ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పక్కా భవనానికి మోక్షమేప్పుడు?

ABN, First Publish Date - 2023-03-06T23:00:11+05:30

జిల్లాలోని వైద్య కళాశాలకు పక్కా భవన నిర్మాణానికి మోక్షం లభించడం లేదు. నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ) ఆదేశాల ప్రకారం కళాశాల ప్రారంభమైనప్పటి నుంచి ఏడాదిలోగా పక్కా భవనం నిర్మించాల్సి ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మంచిర్యాల, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వైద్య కళాశాలకు పక్కా భవన నిర్మాణానికి మోక్షం లభించడం లేదు. నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ) ఆదేశాల ప్రకారం కళాశాల ప్రారంభమైనప్పటి నుంచి ఏడాదిలోగా పక్కా భవనం నిర్మించాల్సి ఉంది. అయితే ఆరు నెలలు గడుస్తున్నా కళాశాల అంశం కేవలం స్థల పరిశీలనలోనే ఉంది. ఎన్నో అడ్డంకులు, అవాంతరాల నడుమ మంచిర్యాల వైద్య కళాశాలకు చివరి నిమిషంలో అనుమతులు లభించిన విషయం తెలిసిందే. వైద్య కళాశాలను జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. మంచిర్యాల కళాశాలతోపాటు లెటర్‌ ఆఫ్‌ పర్మిషన్‌ (ఎల్‌వోపీ) కోసం సంగారెడ్డి, వన పర్తి, కొత్తగూడెం, మహబూబాబాద్‌, నాగర్‌ కర్నూల్‌, రామగుండం వైద్య కళాశాలలు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిలో మంచిర్యాల మినహా మిగ తా కళాశాలలన్నింటికీ నిబంధనల మేరకు అన్ని వసతులు ఉండటంతో అనుమతులు మంజూరు కాగా మంచిర్యాల కళాశాలలో సరైన వసతులు లేని కారణంగా చివరి నిమిషం వరకు వేచి చూడాల్సి వచ్చింది.

అనేక ఒత్తిళ్ల నడుమ

మంచిర్యాల జిల్లాకు మంజూరైన వైద్య కళాశాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్‌ఎంసీ అనుమతులు మంజూరు చేయాల్సి వచ్చింది. రెండు దఫాల ఎన్‌ఎంసీ తనిఖీల సందర్భంగా కళాశాల నిర్వహణకు అనుమతులు నిరాకరించింది. రేకుల షెడ్డులతో నిర్మాణం, మౌలిక సదుపాయల లేమి, తదితర కారణాలు చూపుతూ అనుమతులు నిరాకరించింది. దీంతో రాష్ట్ర ప్రభు త్వం అప్పీల్‌కు వెళ్లడం, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌నేత, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావులు ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి కళాశాలకు అనుమతులపై విన్నవించగా ఎట్టకేలకు కేంధ్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రెండో దశ కౌన్సెలింగుకు కళాశాల అందుబాటులోకి వచ్చింది. అయితే అనుమతులు ఆలస్యంగా మంజూరైన కారణంగా ఎంబీబీఎస్‌ ప్రథమ సంవత్సరం 150 సీట్లకు 100 సీట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి.

ఆదేశాలు అమలయ్యేనా...?

మంచిర్యాల వైద్య కళాశాలకు అనుమతులు ఇచ్చిన ఎంఎన్‌సీ పలు షరతులు విధించింది. సంవత్సరంలోపు పక్కా భవనం నిర్మించాలనే నిబంధన విధించింది. కళాశాల శాశ్వత భవన నిర్మాణానికి పలు చోట్ల అధికారులు స్థలాలు పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని భూదాన్‌ భూము లు జూలైలో కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురికాగా, అందులో కళాశాల నిర్మాణం చేపట్టవద్దనే నిర్ణయానికి వచ్చారు. అనంతరం సాయికుంటలోగల సర్వే నంబర్లు 662, 675లో 15 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. ఆ స్థలాన్ని వైద్య కళాశాలకు కేటాయిస్తూ మున్సిపల్‌ కౌన్సిల్‌ సైతం తీర్మానించింది. మూడు నెలలు గడుస్తున్నా స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు కళాశాలకు అందజేయలేదు. తీర్మానంతోనే సరిపెట్టడంతో అసలు కళాశాల అక్కడే ఏర్పాటు చేస్తారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మేలో నీట్‌

వైద్య సీట్ల భర్తీ కోసం దేశవ్యాప్తంగా యేటా నిర్వహించే నీట్‌ (నేషనల్‌ ఎలిజిబులిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌)ను మేలో నిర్వహించేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ సన్నాహాలు చేస్తోంది. పరీక్ష జరిగిన తరువాత గరిష్టంగా 45 రోజుల్లోగా ఫలితాలు వెలువడుతాయి. అనంతరం ప్రథమ సంవత్సరం వైద్య సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అవుతుంది. ఆగస్టులో అడ్మిషన్ల ప్రక్రియ కూడా పూర్త వుతుంది. అంటే మరో ఐదు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ లోగా మంచిర్యాల వైద్య కళాశాలకు అన్ని హంగులతో కూడిన పక్కా భవనం నిర్మిస్తేనే అడ్మిషన్లు స్వీకరించేందుకు ఎన్‌ఎంసీ అనుమతులు ఇస్తుంది. లేదంటే ద్వితీయ సంవత్సరం నుంచి కొనసాగించాల్సిన పరిస్థి తులు ఉంటాయి. ఈ ఐదు నెలల్లో పక్కా భవన నిర్మాణం పూర్తయ్యే అవ కాశాలు తక్కువ. మంచిర్యాల కళాశాల తెరపైకి వచ్చిన తరువాత రెండో దఫాలో కుమరంభీం ఆసిఫాబాద్‌కు మెడికల్‌ కాలేజీ మంజూరైంది. అక్కడ పక్కా భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 70 శాతం మేర పనులు పూర్తయినట్లు సమాచారం. మంచిర్యాలలో మాత్రం కేవలం స్థల పరిశీలన దశలోనే ఉండటం గమనార్హం.

సమాచారం లేదు

సులేమాన్‌, మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌

ప్రభుత్వ వైద్య కళాశాలకు జిల్లా కేంద్రంలోని సాయికుంటలో స్థలం కేటాయిస్తున్నట్లు తెలిపారు. అయితే ఇంతవరకు దానికి సంబంధించి ఎలాంటి పురోగతి లేదు. అది ఏ స్థితిలో ఉందన్న సమాచారం కూడా అందలేదు. అక్కడే కేటాయిస్తారో...మరెక్కడికైనా మారుస్తారో తెలియదు.

Updated Date - 2023-03-06T23:00:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising