రైతుల గోడు వినేదెవరు..?
ABN, First Publish Date - 2023-03-05T23:01:23+05:30
దండేపల్లి మండలం గూడెం వద్ద గోదావరిపై నిర్మించిన సత్యనారాయణస్వామి లిఫ్ట్ ఇరిగేషన్‌లో వాడిన నాసిరకం పైపుల కారణంగానే తరుచుగా పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్‌తో కుమ్మక్కయి నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడంతోనే లిఫ్ట్ తరుచుగా మొరా యిస్తోందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
మంచిర్యాల, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): దండేపల్లి మండలం గూడెం వద్ద గోదావరిపై నిర్మించిన సత్యనారాయణస్వామి లిఫ్ట్ ఇరిగేషన్‌లో వాడిన నాసిరకం పైపుల కారణంగానే తరుచుగా పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్‌తో కుమ్మక్కయి నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడంతోనే లిఫ్ట్ తరుచుగా మొరా యిస్తోందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా ప్రతీ యాసంగిలో నీరందక పంటలు ఎండిపోవడం షరా మామూలైంది. దండేపల్లి మండలం గూడెం వద్ద 3 టీఎంసీల సామర్థ్యంతో రూ.125 కోట్ల వ్యయంతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. 2009 ఫిబ్రవరి 20న కాం ట్రాక్టర్‌తో అగ్రిమెంట్ పూర్తికాగా హైద్రాబాద్‌లోని ఎంఈఐఎల్- కేబీఎల్- డబ్ల్యూజీ సంస్థకు పనులు అప్పగించారు. లిఫ్ట్ పనులు ఆరేళ్లపాటు కొనసాగగా 2015లో అందుబాటులోకి వచ్చింది. దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల్లో 30వేల ఎకరాలకు సాగు నీరందించే ఉద్దేశ్యంతో ఎత్తిపోతల పథకానికి రూపకల్పన జరిగింది.
తరుచుగా మొరాయిస్తున్న లిఫ్ట్
గూడెం ఎత్తిపోతల పథకం పంపుహౌజ్ నుంచి దండేపల్లి మండలం తానిమడుగు వరకు 12.01 కిలోమీటర్లు పొడవున పైప్‌లైన్ ద్వారా కడెం ప్రాజెక్టు 30వ డిస్ట్రిబ్యూటరీ వద్ద నిర్మించిన ప్రధాన కాలువలోకి నీటిని విడుదల చేస్తారు. అక్కడి నుంచి హాజీపూర్ మండలం 42వ డిస్ట్రిబ్యూటరీ వరకు యాసంగిలో ఆయకట్టు పంటలకు సాగునీరు అందించాల్సి ఉంది. డీపీఆర్ ప్రకారం నిర్ణీత దూరం వరకు ఎంఎస్ పైపులు వేయాల్సి ఉండగా, కాంట్రాక్టర్ సూచన మేరకు జీఆర్పీ పైపులను అమర్చారు. దీంతో లిఫ్ట్ ప్రారంభించిన మొదటి ఏడాదే సమస్యలు ప్రారంభమయ్యాయి. లిఫ్ట్‌లోని రెండు మోటార్లు ఆన్ చేస్తేనే 290 క్యూసెక్కుల నీరు ఎత్తిపోసి మూడు మండలాలకు సాగునీరు అందే అవకాశాలు ఉన్నాయి. రెండు మోటార్లు ఆన్‌చేసిన ప్రతిసారీ ప్రెజర్ తట్టుకోలేక జీఆర్పీ పైపులు పగులు తున్నాయి. 2015-16 నుంచి 2021-22 మధ్యకాలంలో ఏకంగా 85 సార్లు పైపులు పగిలి పంటలకు సకాలంలో నీరందని పరిస్థితులు తలెత్తాయి. పైపులు పగిలినప్పుడల్లా తాత్కాలికంగా మరమ్మతు చేయడంతోనే సరిపెడుతుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సిబ్బంది కొరతే కారణమా...?
