supplementary bills : సప్లిమెంటరీ బిల్లుల కోసం..ఉద్యోగుల కడగండ్లు!
ABN, First Publish Date - 2023-09-14T04:34:03+05:30
రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమకు అందాల్సిన ప్రయోజనాలకు సంబంధించి సప్లిమెంటరీ బిల్లుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.
సరెండర్ లీవ్స్, బీమా, జీపీఎఫ్, మెడికల్ రీయింబర్స్‌మెంట్.. అన్నీ పెండింగ్‌లోనే!
నెలల తరబడి క్లియర్ కాని బిల్లులు
హైదరాబాద్, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమకు అందాల్సిన ప్రయోజనాలకు సంబంధించి సప్లిమెంటరీ బిల్లుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఆర్జిత సెలవుల ఎన్‌క్యా్‌షమెంట్/సరెండర్ లీవ్, జీపీఎఫ్, బీమా, మెడికల్ రీయింబర్స్‌మెంట్.. ఇలా తమ ప్రయోజనాల కోసం డబ్బు డ్రా చేసుకోవాలంటే ఆర్థిక శాఖ చుట్టూ కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రభు త్వం పలు పథకాలకు నిధులను విడుదల చేసేందుకు ఉద్యోగుల వేతనాలను ఆలస్యం చేస్తోంది. దీంతో.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు సకాలంలో ఈఎంఐలను చెల్లించేందుకు సప్లిమెంటరీ బిల్లులను వాడుకుందామనుకు న్నా.. ఆర్థిక శాఖ అందుకు అవకాశం కల్పించడం లేదు. ఫలితంగా వీరి సిబిల్‌స్కోరు దారుణంగా పడిపోతోంది. బ్యాంకులు రుణాలిచ్చే పరిస్థితి లేకుండాపోతోంది. వి శ్రాంత ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది.
సరెండర్ లీవ్స్‌కు మోక్షమెన్నడు?
ఏటా ఉద్యోగులకు 30, ఉపాధ్యాయులకు ఆరు చొప్పున ఆర్జిత సెలవులు(ఈఎల్స్) మంజూరవుతాయి. ఉద్యోగులు వాటిల్లో 15 సెలవులను భద్రపరుచుకుని, మరో 15 ఈఎల్స్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తారు. ఈ లీవ్స్‌కు ప్రతిఫలంగా ఉద్యోగులకు సగం నెల జీతం వస్తుంది. అందుకు డ్రాయింగ్ అండ్ డిస్‌బర్స్‌మెంట్ ఆఫీసర్లు(డీడీవో) బిల్లులను రూపొందించి, జిల్లా పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ల(డీపీఏవో)కు పంపిస్తారు. వెంటనే నంబర్‌తో సహా టోకెన్ జనరేట్ అవుతుంది. ఈ టోకెన్‌ను ఆర్థిక శాఖ అధికారులు క్లియర్ చేస్తే.. ఆర్‌బీఐ ‘ఈ-కుబేర్’ ద్వారా ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ అవుతుంది. నిజానికి ఏడాది కాలంలోనే ఆర్జిత సెలవులను సరెండర్ చేస్తేనే ఫలితం ఉంటుంది. లేదంటే ఆ లీవ్స్ మురిగిపోయే(లాప్స్) ప్రమాదముంటుంది. అందుకే ఉద్యోగులు, ఉపాధ్యాయులు తప్పకుండా ఈ బిల్లులను వెంటనే సమర్పిస్తుంటారు. కానీ, ఖజానాలో సొమ్ములేక.. ఆర్థిక శాఖ ఈ బిల్లులను క్లియర్ చేయడం లేదు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో పెడుతుండడంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు.
జీపీఎఫ్ పాక్షిక ఉపసంహరణకూ ఇబ్బందే
జనరల్ ప్రావిడెంట్ ఫండ్(జీపీఎఫ్)లో ప్రతి ఉద్యోగి తమ నెలవారీ మూలవేతనం నుంచి కనీసం 6% చొప్పున చందా సొమ్మును జమ చేస్తుంటారు. ఇలా జమ అయిన సొమ్ము నుంచి పిల్లల పెళ్లిళ్లు, గృహ నిర్మాణాల కోసం పాక్షిక ఉపసంహరణ(పార్ట్ ఫైనల్) కింద అడ్వాన్సును క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒక్కో ఉద్యోగికి రూ.10 లక్షల వరకు క్లెయిమ్ అవుతుంది. అయితే.. జీపీఎఫ్ బిల్లులు కూడా ఇప్పుడు క్లియర్ అవ్వడంలేదు. హైదరాబాద్ జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు గత డిసెంబరు నెలలో తన కూతురి పెళ్లి కోసమని రూ.7.90 లక్షలను అడ్వాన్సుగా ఇవ్వాలని పార్ట్ ఫైనల్ కింద బిల్లు పెట్టారు. మళ్లీ డిసెంబరు వస్తున్నా.. ఆ బిల్లుకు ఇప్పటికీ మోక్షం లభించలేదు. ఇలా చాలా మంది ఉద్యోగులు జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ కోసం ఎదురుతెన్నులు కాస్తున్నారు.
విశ్రాంత ఉద్యోగులకూ గడ్డు పరిస్థితే
బిల్లుల విషయంలో విశ్రాంత ఉద్యోగుల పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. పదవీ విరమణానంతరం రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల(రిటైర్మెంట్ బెనిఫిట్స్) బిల్లులు క్లియర్ కావడం లేదు. ఒక ఉద్యోగి రిటైర్ కాగానే.. ఆయనకు గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యా్‌షమెంట్, జీపీఎఫ్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ లైఫ్ ఇన్స్యూరెన్స్(టీఎ్‌సజీఎల్‌ఐ) బిల్లులన్నింటినీ క్లియర్ చేయాలి. ఉద్యోగి పదవీ విరమణ పొందిన రోజే మొత్తం బిల్లులను క్లియర్ చేసి, సొమ్మును అదే రోజు అప్పజెప్పి, ప్రభుత్వ వాహనంలో ఇంటి వద్ద దింపి రావాలంటూ సాక్షాత్తు సీఎం కేసీఆరే చెప్పారు. కానీ.. ఉద్యోగులు రిటైర్ అయి రెండేళ్లవుతున్నా ఆర్థిక ప్రయోజనాలు అందడం లేదు.
మెడికల్ రీయింబర్స్‌మెంట్ మరీ దారుణం!
ఉద్యోగులు, ఉపాధ్యాయుల తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్(టీఎ్‌సజీఎల్‌ఐ) బిల్లులు కూడా క్లియర్ కావడం లేదు. మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులైతే కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్‌ఎ్‌స) కింద ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య చికిత్సలు అందించడానికి ప్రైవేటు/కార్పొరేట్ ఆస్పత్రులు అంగీకరించడం లేదు. దాంతో.. వారు చికిత్స బిల్లులను చెల్లిస్తున్నారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్ స్కీమ్ కింద బిల్లులు పెడుతున్నారు. వీటికి విభాగాధిపతులు, వైద్య విద్యా సంచాలకులు(డీఎంఈ) క్లియరెన్స్ ఇస్తున్నా.. ఆర్థికశాఖలో పెండింగ్‌లో ఉంటున్నాయి. ఒకవేళ క్లియర్ అయినా.. డీఎంఈ పరిధిలో గరిష్ఠంగా రూ.2 లక్షలు విడుదలవ్వాల్సి ఉన్నా.. రూ.లక్ష దాకా మంజూరవుతున్నాయి. అంతకంటే ఎక్కువ మొత్తంలో బిల్లులుంటే.. ముఖ్య కార్యదర్శుల 7 గురు సభ్యుల కమిటీ భేటీలో నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్రంలో ఆ కమిటీ ఎప్పుడు భేటీ అవుతుందనే నమ్మకమే లేదని ఉద్యోగులు చెబుతున్నారు. ఇక ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ రెండు నెలల కిత్రం స్పందించింది. రూ.లక్ష లోపు ఉన్న బిల్లులను కొన్నింటిని క్లియర్ చేసింది. ఆ తర్వాత వాటి జోలికి వెళ్లలేదు.
వీరికి ఠంచన్‌గా మంజూరు..!
ఐఏఎస్ అధికారులు మెడికల్ రీయింబర్స్‌మెంట్ లేదా వైద్య ఖర్చులకు నిధులు మంజూరు కావాలంటే.. వెంటనే జీవోలు విడుదలవుతున్నాయని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా.. సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన బిల్లులు ఒకట్రెండు నెలల్లో క్లియర్ అవుతున్నాయి. ఇక ప్రభుత్వం, అధికారులపై ప్రతాపం చూపే అవకాశమున్న శాఖల ఉద్యోగుల బిల్లులు కూడా ఠంచన్‌గా విడుదలవుతున్నాయి. జిల్లాలు, ఇతర విభాగాలు, శాఖల ఉద్యోగులకు మాత్రం కడగండ్లే మిగులుతున్నాయి.
బిల్లులను వెంటనే క్లియర్ చేయాలి
సప్లిమెంటరీ బిల్లులు క్లియర్ కాకపోవడంతో చాలా మంది ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పీఆర్సీ ఏర్పాటు కాకపోవడం, మూడు డీఏలు పెండింగ్‌లో ఉండడంతో ఇప్పటికే వారు ఆవేదన చెందుతున్నారు. సప్లిమెంటరీ బిల్లులను కూడా దీర్ఘకాలికంగా పెండింగ్‌లో పెట్టడం వల్ల వారిలో అసహనం పెరిగిపోతోంది. ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, బిల్లులన్నింటినీ క్లియర్ చేయాలి.
- ఎం.రవీంద్రకుమార్,
తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు
Updated Date - 2023-09-14T04:39:59+05:30 IST