ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్తు బకాయిలు..
ABN, First Publish Date - 2023-08-02T03:08:18+05:30
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన విద్యుత్తు బకాయిలను ఆర్బీఐలోని తెలంగాణ ఖాతా నుంచి ఇప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.
తెలంగాణ ఖాతా నుంచి కట్!
ఆర్బీఐకి ఉత్తర్వులిచ్చే విషయమై న్యాయ, ఆర్థిక శాఖలతో సంప్రదింపులు జరుపుతున్నాం
రాజ్యసభలో కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్ వెల్లడి
బకాయిలు చెల్లించకుంటే చర్యలకు యంత్రాంగం లేదా?: జీవీఎల్
న్యూఢిల్లీ, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన విద్యుత్తు బకాయిలను ఆర్బీఐలోని తెలంగాణ ఖాతా నుంచి ఇప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు రిజర్వ్‌బ్యాంకుకు ఉత్తర్వులు జారీ చేయడానికి కేంద్ర న్యాయ, ఆర్థిక శాఖలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్ మంగళవారం రాజ్యసభలో వెల్లడించారు. రాష్ట్ర విభజన జరిగిన తొలినాళ్లలో తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు సరఫరా చేసిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి ఆర్కేసింగ్ మౌఖికంగా సమాధానం ఇచ్చారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలంగాణలో విద్యుత్తు కొరత ఉండేదని, ఆ పరిస్థితిలో ఏపీ నుంచి తెలంగాణకు విద్యుత్తు సరఫరా చేయాలని కేంద్రం ఆదేశించవచ్చని విభజన చట్టంలో పొందుపర్చారని ఆర్కే సింగ్ గుర్తు చేశారు.
ఆ నిబంధనను అనుసరించి తెలంగాణకు విద్యుత్తు సరఫరా చేయాలని తాము జారీ చేసిన ఆదేశాల మేరకు ఏపీ తెలంగాణకు విద్యుత్తు సరఫరా చేసిందని, అందుకు తొలుత కొంతకాలం ఏపీకి తెలంగాణ చెల్లింపులు చేసిందని, ఆ తర్వాత చెల్లింపులను చేపట్టలేదని చెప్పారు. రెండు రాష్ట్రాల అధికారులతో తమ శాఖ చర్చించిన తర్వాత దాదాపు రూ. 6 వేల కోట్లకుపైగా బకాయిలు తెలంగాణ ఏపీకి చెల్లించాలన్న నిర్ధారణకు వచ్చామని కేంద్ర మంత్రి తెలిపారు. ఒకవేళ చెల్లింపులు చేపట్టకపోతే తగిన చర్యలు తీసుకోవాలని చట్టంలో ఉందని, దాని ప్రకారం బకాయిలను చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించామని స్పష్టం చేశారు. తమ ఆదేశాలను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించిందని, స్టే ముగిసినా బకాయిలు చెల్లించడం లేదని తెలిపారు. ఎంపీ జీవీఎల్ నరసింహరావు మాట్లాడుతూ ఒక ప్రభుత్వం మరో ప్రభుత్వానికి ఇలా బకాయిలు చెల్లించకపోతే జోక్యం చేసుకొనేందుకు జాతీయ స్థాయిలో యంత్రాంగం ఉందా అని ప్రశ్నించారు.
Updated Date - 2023-08-02T03:08:18+05:30 IST