కడెం ప్రాజెక్టు ద్వారా గ్రావిటీ విధానంలో దండేపల్లి మండలం వరకు యాసంగి నీరు విడుదల కావలసి ఉంది. ఇందుకు షెడ్యూల్ ప్రకారం నీటిని విడుదల చేయాలంటే ప్రాజెక్టు గేట్లు 6.5 ఫీట్ల మేర ఎత్తాలి. అప్పు డే ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందే అవకాశాలు ఉంటాయి. తపాల్ పూర్ డిస్ట్రిబ్యూటర్ 19 నుంచి 28 వరకు దండేపల్లి మండలంలోని పంట లకు నీరు వస్తుంది. అయితే దీనికి భిన్నంగా తపాల్‌పూర్ వరకు సరిపడా మాత్రమే 3.5 ఫీట్ల వరకు ఎత్తుతున్నట్లు సమాచారం. దీంతో యాసంగికి నిర్ణీత 30వేల ఎకరాలకు నీరు అందడం లేదు. షెడ్యూల్‌లో కేవలం సగం నీరు వదులుతుండటంతో ఇప్పటి వరకు మూడు తడులకు నీరందాల్సి ఉండగా, కనీసం ఒక్క తడికి కూడా పారిన దాఖలాలు లేవు. మొదటి నాలుగు రోజులు ఖానాపూర్ మండల రైతులకు డీ 19 వరకు, తరువాత నాలుగు రోజులు దండేపల్లిలోని డీ 28వరకు నీటిని విడుదల చేస్తున్నారు. రెండో దఫా నీటిని ఖానాపూర్ రైతులు వాడుకోకూడదనే నిబంధన ఉంది. ప్రాజెక్టు తమ పరిధిలో ఉండటంతో మొత్తం ఎనిమిది రోజులపాటు ఖానాపూర్ రైతులకు నీరందుతోంది. దీంతో దండేపల్లి రైతుల పంటలు ఎండిపోతనాఆ్నయి. కడెం ప్రధాన కాలువ వెంట నీటిని విడుదల చేయ డానికి గతంలో 102 మంది సిబ్బంది ఉండేవారు. కడెం కెనాల్ డీ1 నుంచి 28 వరకు పనిచేసేవారు. దీంతో ఎప్పటికప్పుడు కెనాల్ గేట్లు తెరిచి నీటిని విడుదల చేసేవారు. ప్రస్తుతం కేవలం 16 మంది మాత్రమే పని చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీరిలో 12 మంది గ్యాంగ్‌మెన్, 4గురు వర్క్ ఇనెస్పెక్టర్లు ఉన్నారు. ఈ కారణంగా కూడా నీటిని సకాలంలో విడుదల చేయక పంటలు ఎండిపోతున్నాయని తెలుస్తోంది.
ఎంఎస్ పైపులు వేయడమే పరిష్కారం
గూడెం లిఫ్ట్‌నకు అమర్చిన జీఆర్పీ పైపులు తరుచుగా పగిలి పోతుండటంతో వాటి స్థానంలో ఎంఎస్ పైపులు అమర్చాలనే నిర్ణయానికి అధికారులు వచ్చారు. ఈ విషయమై చర్యలు తీసుకోవాలని ఈ యేడాది జనవరి 16న కడెం ప్రాజెక్టు ఇరిగేషన్ డివిజన్ 4 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నిర్మల్ జిల్లా ఐఅండ్‌క్యాడ్ డిపార్టుమెంట్ సూపరింటెండింగ్ అధికారితో పాటు కలెక్టర్‌కు లేఖ రాశారు. ప్రస్తుతానికి ఆరు కిలోమీటర్ల మేర జీఆర్పీ స్థానంలో ఎంఎస్ పైపులు ఏర్పాటు చేస్తే కొంత ఇబ్బందులు తొలగు తాయని పేర్కొన్నారు. అయితే పెరిగిన స్టాండర్డ్ షెడ్యూల్ రేట్ ప్రకారం ఎంఎస్ పైపులు వేసేందుకు కిలో మీటర్‌కు రూ. 12 కోట్ల మేర ఖర్చవు తుందని అంచనా. మొత్తం 12.01 కిలోమీటర్ల మేర ఎంఎస్ పైపులు మార్చాలంటే రూ.144 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఆరు కిలోమీటర్ల మేర మార్చాలన్నా కనీసం రూ.72 కోట్లు వెచ్చించాల్సి ఉం టుంది. అంత బడ్జెట్ కేటాయింపులు జరిగే అవకాశం లేనందున ప్రత్యా మ్నాయంగా కొత్తగూడెం జిల్లాలోని కోయల్‌సాగర్ (ఇందిరా సాగర్) ప్రాజెక్టు పైపులు తరలించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు పనులు నిలిచిపోయినందున దానికి సంబంధించిన 13 కిలోమీటర్ల ఎంఎస్ పైపులు పనికి వస్తాయనే భావనలో ఉన్నారు. కోయల్ సాగర్ పైపులుతరలించేందుకు అధికారులు హైదారాబాద్‌కు లేఖ రాసినట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి ఆర్డర్లు వస్తే పైపులు తరలించి ఇక్కడ అమర్చనున్నారు. దీంతో ప్రస్తుతం నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశాలున్నాయి.
సక్రమంగా నీరు విడుదల చేయాలి
అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్ నాయక్, మంచిర్యాల ఆర్డీవో దాసరి వేణు ఆదివారం కడెం కెనాల్‌ను డీ 30 వద్ద పరిశీలించారు. నీటి విడుదలకు సంబంధించిన విధివిధానాలను అక్కడి సిబ్బందిని తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ యాసంగిలో నిర్ణీత ఆయకట్టు వరకు ఎలాంటి అంతరాయం లేకుండా సక్రమంగా నీటిని విడుదల చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
Updated Date - 2023-03-05T23:01:23+05:30 IST