TS GOVERNOR : పిలవని పేరంటానికి వెళ్లాలా?
ABN, First Publish Date - 2023-05-03T03:19:55+05:30
రాష్ట్ర గవర్నర్, ప్రభుత్వం మధ్య మరో వివాదం రాజుకుంది. ప్రభుత్వం నూతనంగా నిర్మించిన సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను ఆహ్వానించకపోవడం ఇందుకు కారణమైంది.
ఉన్నత రాజ్యాంగ పదవినే అవమానిస్తారా?
సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్‌ను
ఆహ్వానించకపోవడంపై రాజ్‌భవన్ భగ్గు
ఆహ్వానం అందలేదని గవర్నర్ ప్రకటన
అందుకే వెళ్లలేదన్న తమిళిసై సౌందరరాజన్
హైదరాబాద్, మే 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గవర్నర్, ప్రభుత్వం మధ్య మరో వివాదం రాజుకుంది. ప్రభుత్వం నూతనంగా నిర్మించిన సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను ఆహ్వానించకపోవడం ఇందుకు కారణమైంది. రాష్ట్రంలో అత్యున్నత రాజ్యాంగ పదవికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ప్రభుత్వం ఇవ్వడం లేదని రాజ్‌భవన్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అదేదో కేసీఆర్ కుటుంబ కార్యక్రమంగా భావిస్తున్నారని, ప్రభుత్వ కార్యక్రమాలకు గవర్నర్‌ను ఆహ్వానించాల్సిన అవసరం లేదా? అని మండిపడుతున్నాయి. అటు జిల్లాలకు వెళితే.. కలెక్టర్లు, ఎస్పీలు స్వాగతం చెప్పరు.. ఇటు ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానాలు పంపరు. అలాంటప్పుడు ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టకుండా ఎలా ఉంటామని అంటున్నాయి. ప్రభుత్వం కొత్తగా నిర్మించిన సచివాలయాన్ని ఏప్రిల్ 30న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా, ప్రభుత్వ సొమ్ముతో నిర్మించిన సచివాలయాన్ని ప్రారంభిస్తున్నప్పుడు గవర్నర్‌ను, ప్రతిపక్షాల నేతలను, పాత్రికేయులను ఆహ్వానించాల్సి ఉండగా.. ప్రభుత్వం కొన్ని వర్గాలను నిర్లక్ష్యం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పక్కా ప్రభుత్వ, ప్రజా కార్యక్రమమైనా సర్కారు ప్రొటోకాల్ పాటించలేదు. రాష్ట్ర గవర్నర్‌ను ఆహ్వానించలేదు. కొన్ని మీడియా సంస్థలపైనా ఆంక్షలు విధించింది.
ప్రతిపక్ష నేతల ఇళ్ల గోడలకు ఆహ్వాన పత్రాలు
ప్రతిపక్షాల నేతలకూ ప్రభుత్వం సరైన విధానంలో ఆహ్వానం పంపలేదు. ఇంటి గోడకు లేదా తలుపులకు కోర్టు నోటీసులు అంటించినట్లు.. ప్రతిపక్షాల నేతల ఇళ్ల ముందు ఆహ్వాన పత్రాలను పడేసి వెళ్లారన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రానికి పెద్ద దిక్కు అయిన గవర్నర్‌కు కూడా ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానం పంపలేదు. ఈ విషయాన్ని గవర్నరే మంగళవారం స్వయంగా ప్రకటించారు. ‘‘సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నన్ను ప్రభుత్వం ఆహ్వానించినట్లు వస్తున్న వార్తలు శుద్ధ అబద్ధం, అధార రహితం. ఆహ్వానం పంపినా.. నేను హాజరు కాలేదనడం కరెక్ట్ కాదు. సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి నాకు ఎలాంటి ఆహ్వానాన్ని పంపలేదు. అందుకే ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు’’ అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మంగళవారం ఓ ప్రకటనలో విస్పష్టంగా తెలిపారు. అంటే.. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే గవర్నర్‌కు ఆహ్వానం పంపలేదని తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య సయోధ్య లేదు. ఇటీవల ప్రభుత్వ బిల్లుల అంశం మరింత దూరాన్ని పెంచింది. బిల్లులను ఆమోదించేలా గవర్నర్‌కు సూచించాలంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో మరింత ఆగ్రహానికి గురైన గవర్నర్ బిల్లులను అటో ఇటో తేల్చేశారు. ప్రభుత్వానికి అత్యంత అవసరమైన రెండు ప్రధాన బిల్లులను తిరస్కరించి తన ప్రతాపాన్ని ప్రదర్శించారు. ఇది ప్రభుత్వానికి మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. ఇలాంటి కారణాల వల్లే గవర్నర్‌కు ఆహ్వానం పంపలేదన్న చర్చ జరుగుతోంది.
కోర్టు ఆదేశంతో బడ్జెట్ సమావేశాలకు..
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం అప్పట్లో గవర్నర్‌ను ఆహ్వానించింది. లేకపోతే అది కూడా జరిగేది కాదు. ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించడాన్నే పక్కన పెట్టేసింది. ఏప్రిల్ 14న అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గవర్నర్‌ను ప్రభుత్వం ఆహ్వానించలేదని రాజ్‌భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు తాజాగా సచివాలయ ప్రారంభోత్సవానికి కూడా ఆహ్వానించకపోవడం విమర్శలకు తావిస్తోంది. కానీ, గవర్నరే కార్యక్రమానికి రాలేదని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆహ్వానం అందితే గవర్నర్ వచ్చేవారో లేదో తెలిసేది కదా! అన్న అభిప్రాయాలున్నాయి. గవర్నర్ మాత్రం తనకు ఆహ్వానం అందలేదంటున్నారు. మరి ఇందులో ఎవరిది తప్పు? అంటే... గవర్నరే చొరవ తీసుకుని పిలవని పేరంటానికి రావాలా? ఇదెక్కడి చోద్యం అంటూ మంత్రి వ్యాఖ్యలపై పరిశీలకులు మండిపడుతున్నారు. తాము మాత్రం ప్రొటోకాల్ ప్రకారం మసలుకుంటున్నామని, ప్రభుత్వం మాత్రం ప్రొటోకాల్‌ను పాటించడం లేదని రాజ్‌భవన్ వర్గాలు అంటున్నాయి. మొన్న గణతంత్ర దినోత్సవం రోజు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలందరికీ ఆహ్వానాలు పంపామని చెబుతున్నాయి. అయినా.. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సహచర మంత్రులెవరూ కార్యక్రమానికి హాజరు కాలేదని, కనీసం అధికార పార్టీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా రాజ్‌భవన్ దరిదాపుల్లోకి రాలేదని వివరిస్తున్నాయి.
Updated Date - 2023-05-03T03:20:42+05:30 IST