మాప్ అప్ అయ్యాకే బీ కేటగిరి కౌన్సెలింగ్!
ABN, First Publish Date - 2023-08-27T03:57:04+05:30
వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి కన్వీనర్ కోటాలోని మాప్ అప్ రౌండ్ పూర్తి అయిన తర్వాతే బీ కేటగిరీ కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించాలని ఎంబీబీఎస్ ఆశావహులు కోరుతున్నారు.
హెల్త్ వర్సిటీ అధికారులకు ఎంబీబీఎస్ ఆశావహుల వినతి
హైదరాబాద్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి కన్వీనర్ కోటాలోని మాప్ అప్ రౌండ్ పూర్తి అయిన తర్వాతే బీ కేటగిరీ కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించాలని ఎంబీబీఎస్ ఆశావహులు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న విధానంలో కన్వీనర్ కోటాలో సీటు పొందే అవకాశం కోల్పోతున్నామని వాపోతున్నారు. నీట్‌లో ఆలిండియా ర్యాంకు 1.31 లక్షలు వచ్చిన అభ్యర్థులకు కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీటు లభించింది. హెల్త్ యూనివర్సిటీ కన్వీనర్ కోటా మొదటి రౌండ్ కౌన్సెలింగ్ కూడా పూర్తి అయ్యింది. రెండో రౌండ్‌లో 1.35 లక్షల ర్యాంకు వరకు సీటు లభించే అవకాశాలున్నాయని వైద్యవర్గాలు అంటున్నాయి. మరోపక్క, బీ కేటగిరిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన వర్సిటీ దరఖాస్తుకు ఆగస్టు 28 వరకు అవకాశం ఇచ్చింది. అయితే బీ కేటగిరి కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలుపెట్టడానికి ముందే కన్వీనర్ కోటాలోని రెండో రౌండ్, మాప్ అప్ రౌండ్ పూర్తి చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. లేదంటే ఫీజుల పరంగా తాము నష్ట పోవాల్సివస్తుందని వాపోతున్నారు. కాగా, గతఏడాది నీట్‌లో 8లక్షల ర్యాంకు (ఆలిండియా) వచ్చిన అభ్యర్థికి ఎంబీబీఎస్ సీటు వచ్చింది. ఈ ఏడాదీ కొంచెం అటు ఇటుగా ఆ స్థాయిలో ర్యాంకు వచ్చిన వారికి యాజమాన్య కోటాలో సీటు దక్కే అవకాశం ఉందని వర్సిటీ వర్గాలు వెల్లడించాయి.
Updated Date - 2023-08-27T03:57:04+05:30 IST