CM KCR : ఈ దశాబ్ది ఉత్సవాల్లోనే.. పేదలకు ఇళ్లస్థలాలు
ABN, First Publish Date - 2023-06-03T04:52:11+05:30
పేదలకు ఇళ్ల స్థలాలు.. బీసీల్లో కొన్ని కులవృత్తి కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం.. రెండో విడత గొర్రెల పంపిణీ..
బీసీల్లో వృత్తి కుటుంబాలకు లక్ష
జూలైలో గృహలక్ష్మి పథకం అమలు
మళ్లీ గొర్రెల పంపిణీ మొదలు
24 నుంచి పోడు పట్టాల పంపిణీ
1.3 లక్షల మందికి 2వ విడత ‘బంధు’
నిర్వేదాన్ని బద్దలుకొట్టి రాష్ట్ర సాధన
9 ఏళ్లలో సాగుకు స్వర్ణయుగం
దశాబ్ది వేడుకల్లో సీఎం కేసీఆర్
హైదరాబాద్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): పేదలకు ఇళ్ల స్థలాలు.. బీసీల్లో కొన్ని కులవృత్తి కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం.. రెండో విడత గొర్రెల పంపిణీ.. గృహలక్ష్మి పథకం ప్రారంభం.. 118 నియోజకవర్గాల్లో ఒక్కో చోటా 1100 మందికి చొప్పున దళితబంధు, పోడు భూముల పట్టాల పంపిణీ.. ఇలా ఎంతోకాలంగా ‘చేస్తాం చేస్తాం’ అంటూ ఊరిస్తున్న పథకాల అమలును ఈ దశాబ్ది ఉత్సవాల్లోనే చేపట్టనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల సందర్భంగా శుక్రవారం సచివాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. గౌరవ వందనం స్వీకరించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామస్థాయి నుంచి రాజధాని వరకూ 21 రోజులపాటు ప్రభుత్వం ఘనంగా నిర్వహించే ఈ వేడుకల్లో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమంలో తమ ప్రభుత్వం స్వర్ణయుగాన్ని ఆవిష్కరించిందని తెలిపిన సీఎం.. ‘సంపద పెంచుదాం.. పేదలకు పంచుదాం’ అనే నినాదంతో పనిచేస్తున్నట్టు చెప్పారు. స్వరాష్ట్రాన్ని సాధించి పదేళ్లవుతున్న సందర్భంగా తాము చేపట్టబోయే కార్యక్రమాల గురించి వెల్లడించారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ేసకరించి ఉన్న ప్రభుత్వ భూముల్లో అర్హులకు ఇండ్ల స్థలాల పంపిణీ చేపట్టాలని నిర్ణయించాం. ఆయా గ్రామాల్లో నివాసయోగ్యంగా ఉండే ప్రభుత్వ భూములను అర్హులైన నిరుపేదలకు ఇళ్ల నిర్మాణానికి కేటాయిస్తాం. అదేవిధంగా సొంతస్థలం ఉండి.. ఇళ్లను నిర్మించుకోలేని పేదల కోసం గృహలక్ష్మి పథకాన్ని ఇప్పటికే ప్రకటించాం. మహిళల పేరిట అమలు చేేస ఈ పథకాన్ని జూలై నెలలో ప్రారంభించనున్నాం.
ఈ పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలను మూడు విడతల్లో అందజేస్తాం. దీనికోసం ప్రభుత్వం రూ.12వేల కోట్లు ఖర్చు చేయనుంది. బీసీల్లో కులవృత్తి కొనసాగించే కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తాం’’ అని సీఎం తెలిపారు. తమ ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా దాని వెనుక మానవీయ కోణం ఉంటుందని... పేదలు అనుభవించే ప్రతి సమస్యనూ అర్థం చేసుకొని పరిష్కరించే దిశగా తమ ప్రయత్నం కొనసాగుతుందని చెప్పారు. రెండో విడత గొర్రెల పంపిణీలో భాగంగా రూ.5 వేల కోట్లతో 3.38 లక్షల మందికి గొర్రెలను ఈ దశాబ్ది ఉత్సవాల్లోనే ఇస్తామన్నారు. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారంగా.. ఆదివాసీలు, గిరిజనుల చిరకాల ఆకాంక్షను నెరవేర్చేలా వారికి భూములపై హక్కులు కల్పిస్తూ ఈ నెల 24 నుంచి పోడు పట్టాలు ఇస్తామని వెల్లడించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 100 శాతం దళిత బంధు పథకాన్ని అమలు చేశామని చెప్పిన సీఎం.. రాష్ట్రంలోని మిగిలిన 118 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఒక్కో చోట 1100 మంది చొప్పున 1.3 లక్షల మంది లబ్దిదారులకు ఈ పథకం కింద రెండో విడత కార్యక్రమంలో ఆర్థిక సాయం అందించనున్నట్టు వెల్లడించారు. గర్భిణులకు పోషకాహారం అందించేందుకు, గర్భస్థ శిశువుల ఆరోగ్యం కోసం 9 జిల్లాల్లో అందిస్తున్న కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను త్వరలోనే మిగిలిన 24 జిల్లాల్లోనూ పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చూసి దేశమే నివ్వెరపోతోందని చెప్పారు. రైతాంగానికి పెట్టుబడి సాయం ఇచ్చేందుకు ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం కేంద్ర పాలకుల కళ్లు తెరిపించిందని.. అందుకే వారు కూడా రైతులకు ఆర్థిక సాయం చేస్తున్నారని చెప్పారు.
కష్టాలు దాటి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భావం నుంచే తెలంగాణ ప్రాంతం దోపిడీకి గురైందన్న కేసీఆర్.. ఉద్యమ స్ఫూర్తితో సాధించుకున్న రాష్ట్రం నవీన తెలంగాణగా మారిందని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర అభివృద్థి నమూనా మన్ననలందుకుంటోందన్నారు. ‘‘తెలంగాణ వస్తే అంధకారమేనని గతంలో పాలకులు ఎద్దేవా చేశారు. ఇప్పుడు విద్యుత్ విషయంలో విప్లవాత్మక విజయాలు సాధించాం. అన్ని రంగాలకూ 24 గంటల విద్యుత్తు అందిస్తున్నాం. ఈ పదేళ్ల కాలం సాగునీటి రంగానికి స్వర్ణయుగం. పాత ప్రాజెక్టులను ఆధునీకరించడమే కాకుండా సమైక్య రాష్ట్రంలో మూలన పడ్డ ప్రాజెక్టులు పూర్తి చేశాం. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ సురక్షిత నీటిని అందిస్తున్నాం’’ అని చెప్పారు.
‘‘ప్రత్యేక రాష్ట్ర కాంక్షలో భాగంగా... 1969 నుంచి 2001 వరకూ తెలంగాణలో నెలకొన్న నిర్వేదం, నిశ్శబ్దాలను బద్దలు కొట్టి.. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించే చారిత్రాత్మక పాత్ర లభించడంతో.. నా జీవితం ధన్యమైంది. ఉద్యమంతో సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రం ఇప్పుడు దేశంలోనే బలీయమైన శక్తిగా ఎదుగుతోంది’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఉద్యమంలో కలిసి వచ్చిన మేధావులు, విద్యావంతులు, ఉద్యోగ ఉపాధ్యాయులు, కవులు, కళాకారులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మహిళలకు తలవంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలను అర్పించిన అమరులకు సీఎం నివాళులర్పించారు. అంతకు ముందు నాంపల్లిలోని గన్‌పార్క్ వద్దకు చేరుకున్న కేసీఆర్.. ఒక నిమిషం పాటు మౌనం పాటించి అమరులకు పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు.
Updated Date - 2023-06-03T05:27:16+05:30 IST