించింది. అనంతరం 2021-22 బడ్జెట్‌లో రూ.1500 కోట్లు కేటాయించి.. అందులో రాయితీల చెల్లింపులు కలిపి రూ.11125 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఇక 2022-23లోనూ రూ.1500 కోట్లు కేటాయించినా కేవలం రూ.600 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ముఖ్యమంత్రి హామీ ప్రకారం మూడేళ్లలో రాయితీలతో సంబంధం లేకుండానే ఆర్టీసీకి రూ.3 వేల కోట్లు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉండగా.. రాయితీలతో కలిపి రూ.2,325 కోట్లు మాత్రమే ఇచ్చింది. సీఎం కేసీఆర్‌ హామీ పూర్తిగా నెరవేరకపోవడంతో ఆర్టీసీకి లోటు అలాగే ఉండిపోయింది. దీనికితోడు బస్సుల నిర్వహణ వ్యయం పెరిగిపోవడంతో.. సంస్థ ఆదాయం పెరిగిగా అదే స్థాయిలో ఖర్చులు కూడా పెరిగిపోయాయి. ఫలితంగా ఆర్టీసీ ఎప్పటిలాగే నష్టాల ఊబిలోనుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ అప్పులు సుమారు రూ.10 వేల కోట్లకు చేరాయని తెలుస్తోంది.

చార్జీలు, సెస్‌లు సవరించినా..

ఆదాయమే లక్ష్యంగా సెస్‌లు, చార్జీలను ఆర్టీసీ సవరించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా లగేజీ చార్జీలు కూడా పెద్దమొత్తంలో పెంచి వసూలు చేస్తోంది. మరోవైపు కార్గో సేవల పేరిట సైతం సంస్థకు ఆదాయం వస్తోంది. కానీ, ఇన్ని రకాలుగా ఆదాయ వనరులు పెరిగినా ఆర్టీసీ అప్పులు తీరడంలేదు సరికదా.. రోజురోజుకూ మరింతగా అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. బస్సుల నిర్వహణ వ్యయం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లిస్తూ.. అప్పులకు వడ్డీలు చెల్లించడం కూడా సంస్థకు కష్టంగా మారింది. టికెట్‌ ఆదాయం రోజుకు సుమారు రూ.14 కోట్ల నుంచి రూ.16 కోట్లకు పెరిగినప్పటికీ ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరిగిపోవడంతో చెల్లింపులకు సంబంధించిన బకాయిలు పెరిగిపోతున్నాయి. వివిధ వర్గాలకు ప్రయాణ చార్జీల్లో అమలు చేస్తున్న రాయితీల నిధులను ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఆర్టీసీపై భారం మరింతగా పెరిగిపోతోంది. వీటికితోడు.. కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులను కొనుగోలు చేయకుండా అవే బస్సులను నడిపించడంతో నిర్వహణ వ్యయం రెట్టింపవుతోంది. మరోవైపు పలు ప్రధాన రూట్లలో రద్దీ సమయాల్లో సైతం బస్సులు నడపకపోవడంతో ఆర్టీసీ ఆదాయానికి గండి పడుతోంది. తగినన్ని సొంత బస్సులు లేక.. అద్దె బస్సులు నడుపుతుండడంతో సంస్థకు రావాల్సిన ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోంది. దీంతో నెల నెలా ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులకు సైతం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

తగినంతగా అందని ప్రభుత్వ సాయం..

ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ఏడాదిగా ప్రయత్నాలు జరుగుతున్నా.. ప్రభుత్వం నుంచిఆర్థిక సాయం విడుదల కాకపోవడం ఇబ్బందికరంగా మారింది. ఏటా రూ.1000 కోట్లు ఇస్తామన్న ప్రభుత్వ హామీ నెరవేరడంలేదు. దివ్యాంగులు, విద్యార్థులు, ఎన్‌జీవోలు, జర్నలిస్టులు, స్వాతంత్ర సమరయోధులకు బస్‌పా్‌సలు, రాయితీలకు సంబంధించిన రీయింబర్స్‌మెంట్‌ నిదులనూ సర్కారు పూర్తి స్థాయిలో విడుదల చేయడంలేదు. ఆర్టీసీ ఉద్యోగులకు 2013 నాటి పీఆర్సీకి సంబంధించి 50 శాతం బాండ్ల రూపంలో చెల్లించాల్సిన బకాయిలతోపాటు 2017, 2021 పీఆర్సీల అమలునూ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. 2014-15లో బడ్జెట్‌ లో ఆర్టీసీకి ప్రభుత్వం రూ.110 కోట్లు కేటాయించినా.. రూ.100 కోట్లు మాత్రమే విడుదల చేసింది. కానీ, బస్‌పాస్‌ రాయితీల కింద రావాల్సిన రూ.414.14 కోట్లు మాత్రం చెల్లించలేదు. ఆ తరువాత 2015-16లో బడ్జెట్‌లో రూ.110 కోట్లు కేటాయించిన ప్రభుత్వం రూ.102.50 కోట్లు విడుదల చేసింది. కానీ, రాయితీలకు సంబంధించిన రూ.535.64 కోట్లు మాత్రం బకాయిగానే ఉండిపోయాయి. అనంతరం 2016-17 బడ్జెట్‌లో రూ.110 కోట్లు కేటాయించి కేవలం రూ.27.50 కోట్లు మాత్రమే విడుదల చేయడం గమనార్హం. ఆ ఏడాది బస్‌పాస్‌ రాయితీల కింద రూ.553.71 కోట్లు బకాయిలు ఆర్టీసీకి రావాల్సి ఉంది. ప్రతి ఏటా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

