ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BRS: పార్టీకి ‘పందేరం’

ABN, First Publish Date - 2023-05-22T02:51:41+05:30

కొత్త సచివాలయంలో తొలి మంత్రివర్గ సమావేశం! అక్కడ కొన్ని ప్రజోపయోగ నిర్ణయాలు తీసుకున్నారు!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీఆర్‌ఎస్‌కు కోకాపేటలో 11 ఎకరాలు

ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌..’ కోసమంటూ

ఈనెల 12న పార్టీ ప్రధాన కార్యదర్శి దరఖాస్తు

18న క్యాబినెట్‌ సమావేశంలో ఆమోదం

చ.గజం రూ.7,500కే కట్టబెడుతూ తీర్మానం

కోకాపేటలో ప్రభుత్వ ధరే రూ.1.10 లక్షలు

బహిరంగ మార్కెట్‌లో రెండింతల విలువ

రూ.500 కోట్ల స్థలం.. 40 కోట్లకే ధారాదత్తం

33 జిల్లాల్లోనూ పార్టీకి సొంత భవనాలకు స్థలం

ఇప్పటికే ప్రధాన కార్యాలయం.. సర్వత్రా విమర్శలు

హైదరాబాద్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): కొత్త సచివాలయంలో తొలి మంత్రివర్గ సమావేశం! అక్కడ కొన్ని ప్రజోపయోగ నిర్ణయాలు తీసుకున్నారు! అదే సమయంలో, ‘స్వామి కార్యం.. స్వకార్యం’ అన్నట్లు పార్టీకీ మరోసారి భూమిని కేటాయించుకున్నారు. అది కూడా.. అత్యంత విలువైన కోకాపేటలో! ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ డెవల్‌పమెంట్‌’ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకంటూ ఏకంగా 11 ఎకరాల భూమిని తమ పార్టీకి కేటాయించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమిది. ఈ నిర్ణయంపై ఇప్పుడు తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బీఆర్‌ఎస్‌ మారిన టీఆర్‌ఎ్‌సకు గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో బంజారాహిల్స్‌లో భూమిని కేటాయించారు. అందులో తెలంగాణ భవన్‌ను నిర్మించారు. ప్రత్యేక రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 33 జిల్లాల్లోనూ పార్టీ కార్యాలయాలకు భూమిని కేటాయించుకున్నారు. ఇప్పుడు తాజాగా, సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ అంటూ అత్యంత విలువైన కోకాపేటలో 11 ఎకరాలు తీసుకున్నారు. అది కూడా అక్కడ మార్కెట్‌ విలువ చదరపు గజానికి లక్ష నుంచి లక్షన్నర ఉంటే.. కేవలం చదరపు గజానికి రూ7500 చొప్పున భూమిని పార్టీకి కట్టబెట్టారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని గండిపేట మండలం కోకాపేట గ్రామంలో 239, 240 సర్వే నంబర్లలో ఈ భూమిని తీసుకుంది. అంటే, మొత్తం 11 ఎకరాలకు కలిపి సుమారు రూ.40 కోట్లు అవుతుంది. కానీ, ఇక్కడ ప్రభుత్వ భూమి వేలానికి సంబంధించి హెచ్‌ఎండీఏ ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారమే కోకాపేటలో చదరపు గజం విలువ రూ.1.10 లక్షలు ఉంది. అంటే, బీఆర్‌ఎస్‌ కేటాయించుకున్న 11 ఎకరాల మొత్తం విలువ సుమారు రూ.500 కోట్లు అవుతుంది.

బహిరంగ మార్కెట్‌లోనైతే ఇక్కడ ఎకరా వంద కోట్ల వరకూ ఉందని చెబుతున్నారు. ఈ కేటాయింపుపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. దేశంలో అత్యంత సంపన్న రాజకీయ పార్టీల్లో తమది కూడా ఒకటి అని కేసీఆర్‌, కేటీఆర్‌ చెబుతున్నారని, అదే సమయంలో కారు చౌకగా తెలంగాణవ్యాప్తంగా భూములు కొట్టేస్తున్నారని మండిపడుతున్నారు. సర్కారు నిర్ణయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఆగమేఘాలపై...

దరఖాస్తు చేసుకున్న కేవలం ఐదు రోజుల్లోనే ఆగమేఘాలపై బీఆర్‌ఎ్‌సకు భూమిని కేటాయించడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి, సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటుకు భూమి కావాలంటూ బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి ఈనెల 12న ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. కేవలం 5 రోజుల వ్యవధిలోనే.. అంటే, ఈనెల 18న కొత్త సచివాలయంలో జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలోనే దానికి ఆమో దం తెలిపారు. పేదలు, ఇతర వర్గాలకు ఇళ్ల కోసం స్థలం కేటాయిస్తామని ప్రకటించి కూడా మాట నిలబెట్టుకోవడం లేదని, దళితులకు మూడెకరాలు ఇవ్వడానికి స్థలం లేదని చెబుతున్నారని, అలాగే, పార్టీకి మాత్రం భూ పందేరాలు చేసుకుంటూనే ఉన్నారని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.

కాగా, ఈ భూమిలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వానికి ఇచ్చిన దరఖాస్తులో పేర్కొన్నారు. ఇక్కడ రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు, విద్యావేత్తలకు వ్యక్తిత్వ వికాస నైపుణ్యం, వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. ఇందుకు అత్యాధునిక వసతులతో కాన్ఫరెన్స్‌ హాల్‌, లైబ్రరీ ఏర్పాటు చేస్తామని, ఇక్కడ శిక్షణ పొందే వారితోపాటు పనిచేసే సిబ్బందికి సదుపాయాలు కల్పిస్తామన్నారు. నిజానికి, ఇటువంటి శిక్షణ ఇచ్చే సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లు హైదరాబాద్‌లో ఉన్నాయని, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎంసీహెచ్‌ఆర్డీ కూడా ఉందని, ఇప్పుడు కొత్తగా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఇటువంటి కేంద్రానికి భూమి కేటాయింపు ఏమిటని విపక్షాలు నిలదీస్తున్నాయి. అయితే, ఈ భూ కేటాయింపునకు సంబంధించి దరఖాస్తులోనే ఒక సాకును కూడా పేర్కొనడం విశేషం. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రం ఏర్పాటు పేరిట బోయిన్‌పల్లిలో 10 ఎకరాల 15 గుంటల స్థలాన్ని కేటాయించుకుందని అందులో పేర్కొన్నారు.

జాతీయ స్థాయి ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ డెవల్‌పమెంట్‌ కోసమంటూ తిరుమలగిరి మండలం బోయిన్‌పల్లి గ్రామంలో ఎకరానికి రూ.2 లక్షల చొప్పున ధరకు ప్రభుత్వ భూమిని కాంగ్రెస్‌కు ఉమ్మడి రాష్ట్రం హయాంలో ఆ పార్టీ ప్రభుత్వమే కేటాయించుకుందని గుర్తు చేశారు. అదే తరహాలో తమకూ భూకేటాయింపు జరపాలని అందులో కోరారు. దానిని సాకుగా చూపిస్తూ బీఆర్‌ఎస్‌ అత్యంత విలువైన భూమిని కేటాయించుకుంది. పైగా ఈనెల 18న మంత్రివర్గ సమావేశం ముగిశాక.. క్యాబినెట్‌ నిర్ణయాలను మీడియాకు వివరించిన మంత్రి హరీశ్‌ఈ భూమి కేటాయింపు విషయాన్ని వెల్లడించలేదు. తాజాగా ఇది వెలుగులోకి రావడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2023-05-22T02:51:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising