గౌరవెల్లి కట్ట మూసివేత షురూ
ABN, First Publish Date - 2023-03-05T03:08:05+05:30
గ్రామం చుట్టూ పోలీసు పహారా.. పరిహారం కోసం ఆందోళన చేస్తున్న భూ నిర్వాసితుల అడ్డగింత.. అరెస్టు.. పోలీ్‌సస్టేషన్లకు తరలింపు...
అర్ధరాత్రి పనులు ప్రారంభించిన అధికారులు
అడ్డుకునేందుకు యత్నించిననిర్వాసితుల అరెస్టు
గుడాటిపల్లి సర్పంచ్ ఆమరణ దీక్ష
అక్కన్నపేట, మార్చి 4: గ్రామం చుట్టూ పోలీసు పహారా.. పరిహారం కోసం ఆందోళన చేస్తున్న భూ నిర్వాసితుల అడ్డగింత.. అరెస్టు.. పోలీ్‌సస్టేషన్లకు తరలింపు. మొత్తంగా వందలాది మంది పోలీసుల పహారా మధ్య సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి వద్ద నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టు రెండో కట్ట అయిన రామవరం రోడ్డు మూసివేత పనులను శుక్రవారం అర్ధరాత్రి ప్రారంభించారు. ఇందుకోసం సిద్దిపేట సీపీ శ్వేత స్వీయ పర్యవేక్షణలో వందలాది ముంది పోలీసు బలగాలను గుడాటిపల్లిలో మోహరించారు. ప్రాజెక్టు కట్ట మూసివేత పనులను అడ్డుకునేందుకు ఎవరూ వెళ్లకుండా, గ్రామంలో ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండేందుకు వారి ఇళ్ల వద్దనే పోలీసులను కాపలాగా ఉంచారు. విషయం తెలిసిన నిర్వాసితులు తెల్లవారుజామున బయటకు వచ్చి పనులను ఆపేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడే రోడ్డుపై బెఠాయించి ఆందోళనకు దిగారు. తమకు పరిహారం పూర్తిస్థాయిలో చెల్లించకుండానే ప్రాజెక్టు పనులు నిర్వహిస్తున్నారని, పోలీసులను పెట్టి తమను బెదిరిస్తున్నారని మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. వాస్తవానికి పలువురు భూనిర్వాసితులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, సుమారు 100 మందికి పైగా వివాహితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద పరిహారం ఇవ్వాలంటూ సుమారు 75 రోజులుగా నిరసన తెలుపుతున్నారు. శనివారం నిర్వాసితులు, మహిళలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మధ్యాహ్నం సమయంలో పోలీసులు నిర్వాసితులను అరెస్టు చేసి కోహెడ, మద్దూరు ఠాణాలకు తరలించారు.
యువతికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
అరెస్టు చేసే క్రమంలో పెండ్యాల సౌజన్య అనే యువతి చేతులకు గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఓవైపు భూనిర్వాసితుల ఆందోళనలు కొనసాగుతుండగానే మరోవైపు ప్రాజెక్టు కట్ట మూసివేత పనులు కొనసాగుతున్నాయి. కాగా, భూ నిర్వాసితుల అరెస్టులను నిరసిస్తూ హుస్నాబాద్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం రాస్తారోకో నిర్వహించారు. నిర్వాసితులందరికి నష్టపరిహారం చెల్లించిన తరువాతే ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కాగా, శనివారం రాత్రి విడుదలైన తర్వాత గుడాటిపల్లికి చేరుకున్న సర్పంచ్ బద్దం రాజిరెడ్డిపాటు మరో భూనిర్వాసితుడు నల్ల మహేందర్‌రెడ్డి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
Updated Date - 2023-03-05T03:08:05+05:30 IST