మంథని టికెట్ పుట్ట మధుకు ఇవ్వొద్దు
ABN, First Publish Date - 2023-09-04T04:23:20+05:30
పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకు బీఆర్‌ఎస్ పార్టీ మంథని అసెంబ్లీ టికెట్ కేటాయించడంపై అక్కడి పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
బీఆర్‌ఎస్ అసమ్మతి నేత నారాయణ
కేటీఆర్‌ను ఓడిస్తాం.. ముదిరాజ్‌ల ధర్నా
గువ్వలకు టికెట్‌పై రాములు కినుక
భూపాలపల్లి/ సిరిసిల్ల టౌన్/ నాగర్‌కర్నూల్/ సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకు బీఆర్‌ఎస్ పార్టీ మంథని అసెంబ్లీ టికెట్ కేటాయించడంపై అక్కడి పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. హత్యా రాజకీయాలను ప్రోత్సహించవద్దని భూపాలపల్లి జిల్లా కాటారం మండల పీఏసీఎస్ చైర్మన్ చల్లా నారాయణరెడ్డి బీఆర్‌ఎస్ అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు. తన మద్దతుదారులతో ఆదివారం ఆయన అత్మీయ సమ్మేళనం పేరుతో కాటారంలో సమావేశం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళానానికి మంథని నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల నుంచి కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు భారీగా తరలివచ్చారు. పుట్ట మధుకు టికెట్ కేటాయించడంపై పునరాలోచించాలని నారాయణరెడ్డి బీఆర్‌ఎస్ అధిష్ఠానాన్ని కోరారు. తనకు 40ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని, ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మంథనిలో అభ్యర్థిని మార్చకుంటే తన మద్దతుదారుల అభిప్రాయం మేరకు భవిష్యత్తు కార్యాచరణ వెల్లడిస్తానని హెచ్చరించారు. కాగా, న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్యలో పుట్ట మధు ప్రమేయం ఉందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. మధు కొద్ది రోజులు అజ్ఞాతంలోకి కూడా వెళ్లారు. దీంతో పాటు ఆయనపై అనేక ఆరోపణలు రావటంతో ఈసారి మధుకు బీఆర్‌ఎస్ టికెట్ అనుమానమేనని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే చల్లా నారాయణరెడ్డి మంథని టికెట్ ఆశించి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఎమ్మెల్సీ కవితతో పాటు మంత్రి కేటీఆర్‌ను కలిసి టికెట్ కోసం విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. నియోజకవర్గంలో పుట్ట మధు వ్యతిరేకులను ఒకేతాటిపైకి తెచ్చేందుకు కృషి చేశారు. అయితే కేసీఆర్ మంథని టికెట్‌ను మధుకే కేటాయించడంతో నారాయణరెడ్డి, ఆయన వర్గం కంగుతిన్నారు. దీంతో, ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేయాలని నారాయణరెడ్డి మద్దతుదారులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
ముదిరాజ్‌లకు ఇవ్వాలని డిమాండ్
సిరిసిల్ల టౌన్,: రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్‌ఎస్ పార్టీ ముదిరాజ్‌లకు ఒక్క ఎమ్మెల్యే సీటును కూడా కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ ముదిరాజ్ సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రాజన్న సిరిసిల్లలో మహాధర్నా నిర్వహించారు. ముదిరాజ్‌లకు టికెట్లు ఇవ్వకపోతే బీఆర్‌ఎస్ పార్టీని, సిరిసిల్లలో కేటీఆర్‌ను ఓడిస్తామని హెచ్చరించారు. సిరిసిల్లలో ముదిరాజ్ వర్గానికి చెందిన వ్యక్తిని స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేయించి ఇతర కులాల మద్దతుతో విజయం సాధిస్తామన్నారు. ధర్నా సందర్భంగా ముదిరాజ్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, జిల్లా కోర్ కమిటీ సభ్యుడు భూమేశ్ మాట్లాడారు. మునుగోడులో నారబోయిన రవి, పటాన్‌చెరులో నీలం మధు, సంగారెడ్డిలో పులిమామిడి రాజుకు టికెట్లు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. ఈ మూడు అసెంబ్లీ సీట్లను ముదిరాజ్‌లకు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ముదిరాజ్‌లకు సముచిమైన స్థానం కల్పించకపోతే ఆ పార్టీల రాష్ట్ర అధ్యక్షులను, ముఖ్య నాయకులను కూడా ఓడిస్తామని వారు హెచ్చరించారు.
కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న ఎంపీ!
బీఆర్‌ఎస్‌లో అసంతృప్త నేతల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి టికెట్‌ను తిరిగి సిటింగ్ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కు కేటాయించడంపై ఇటీవల అక్కడ అసమ్మతి గళం వినిపించింది. అయితే అచ్చంపేట టికెట్‌ను మళ్లీ గువ్వల బాలరాజుకే ఇవ్వడంతో ఎంపీ పోతుగంటి రాములు కినుక వహిస్తున్నారు. గతంలో అచ్చంపేట ఎమ్మెల్యేగా ఉన్న రాములు.. చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేశారు. తర్వాత బీఆర్‌ఎ్‌సలో చేరి ఎంపీగా గెలుపొందారు. అయితే రాములు, బాలరాజు మధ్య ఇంతకు ముందు జడ్పీ చైర్మన్ ఎన్నిక వ్యవహారం అగ్గి రాజేసింది. రాములు తనయుడు భరత్‌ప్రసాద్ కల్వకుర్తి జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎస్సీలకు రిజర్వ్ చేసిన ఈ స్థానం నుంచి అనూహ్యంగా తెలకపల్లి జడ్పీటీసీ సభ్యురాలు పద్మావతి బంగారయ్య చైర్‌పర్సన్ పదవిని దక్కించుకున్నారు. ముగ్గురు సంతానం ఉన్న కేసులో ఆమెపై అనర్హత వేటు పడగా.. తన కుమారుడికి చైర్మన్ పదవి రాకుండా గువ్వల అడ్డుకున్నారని రాములు వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాదం చిలికిచిలికి గాలివానలా మారింది. ఈ నేపథ్యంలో అచ్చంపేట అసెంబ్లీ నుంచి రాములుకు అవకాశం కల్పిస్తారని, ఎంపీగా గువ్వల పోటీ చేస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. అందుకు భిన్నంగా గువ్వల బాలరాజుకే సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారు. దీంతో రాములు కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది.
Updated Date - 2023-09-04T04:23:20+05:30 IST