పీఎఫ్‌ బకాయిలే రూ.1450 కోట్లకుపైగా...

ఉద్యోగుల భవిష్య నిధి (పీఎఫ్‌) కింద ఆర్టీసీ యాజమాన్యం సుమారు రూ.1450 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. కొంతకాలంగా ఉద్యోగుల వేతనాల నుంచి మినహాయించిన సొమ్ముతో పాటు యాజమాన్యం చెల్లించాల్సిన వాటా ధనాన్ని చెల్లించకపోవడంతో రిటైర్డ్‌ ఉద్యోగులకు రావాల్సిన ఆర్థికసాయం సకాలంలో అందడంలేదు. అలాగే ఉద్యోగులు ఏ కారణంతోనైనా మృత్యువాత పడితే.. బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు ఎంప్లాయీస్‌ డిపాజిట్‌ లింక్‌డ్‌ ఇన్సూరెన్స్‌ స్కీంకింద రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు వచ్చే ఆర్ధిక సాయం సైతం నిలిచిపోయినట్లు తెలిసింది. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగుల కో-ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ (సీసీఎ్‌స)కి సంస్థ యజమాన్యం సుమారు రూ.1080కోట్లు బకాయి పడింది. అలాగే ఎస్‌ఆర్‌బీఎస్‌ కింద ఉద్యోగుల వేతనాల నుంచి మినహాయించిన సుమారు రూ.400 కోట్లను యాజమాన్యం దారి మళ్లించింది. కొన్నేళ్లుగా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి వడ్డీ కింద తీసుకువచ్చిన రుణాలు సుమారు రూ.4వేల కోట్లకు చేరుకోగా, వడ్డీల కింద ఏటా రూ.750 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. అంతేకాకుండా రవాణా శాఖకు మరో రూ.780కోట్ల బకాయిలు, ఉద్యోగుల పీఆర్‌సీ బాండ్లకు సంబంధించిన బకాయిలు రూ.450 కోట్లు, ఇటీవల కొనుగోలు చేసిన కొత్త బస్సులు సరఫరా చేసిన ఇందనం, ఆయిల్‌ సరఫరా చేసిన సంస్థలకు, అద్దెబస్సుల యజమానులకు సైతం భారీ మొత్తంలో బకాయులు చెల్లించాల్సి ఉన్నట్లు తెలిసింది.

బ్యాంకు రుణాలకు అనుమతించినా..

అప్పట్లో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె తర్వాత 2021-22 బడ్జెట్‌లో కేటాయించిన నిధులకు తోడుగా బ్యాంకుల ద్వారా రూ.1500 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. కానీ, బ్యాంకులు కేవలం రూ.300 కోట్లు మాత్రమే విడుదల చేశాయి. మిగతా రుణాల కోసం అధికారులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక 2022-23లో ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.1500 కోట్లు కేటాయించినప్పటికీ కేవలం రూ.600 కోట్లే విడుదల చేసింది. దీంతో సీసీఎస్‌, పీఎఫ్‌, ఉద్యోగుల బాండ్లకు సంబంధించిన బకాయిలను యాజమాన్యం చెల్లించలేని పరిస్థితి నెలకొంది. 2023-24లో బడ్జెట్‌లోనూ రూ.1500 కోట్లు కేటాయించినప్పటికీ నిధులు విడుదలయ్యే వరకు విశ్వసించలేని పరిస్థితి ఉందని ఉద్యోగులు అంటున్నారు.

Updated Date - 2023-04-22T02:58:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising