CPS : సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందే!
ABN, First Publish Date - 2023-07-26T04:09:13+05:30
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎ్‌స)ను రద్దు చేయాలని ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకునే సర్కారు సీపీఎస్ అంశంపై ఎందుకు నోరు విప్పడం లేదని
ఎన్నికల ముందు ఉద్యోగుల ఆందోళన
ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్
రథయాత్రతో టీఎస్‌సీపీఎస్‌ఈయూ ఉద్యమం
ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దు
ఇక్కడా రద్దు చేయాలంటూ సంఘాల ఒత్తిడి
పరిశీలిస్తున్నామన్న హరీశ్.. తేల్చని సర్కార్
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఏర్పాటు
తమనూ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్
హైదరాబాద్, జూలై 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎ్‌స)ను రద్దు చేయాలని ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకునే సర్కారు సీపీఎస్ అంశంపై ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నిస్తున్నారు. సీపీఎస్ వద్దు.. పాత పెన్షన్ స్కీమ్(ఓపీఎస్) విధానాన్నే తమకు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు. రథయాత్రతో తమ ఆవేదనను, ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయని, ఈలోపు సీపీఎ్‌సను రద్దు చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని నినదిస్తున్నారు. మేనిఫెస్టోలో పెడతామంటే ఒప్పుకొనేది లేదని, సీపీఎ్‌సను రద్దు చేసిన తర్వాతే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలంటూ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నారు. మరోపక్క సీపీఎ్‌సను రద్దు చేస్తున్న రాష్ట్రాల సంఖ్య క్రమేణా పెరుగుతుండటంతో ఇక్కడా సర్కార్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఎన్నికలు ముంచుకొస్తుండడంతో ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యత ఏర్పడుతోంది. లేదంటే.. సీపీఎస్ కింద ఉన్న 2 లక్షల మందికి పైగా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఓట్లు అధికార పార్టీపై ప్రభావం చూపే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావును సీపీఎస్ సంఘాల నాయకులు కలిసినప్పుడు.. సీపీఎస్ రద్దు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పినప్పటికీ ఆ దిశగా చర్యలు కనిపించడంలేదని ఉద్యోగులు మొత్తుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వం విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్(వీఆర్‌ఏ)ల వ్యవస్థను రద్దు చేసి.. వారిని ఇతర శాఖల్లో విలీనం చేయాలని ఆదేశించింది. దీంతో మరో 20 వేల మంది సిబ్బంది సీపీఎ్‌సలో చేరబోతున్నారు. దీంతో సీపీఎస్ ఉద్యోగుల సంఖ్య రాష్ట్రంలో 2.20 లక్షలకు చేరుకుంటుంది. ఇదేకాదు.. ప్రభుత్వం మరో 80,039 పోస్టులను ప్రత్యక్ష ఎంపిక విధానంలో భర్తీ చేయబోతోంది. ఇప్పటికే కొన్ని రిక్రూట్‌మెంట్ పరీక్షలను నిర్వహించింది. ఈ పోస్టులన్నీ భర్తీ అయితే.. ఈ ఉద్యోగులు కూడా సీపీఎస్ కిందకే వస్తారు. దీంతో రాష్ట్రంలో సీపీఎస్ ఉద్యోగుల సంఖ్య 3 లక్షలకు మించిపోతుంది.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏలలో ఒకదానిని విడుదల చేసింది. వీఆర్‌ఏలందరినీ ఇతర శాఖలో విలీనం చేస్తూ ఉత్తర్వులిచ్చింది. పీఆర్సీ ఏర్పాటుపైనా సానుకూలంగా ఉంది. ఉద్యోగుల ఆరోగ్య పథకంపై కమిటీని వేస్తున్నామని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. వీటన్నింటినీ పరిశీలిస్తుంటే.. ఎన్నికల ముందు ఉద్యోగుల ప్రధాన సమస్యలను పరిష్కరించి, వారిని మచ్చిక చేసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు అర్థమవుతోంది. అదే పరంపరలో సీపీఎస్ రద్దుపైనా ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఆరు రాష్ట్రాల్లో రద్దు
ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీ్‌సగఢ్, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్‌లలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు సీపీఎ్‌సను రద్దు చేశాయి. ఇటీవల ఎన్నికలు జరిగిన కర్ణాటకలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. సీపీఎ్‌సను రద్దు చేసింది. దీనికి సంబంధించి ‘స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొటోకాల్(ఎ్‌సవోపీ)’ వెలువడాల్సి ఉంది. ఇతర రాష్ట్రాల్లో సీపీఎ్‌సను రద్దు చేస్తుండడంతో ఇక్కడి ప్రభుత్వంపై ఉద్యోగుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. నిజానికి సీపీఎ్‌సను రద్దు చేసుకునే అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలకు ‘పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవల్‌పమెంట్ అథారిటీ(పీఎ్‌ఫఆర్‌డీఏ)’ చట్టం వీలు కల్పిస్తోందని ఉద్యోగ సంఘాల నేతలు వివరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం దీనిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని ఉద్యోగులు గుస్సాగా ఉన్నారు.
సర్కారు గోప్యత
సీపీఎస్ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా గోప్యత పాటిస్తోంది. ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వమని చెప్పుకొనే బీఆర్‌ఎస్ ప్రభుత్వం సీపీఎ్‌సను ఎందుకు రద్దు చేయడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో మరో నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఈ లోపు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఒక్కటొక్కటిగా పరిష్కరిస్తూ పోతోంది. అదే పరంపరలో సీపీఎస్ రద్దుపైనా ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చని ఉద్యోగులు భావిస్తున్నారు. ఇప్పటికే దీనిపై ప్రభుత్వం సానుకూలంగా ఉందంటూ మంత్రి హరీశ్‌రావు తనను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలో చెప్పారు. ఇటీవల టీఎన్‌జీవోల సంఘం నేతలు కలిసినప్పుడూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. సీపీఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దవుతుందని టీఎన్‌జీవో సంఘం నేతలూ చెబుతున్నారు. సీఎం కేసీఆర్‌కు కూడా ఉద్యోగుల పట్ల కొంత మెతకవైఖరితో ఉన్నారని తెలిసింది. కానీ.. ఎవరూ సీపీఎస్ గురించి మాట్లాడకపోవడం ఉద్యోగుల్లో కొంత అసహనాన్ని పెంచుతోంది.
సీపీఎస్ రద్దు కోసం ఇప్పటికే వివిధ ఉద్యోగ సంఘాలు రకరకాల ఆందోళనలు చేపడుతున్నాయి. టీఎన్‌జీవోల సంఘం మంత్రులు, అధికారులను కలిసి సీపీఎ్‌సను రద్దు చేయాలని కోరింది. టీఎ్‌ససీపీఎ్‌సఈయూ ఏకంగా రాష్ట్రంలో రథయాత్రను నిర్వహిస్తోంది. ఈ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ఆధ్వర్యంలో 33 జిల్లాల గుండా ఈ రథయాత్రను నిర్వహిస్తున్నారు. ఈ నెల 16న జోగులాంబ-గద్వాల జిల్లా నుంచి యాత్ర ప్రారంభించగా.. ప్రతి జిల్లాలో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ సీపీఎ్‌సను రద్దు చేయాలంటూ నినదిస్తున్నారు. నాగర్‌కర్నూల్, నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, ములుగు, పెద్దపల్లి, కుమ్రం భీం-ఆసిఫాబాద్ జిల్లాల్లో రథయాత్ర కొనసాగింది. మిగతా జిల్లాల్లోనూ యాత్ర చేపట్టనున్నారు.
