Emergency alert : భయపెట్టిన ఫోన్లు!
ABN, First Publish Date - 2023-09-22T03:20:21+05:30
‘‘ఎమర్జెన్సీ అలర్ట్: సివియర్’’.. అనే హెచ్చరికతో గురువారం మధ్యాహ్నం స్మార్ట్‌ఫోన్లకు వచ్చిన మెసేజ్ దేశవ్యాప్తంగా చాలామందిని భయపెట్టింది.
‘ఎమర్జెన్సీ అలర్ట్.. సివియర్’ అనే హెచ్చరికతో దేశవ్యాప్తంగా పలువురి మొబైల్స్‌కు సందేశం
పెద్ద చప్పుడు, వైబ్రేషన్‌తో మోగిన ఫోన్లు
ఉలిక్కిపడ్డ వినియోగదారులు..
ఉత్పాతాలు, ప్రమాదాల గురించి హెచ్చరించే వ్యవస్థను పరీక్షించిన ఎన్‌డీఎంఏ
మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తున్నప్పుడు కలకలం
హైదరాబాద్ సిటీ, హైదరాబాద్, సిద్దిపేట టౌన్, ఆగస్టు 17: ‘‘ఎమర్జెన్సీ అలర్ట్: సివియర్’’.. అనే హెచ్చరికతో గురువారం మధ్యాహ్నం స్మార్ట్‌ఫోన్లకు వచ్చిన మెసేజ్ దేశవ్యాప్తంగా చాలామందిని భయపెట్టింది. దాదాపు 15 నుంచి 20 సెకన్ల వరకు పెద్ద బీప్ శబ్దంతో, వైబ్రేషన్‌తో వచ్చిన ఆ మెసేజ్‌ను చూడగానే.. విషయం ఏమిటో తెలియనివారంతా ఉలిక్కిపడ్డారు. కొంతమంది అయితే భయంతో ఫోన్‌ను స్విచాఫ్ చేసేశారు. మరికొందరు తమ ఫోన్లకు ఏమైందో అర్థం కాక రీస్టార్ట్ చేశారు. గూగుల్‌లో దీని గురించి సెర్చ్ చేశారు. చివరికి.. ఆ సందేశం జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) పంపిందేనని, విపత్తుల సమయంలో హెచ్చరికల వ్యవస్థ ఎంత సమర్థంగా పనిచేస్తుందో పరీక్షించడానికే ఆ సందేశాన్ని పంపిందని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. భూకంపాలు, సునామీలు, వరదల వంటి విపత్తులు సంభవించినప్పుడు, ఉగ్రదాడులు జరిగినప్పుడు ప్రజలను ఎంత వేగంగా అప్రమత్తం చేయగలమో పరీక్షించుకునేందుకు.. ‘సెల్ బ్రాడ్‌కాస్టింగ్ విధానం’లో పంపిన నమూనా సందేశమిది.
తుఫాను హెచ్చరికలను రేడియో, టీవీ ద్వారా జారీ చేయడంతో దీన్ని పోల్చవచ్చు. అయితే, ఇటీవలికాలంలో ప్రతి ఒక్కరి చేతిలోనూ మొబైల్ ఉంటోంది కాబట్టి.. ప్రభుత్వం ప్రకృతి విపత్తులపై హెచ్చరికలు చేయడానికి ఈ విధానాన్ని ఎంచుకుంది. విపత్తు ముంచుకొస్తున్నప్పుడు ఆ సమాచారాన్ని మామూలు ఎస్సెమ్మెస్ రూపంలో పంపిస్తే ఎవరూ పట్టించుకోరు కాబట్టి.. ఇలా మొబైల్ స్ర్కీన్‌పై పెద్ద శబ్దంతో వచ్చేలా దీన్ని అభివృద్ధి చేశారు. ఈ విధానంలో భాగంగా స్మార్ట్‌ఫోన్లతోపాటు.. కంప్యూటర్‌లో బ్రౌజర్ ద్వారా, మామూలు ఫీచర్ ఫోన్ల ద్వారా, ఆర్‌ఎ్‌సఎస్ ఫీడ్ ద్వారా కూడా హెచ్చరికలు జారీ చేస్తారు. ఇంగ్లి్‌షతో పాటు తెలుగు, హిందీ వంటి భారతీయ భాషల్లో కూడా ఈ సందేశాలు ప్రజలకు అందుతాయి. ప్రభుత్వం ఇలా ప్రజల మొబైల్ ఫోన్లకు ప్రయోగాత్మకంగా హెచ్చరిక సందేశాలను పంపడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది జూలై 20న, ఆగస్టు 17న కూడా ఇలాగే పంపించింది. అయితే అప్పటితో పోలిస్తే ఈసారి ఎక్కువ మందికి పంపడమే ఈ హడావుడికి కారణం. గురువారంనాటి ట్రయల్‌లో భాగంగా జియో, బీస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లను వినియోగిస్తున్నవారికి సందేశాలు పంపారు. సెంటర్ ఫర్ డెవల్‌పమెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీడాట్) అభివృద్ధి చేస్తున్న ఈ వ్యవస్థ.. మరో 6 నుంచి 8 నెలల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని ఎన్‌డీఎంఏ వర్గాలు తెలిపాయి. పాశ్చాత్య దేశాల్లో చాలావరకూ రకరకాల పేర్లతో ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి.
