125అడుగుల అంబేడ్కర్ విగ్రహావిష్కరణ
ABN, First Publish Date - 2023-04-15T02:27:05+05:30
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 125 అడుగుల ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహాన్ని శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్‌తో కలిసి ఆవిష్కరించారు.
ప్రకాశ్ అంబేడ్కర్‌తో కలిసి ఆవిష్కరించిన కేసీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 125 అడుగుల ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహాన్ని శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్‌తో కలిసి ఆవిష్కరించారు. హైదరాబాద్ నెక్లె్‌సరోడ్ సమీపంలో నిర్మించిన ఈ విగ్రహాన్ని అంబేడ్కర్ జయంతి రోజునే ఆవిష్కరించడం విశేషం. విగ్రహావిష్కరణకు ముందు బౌద్ధమత గురువులు ప్రార్థనలు చేశారు. హెలికాప్టర్ ద్వారా విగ్రహంపై పూల వర్షం కురిపించారు. 125 అడుగుల ఎత్తయిన విగ్రహం కిందనే.. 50 అడుగుల ఎత్తులో నిర్మించిన అంబేడ్కర్ స్మారక భవనాన్ని ప్రకాశ్ అంబేడ్కర్ ప్రారంభించారు. ఆ భవనంలో అంబేడ్కర్ జీవిత విశేషాలు ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను, అందులోని థియేటర్‌లో ప్రభుత్వ విభాగాలు అంబేడ్కర్ విగ్రహ నిర్మాణంపై రూపొందించిన డాక్యుమెంటరీ ప్రదర్శనను సీఎం కేసీఆర్, ప్రకాశ్, ఇతర ముఖ్యనేతలు తిలకించారు. దీన్ని సభకు వచ్చిన వారందరికీ లైవ్‌లో చూపించారు.
సభావేదికపై ప్రకాశ్ అంబేడ్కర్‌ను సత్కరించిన కేసీఆర్.. ఆయనకు బుద్ధుని ప్రతిమను బహూకరించారు. ఈ సందర్భంగా ‘దళితబంధు పథకం విజయగాథలు’ సీడీని ప్రకాశ్ ఆవిష్కరించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో ఆ సంస్థ కళాకారులు అంబేడ్కర్ జీవిత విశేషాలను వివరిస్తూ పాడిన పాటలు అలరించాయి. దళితులకు వ్యాపార, ఉపాధి మార్గాలు కల్పించేందుకు కృషి చేస్తున్న డిక్కీ (దళిత ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్) సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెండెకరాల భూమి ఇచ్చారు. ఈ భూమికి సంబంధించిన సర్టిఫికెట్‌ను సభావేదికపై సీఎం కేసీఆర్ డిక్కీ ప్రతినిధి నర్రా రవికుమార్‌కు అందజేశారు.
ఆ ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది: కొప్పుల
దేశంలో ఎక్కడాలేని విధంగా 125 అడుగుల ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. కేసీఆర్ నిర్ణయం తెలంగాణకు గర్వకారణమని తెలిపారు. 125 అడుగుల విగ్రహ నిర్మాణంలో పాలుపంచుకొన్న ఎస్సీ అభివృద్ధి శాఖ, ఇతర అధికారులు, కేపీసీ సంస్థ ప్రతినిధులకు ఆయన అభినందనలు తెలిపారు. సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ.. అంబేడ్కర్ జయంతి రోజున 125 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడాన్ని ఆయనకు ప్రభుత్వమిచ్చే నిజమైన నివాళిగా అభివర్ణించారు.
ప్రగతి భవన్‌కు ప్రకాశ్ అంబేడ్కర్
అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ఆయన మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ ముందుగా.. ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికిన సీఎం.. పలు అంశాలపై చర్చించారు. వారిద్దరూ ప్రగతిభవన్‌లోనే భోజనం చేశారు.
ముఖ్యమంత్రితో పాటు ప్రకాశ్ అంబేడ్కర్ మెడలో నాయకులు పట్టు కండువాలు వేశారు. ఈ సందర్భంగా తనకు వేసిన కండువాను కేసీఆర్ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కప్పారు. వెంటనే ఆయన కేసీఆర్‌కు పాదాభివందనం చేశారు.
సభ కోసం వేసిన షెడ్డులో తీవ్ర ఉక్కపోతగా ఉండడంతో జనాలు చాలా మంది సభ ముగియకముందే వెళ్లిపోవడం కనిపించింది.
Updated Date - 2023-04-15T02:27:05+05:30 IST