ఇదీ సీపీఎస్ కథ..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్రాల ఉద్యోగుల కోసం కేంద్రం ‘నేషనల్ పెన్షన్ సిస్టం(ఎన్‌పీఎస్), సీపీఎస్’ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. 2004 జనవరి 1 తర్వాత నియమితులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌పీఎ్‌సను కేంద్ర పెన్షన్లు, పెన్షనర్ల సంక్షేమ శాఖ వర్తింపజేసింది. ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్వయించుకుంటూ 2014 ఆగస్టు 23న జీవోను జారీ చేసింది. దీంతో 2004 సెప్టెంబరు 1 తర్వాత నియమితులైన రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ విధానం అమలవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 3.28 లక్షల మంది ఉద్యోగులు ఉండగా.. సీపీఎస్ కిందే 2 లక్షల మంది ఉద్యోగులున్నారు. అటెండర్ నుంచి గ్రూపు-1 అధికారుల వరకు సీపీఎస్ కింద ఉన్నారు. దీనిని రద్దు చేయాలంటూ మొదటి నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. సీపీఎస్ విధానం వల్ల తమకు పాత పెన్షన్ విధానంలో ఒనగూరిన 50% పెన్షన్, కుటుంబ సభ్యులకు 30% పెన్షన్, రూ.16 లక్షల గ్రాట్యుటీ, కమ్యూటేషన్ వంటి సౌకర్యాలను కోల్పోతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. నిజానికి ‘పాత పెన్షన్ స్కీమ్(ఓపీఎస్)’ కింద ఉద్యోగి పదవీ విరమణ చేయగానే.. ఆఖరి నెల వేతనంలో 50% మొత్తాన్ని ప్రతి నెలా పెన్షన్ కింద చెల్లిస్తారు. సీపీఎస్ కింద ఈ సౌకర్యం లేదు. ప్రస్తుతం సీపీఎస్ కింద ఉద్యోగి వేతనం, డీఏల నుంచి 10%, ప్రభుత్వం నుంచి మరో 10% సొమ్మును కలిపి ‘నేషనల్ పెన్షన్ స్కీం ట్రస్టు(ఎన్‌పీఎ్‌సటీ)’లో జమ చేస్తున్నారు. ఉద్యోగికి కేటాయించిన ‘పర్మనెంట్ రిటైర్‌మెంట్ అకౌంట్ నెంబర్(ప్రాన్)’లో ఈ సొమ్ము జమ అవుతుంది. ఉద్యోగి పదవీ విరమణ పొందే వరకు జమ అయిన మొత్తం నుంచి 60% డబ్బును మాత్రమే ఉద్యోగికి నగదుగా చెల్లిస్తారు. మిగతా 40% డబ్బును షేర్ మార్కెట్‌లో పెడుతున్నారు. వచ్చే లాభాన్ని నెలవారి పెన్షన్ కింద రిటైర్డు ఉద్యోగికి చెల్లిస్తున్నారు. షేర్ మార్కెట్ నష్టాలను చవిచూస్తే అవే నష్టాల మొత్తాన్ని ఉద్యోగి డబ్బుల నుంచి కట్ చేసుకుంటున్నారు. అందుకే ఈ సీపీఎస్ నష్టదాయకంగా ఉందని, దానిని రద్దు చేసి, ఓపీఎ్‌సనే అమలు చేయాలంటూ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఎన్నికలకు ముందే రద్దు చేయాలి
ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో సీపీఎ్‌సను రద్దు చేశారు. ఇక్కడి ప్రభుత్వం కూడా ఎన్నికలకు ముందే సీపీఎస్‌ను రద్దు చేయాలి. సీపీఎస్ వల్ల ఉద్యోగులకు నష్టమే తప్ప.. లాభం లేదు. పాత పెన్షన్ విధానమే రిటైర్ అయిన పండుటాకులకు అన్నం పెడుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది ఉద్యోగుల స్నేహపూరిత ప్రభుత్వం. సీపీఎ్‌సను రద్దు చేస్తే ప్రభుత్వానికి ఉద్యోగుల నుంచి మరింత ఆదరణ, అభిమానాలు పెరుగుతాయి.
-టీఎస్‌సీపీఎస్‌ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ
Updated Date - 2023-07-26T04:09:13+05:30 IST