విద్యుత్ ‘కట్’కట!
ABN, First Publish Date - 2023-05-16T23:44:14+05:30
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో విద్యుత్ కోతలతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒకవైపు దంచి కొడుతున్న ఎండలకు కరెంట్ కోతలు తోడవడంతో జనం అల్లాడిపోతున్నారు. పెరుగుతున్న ఎండ వేడిమికి విద్యుత్ వినియోగం పెరిగింది. దీంతో అనధికారిక విద్యుత్ కోతలు మొదలయ్యాయి. ఫీడర్లపై విద్యుత్ లోడ్ పెరగడంతో రెండు మూడు గంటలు కోతలు విధించాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరెంట్ కష్టాలు
రెండు నుంచి నాలుగు గంటలు విద్యుత్ కోతలు
ఉక్కపోతతో జనం ఉక్కిరి బిక్కిరి
పెరిగిన ఉష్ణోగ్రతలు.. అధికమైన కరెంట్ వినియోగం
ఫీడర్‌పై లోడ్ పెరగడంతోనే కోతలంటున్న అధికారులు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో విద్యుత్ కోతలతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒకవైపు దంచి కొడుతున్న ఎండలకు కరెంట్ కోతలు తోడవడంతో జనం అల్లాడిపోతున్నారు. పెరుగుతున్న ఎండ వేడిమికి విద్యుత్ వినియోగం పెరిగింది. దీంతో అనధికారిక విద్యుత్ కోతలు మొదలయ్యాయి. ఫీడర్లపై విద్యుత్ లోడ్ పెరగడంతో రెండు మూడు గంటలు కోతలు విధించాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు.
రంగారెడ్డి అర్బన్, మే 16 : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొద్ది రోజులగా కరెంట్ కష్టాలు వెంటాడుతున్నాయి. పవర్ కట్‌తో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ఒకవైపు దంచి కొడుతున్న ఎండలకు కరెంట్ కోతలు తోడవడంతో జనం అల్లాడిపోతున్నారు. ఇంట్లో ఉండలేక, బయటికి రాలేక సతమతమవుతున్నారు. రాత్రి పూట కరెంట్ కోతతో నిద్ర కరువవుతోంది. పెరుగుతున్న ఎండ వేడిమికి విద్యుత్ వినియోగం పెరిగింది. ఫలితంగా అనధికారిక విద్యుత్ కోతలు మొదలయ్యాయి. విద్యుత్ లోడ్ పెరగడంతో రెండు మూడు గంటలు కోతలు విధించాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి రెండు నుంచి నాలుగు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది.
ఉమ్మడి జిల్లాలో విద్యుత్ కోతలతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పల్లెల్లో కంటి మీద కునుకు లేని రాత్రులు గడుపుతున్నారు. ప్రతి రోజూ రాత్రి వేళలో కనీసం మూడు నుంచి నాలుగు గంటల పాటు విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. విద్యుత్ శాఖ ముందస్తు చర్యలు లేకపోవడ వల్లే సంక్షోభం ఏర్పడింది. ఓ వైపు విద్యుత్ చార్జీలు పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్న సర్కారు, నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయలేక చేతులెత్తేస్తుంది. వారం రోజుల నుంచి జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడతో విద్యుత్ వినియోగం అధికమైంది. ఫ్యాన్లు, ఏసీలు, కూలర్ల వినియోగం పెరిగిపోయింది. దీంతో రాత్రి, పగలు తేడా లేకుండా కోత విధిస్తున్నారు. కరెంట్ ఎంత సేపు తీస్తారో... ఎప్పడు తీస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇంట్లో శుభకార్యం ఉందంటే చాలు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు కరెంట్ కోత కారణంగా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చిన్నారులు , వృద్ధుల పరిస్థితి ఇక చెప్పనక్కర్లేదు. మధ్యాహ్న సమయంలో పవర్ కట్ చేస్తుండటంతో.. చెట్ల కింద సేద తీరుతున్నారు.
ఉరిమినా.. మెరిసినా.. గట్టిగా గాలి వీచినా చేవెళ్లలో కరెంట్ కట్ అవుతోంది. చిన్నపాటి వర్షం పడినా గంటల తరబడి కరెంట్ కోత విధిస్తున్నారు. ఒక వేళ గట్టిగా గాలి వీస్తే ఒక అంతే సంగతులు. విద్యుత్ వైర్లు చాలా వరకు కిందకు వేలాడుతూ ఉండటంతో పాటు, వైర్లు ఒకదానికొకటి తాకడంతో షాక్ సర్య్కూట్‌తో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కేశంపేట మండలం చింతకుంటపల్లిలో విద్యుత్ కోతలు తీవ్రంగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. షాబాద్, శంకర్‌పల్లి, మొయినాబాద్, షాద్‌నగర్ ప్రాంతంలో వీలైతే సాయంత్రం లేదా రాత్రి వేళల్లో రెండు నుంచి మూడు గంటల పాటు కరెట్ కోత విధిస్తున్నారు.
వికారాబాద్ జిల్లా తాండూరు, పరిగి, మోమిన్‌పేట, నవాబుపేట, వికారాబాద్‌లో తరచూ విద్యుత్ కోతలు ఉత్పన్నమవుతున్నాయి. లైన్ క్లియర్(ఎల్‌సీ) పేరిట గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. కొడంగల్ ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. చిన్న పాటి వర్షం పడినా.. విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ ప్రాంతంలో ప్రతీ రోజు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య రెండు గంటలు పాటు సాయంత్రం మరో రెండు గంటలు విద్యుత్ కోత విధిస్తున్నారు. కీసరలో సాయంత్రం, మధ్యాహ్న సమయంలో రెండు నుంచి మూడు గంటలు విద్యుత్‌కోత తప్పడం లేదు. అలాగే ఘట్‌కేసర్ ప్రాంతంలో సాయంత్రం, శామీర్‌పేటలో ఉదయం వేళలో విద్యుత్ కోతలు విఽధిస్తున్నారు. కరెంట్ సరఫరాలో తరచూ అంతరాయంతో వ్యాపార, వాణిజ్య వర్గాలపై ఎక్కువగా ప్రభావం పడుతోంద
వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతుంటే క్షేత్రస్థాయిలో 16 నుంచి 18 గంటల పాటు సరఫరా అవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో త్రీఫేజ్ కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది.
కంటినిండ నిద్ర కరువు
రాత్రి వేళ్లలో గంటల తరబడి కరెంట్ కోత విధిస్తున్నారు. చిన్న పాటి వర్షం కురిసినా.. గాలి వీచినా కరెంట్ కట్ చేస్తున్నారు. పగలు ఎండ.. రాత్రికి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. కరెంట్ కట్ చేయడంతో కంటి నిండ నిద్రలేకుండా పోతుంది.
- శంకర్, గొల్లగూడ, చేవెళ్ల మండలం
చినుకు పడితే చాలు..
వర్షం పడితే చాలు గంటల తరబడి కరెంట్ కోత విధిస్తున్నారు. ఒక వేళ రాత్రి పూట వర్షం కురిస్తే ఆ రాత్రి మొత్తం కరెంట్ తీస్తున్నారు. ఎల్సీ పేరిట గంటల తరబడి తీస్తున్నారు. విద్యుత్ సమస్య పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
-శ్రీనివాస్, చింతకుంటపల్లి గ్రామం
రోజుకు నాలుగైదు సార్లు పోతుంది
కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడో పోతుందో ఎవరికి తెలియడం లేదు. రోజుకు నాలుగైదు సార్లు వస్తూ పోతుంది. ఇక రాత్రి వేళల్లో కరెంట్ పోయిన సమయంలో చుక్కలు చూస్తున్నాం. ఫోన్ చేస్తే ఎవరూ స్పందించడం లేదు. అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదు.
- రెడ్డబోయిన మహేష్, కీసర అనుబంధ గ్రామం వన్నీగూడెం
వేళాపాళా లేకుండా కోతలు..
ఎప్పుడు పడితే అప్పుడు కరెంట్ తీస్తున్నారు. మా తండాలో కూరగాయ తోటలు ఉన్నాయి. కరెంట్‌తో ఎక్కువ అవసరం లేకుండాట తీసేస్తున్నారు. వేళాపాళా లేకుండా కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
- సేవ్యానాయక్, మద్దిమడుగుతండా, బొంరాస్‌పేట్ మండలం
ఒక్కోసారి లోడ్ ఎక్కువుతుంది.
విద్యుత్ వినియోగంతో ఒక్కోసారి ఫీడర్లపై లోడ్ పెరిగిపోతోంది. విద్యుత్ కోతలు ఏమి లేవు. 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్ వినియోగం పెరిగింది. అవసరం ఉన్నప్పుడు మాత్రమే లైట్లు, ఫ్యాన్లు వేసుకోవాలి. అలాగే వ్యవసాయ మోటార్లు అవసరాన్ని బట్టి ఆన్ చేసుకోవాలి. నీటిని పొదుపుగా వాడుకోవాలి.
- జానీ, విద్యుత్ ఏఈ, చేవెళ్ల
రంగారెడ్డి జిల్లాలో విద్యుత్ వినియోగం
రోజు వారి సగటు విద్యుత్ వాడకం (మి,యూ) 21.12
అత్యధిక విద్యుత్ డిమాండ్ (మె.వా) 790.195
వ్యవసాయ వినియోగదారులు (కేటగిరి-5) 99,845
గృహ వినియోగదారులు (కేటగిరి-1) 12,40,872
వాణిజ్య వినియోగదారులు (కేటగిరి-2) 1,78,865
పరిశ్రమలు (కేటగిరి-3+4+హెచ్‌టీ) 9,035
Updated Date - 2023-05-17T00:12:57+05:30 IST