ఎంచుకున్న ప్రాంతానికే..
ఏదైనా ఒక ప్రాంతానికి విపత్తు ఎదురైనప్పుడు రాష్ట్రం మొత్తం హెచ్చరికలు పంపాల్సిన అవసరం లేకుండా.. ప్రభావిత ప్రాంతాలకు మాత్రమే ఆ సందేశం పంపితే సరిపోతుంది. ప్రస్తుత విధానం ప్రకారం.. ఒక సర్కిల్‌లో ఉన్న ఫోన్ నంబర్లు అన్నింటికీ ప్రభుత్వం సందేశాలు పంపుతోంది. సెల్ బ్రాడ్‌కాస్ట్ టెక్నాలజీతో ఆ సమస్య ఉండదు. భౌగోళిక హద్దులు నిర్దేశించి ఆ పరిధిలో ఉన్న మొబైల్స్‌కు మాత్రమే అత్యవసర సందేశాలను పంపే అవకాశం ఉంది. 2012 తరువాత తయారైన అన్ని ఫోన్లకూ సందేశం డెలివరీ అయ్యే అవకాశం ఉంది. 2జీ మొదలు తాజా 5జీ వరకూ అన్ని మొబైల్ నెట్‌వర్క్స్‌లోనూ సందేశం ప్రసారం చేసే అవకాశమూ ఉంది. ఇంటరాక్టివ్ విధానంలో సందేశాలను పంపే అవకాశమూ దీనిలో ఉంటుందని ఓ సుప్రసిద్ధ టెలికామ్ సంస్థలో పనిచేస్తున్న నటరాజ్ తెలిపారు.
ఫైర్ అలారమా? ఖాళీ చేద్దామా?
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం మధ్యాహ్నం జీనోమ్‌వ్యాలీలో ఓ ఫార్మా కంపెనీ ఆడిటోరియంలో ప్రసంగిస్తున్నప్పుడు అక్కడున్న వారిలో కొందరి ఫోన్లకు ఈ మాస్ అలర్ట్ మెసేజ్ వచ్చింది. అలా పలు ఫోన్లు ఒకేసారి మోగడంతో కేటీఆర్ తన ప్రసంగాన్ని ఆపి.. ‘‘ఏమిటీ అలర్ట్? అగ్ని ప్రమాద హెచ్చరికా? మనం ఆడిటోరియాన్ని ఖాళీ చేద్దామా?’’ అని ప్రశ్నించారు. అదేం లేదని నిర్వాహకులు బదులిచ్చినా.. మరికొందరి ఫోన్లకు మెసేజ్‌లు వచ్చి నిరంతరాయంగా మోగుతుండడంతో ‘‘ఇదేదో ఫైర్ అలారంలా ఉంది, మనం వెళ్లాలి’’ అన్నారు. నిర్వాహకులు ఫర్వాలేదని చెప్పడంతో.. ‘ఓకే, ఇది క్లోజ్‌డ్ ఆడిటోరియం. సో, గుడ్‌లక్ గైస్’ అని వ్యాఖ్యానించి తన ప్రసంగాన్ని కొనసాగించారు.
ఒకేసారి పెద్ద ఎత్తున..
ఎస్సెమ్మె్‌సలు, పుష్ మెసేజ్‌లకు కొన్ని పరిమితులు ఉంటాయి. సర్వర్ బిజీగా ఉంటే ఎస్సెమ్మెస్‌లు ఆలస్యంగా డెలివరీ అవుతాయి. చాలామంది ఇలాంటి ఎస్సెమ్మె్‌సలను పట్టించుకోరు. పుష్ మెసేజ్‌లను మనం సిమ్ సెట్టింగుల ద్వారా అడ్డుకోవచ్చు. కానీ అలా చేస్తే అత్యవసర, విపత్తు సమయాల్లో ఆ మెసేజ్ రాక మనమే ప్రమాదంలో పడతాం. ఈ రెండు ఇబ్బందులనూ అధిగమించేదే ఈ ‘సెల్ బ్రాడ్‌కాస్టింగ్ విధానం’. ఈ సాంకేతికతతో ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉండే వేలాది, లక్షలాది మందికి ఎంపిక చేసిన సెల్యులార్ నెట్‌వర్క్ ద్వారా సందేశం పంపొచ్చు. ఈ విధానంలో పంపే సందేశం.. మనం ‘ఓకే’ బటన్ నొక్కే వరకూ స్ర్కీన్‌పై అలాగే ఉంటుంది. కాబట్టి ఆ సందేశాన్ని మిస్ అవుతారనే భయం కూడా ఉండదు. అందుకే ప్రభుత్వం ఈ విధానాన్ని ఎంచుకుంది.
- ఆదిత్య, సాంకేతిక నిపుణుడు
Updated Date - 2023-09-22T03:20:21+05:30 IST