సోషల్‌మీడియాపై పోలీసుల నజర్
ABN, First Publish Date - 2023-02-21T02:08:17+05:30
: జిల్లా వ్యాప్తంగా సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న పొలిటికల్ బ్రేకింగ్ స్టోరీస్‌పై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారిస్తున్నారు.
జాగ్రత్తలపై ఆడ్మిన్‌లకు సూచనలు
పొలిటికల్ స్ర్కోలింగ్స్ వైరల్‌పై కేసులు
జిల్లాలో చర్చనీయాంశమైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అగ్రనేతల వ్యవహారం
నిర్మల్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి) : జిల్లా వ్యాప్తంగా సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న పొలిటికల్ బ్రేకింగ్ స్టోరీస్‌పై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా అధికార బీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా గాని ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలకు ఇబ్బందులకు కలిగే విధంగా సోషల్‌మీడియాలో ఎవరైనా పోస్టులు పెడితే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపే ప్రయత్నాలు మొదలుపెట్టారంటున్నారు. జిల్లాలోని ప్రభుత్వ వైఫల్యాలపై గాని అధికార బీఆర్‌ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలపై గాని ఎలాంటి వ్యతిరేక కథనాలను గాని సోషల్‌మీడియాలో వైరల్ చేసే వారిని, పోస్టింగులను సృష్టించే వారిని పోలీసులు టార్గెట్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. గత కొద్దిరోజుల క్రితం నిర్మల్ నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన అగ్రనేతలపై కొంతమంది యువకులు వ్యంగ్యంగానూ, విమర్శనాత్మక సోషల్‌మీడియాలో పెట్టిన పోస్టింగులపై సీరియస్ చర్యలు తీసుకుంటున్నారంటున్నారు. పలువురిపై అప్పట్లో కేసులు కూడా నమోదయ్యాయి. అయితే మళ్లీ నిర్మల్ నియోజకవర్గంలోనే సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న పలు పోస్టింగులను పోలీసులు మళ్లీ స్ర్కీనింగ్ చేస్తున్నారు. గత పదిరోజుల నుంచి నిర్మల్ నియోజకవర్గంలో వైరల్ అయిన ఓ పోస్టింగ్ రాజకీయంగా దుమారం రేపింది. అధికార బీఆర్‌ఎస్ పార్టీ అగ్రనేతకు ఇబ్బందులు కలిగించే విధంగా వైరల్ అయిన ఈ పోస్టింగ్‌లపై పోలీసులు కొరఢా ఝులిపించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత బీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నారని, ఆయనకే నిర్మల్ నియోజకవర్గ సీటును బీఆర్‌ఎస్ పార్టీ అధిష్టానం ఖరారు చేయనుందని సోషల్‌మీడియాలో ఓ పోస్టు వైరల్ చేశారు. అలాగే ప్రస్తుతం ప్రాతినిధ్యం వహించే బీఆర్‌ఎస్ అగ్రనేతకు ఢిల్లీలో కీలకపదవిని ఆ పార్టీ ఇవ్వబోతోందని ఆ పోస్టు లో పేర్కొన్నారు. ఇటు కాంగ్రెస్ అగ్రనేత అటు బీఆర్‌ఎస్ పార్టీ అగ్రనేత ఫోటోలతో కలిపి ఈ కథనాన్ని పోస్టు చేశారు. ఈ పోస్టును వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్‌లలో వైరల్ చేశారు. ఈ సోషల్ మీడియా కథనం జిల్లావ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. ముఖ్యంగా అధికార బీఆర్‌ఎస్ పార్టీలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. దీంతో బీఆర్‌ఎస్ అగ్రనేతతో పాటు సీనియర్‌నేతలు సోషల్‌మీడియా కథనంపై సీరియస్‌గా స్పందించారు. బీఆర్‌ఎస్ సోషల్‌మీడియా జిల్లా అఽధ్యక్షులు ఈ కథనం తప్పు అంటూ కొంతమంది బీఆర్‌ఎస్ పార్టీలో గందరగోళం సృష్టించేందుకే పోస్టుపెట్టారని తప్పుడు పోస్టు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ నిర్మల్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆగమేఘాల మీద తప్పుడు పోస్టింగులపై కేసులు నమోదు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా పోలీసులు క్రైమ్‌నంబర్ 61/2023 యు/ఎస్ 153, 153(ఎ), 505(2), 504 ఐపీసీ కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా సోషల్‌మీడియాలో అసత్య ప్రచారాలను పోస్టు చేసిన గాని ఫార్వర్డ్ చేసిన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తుండడం నెటిజన్‌లను, సోషల్ మీడియా వీక్షకులను ఆందోళనకు గురి చేస్తోంది.
దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు
కాగా నిర్మల్ బీఆర్‌ఎస్ పార్టీ టికెట్ కాంగ్రెస్ నేతకు ఇవ్వనున్నారని అలాగే ప్రస్తుత అధికారపార్టీ నేతకు టికెట్ ఇవ్వకుండా ఆయనకు ఢిల్లీలో కీలకపదవి ఇవ్వబోతున్నారనంటూ సోషల్‌మీడియాలో వైరల్ అయిన పోస్టింగ్‌పై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇప్పటికే పలు సెక్షన్‌లతో పాటు కేసునమోదు చేసిన పోలీసులు ఇక ఈ పోస్టును సృష్టించిన వారి కోసం గాలింపుచర్యలు మొదలుపెట్టారు. అలాగే ఈ పోస్టుతయారు చేసిన వారితో విస్తృతంగా రకరకాల గ్రూపులకు ఫార్వర్డ్ చేసిన వారిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ పోస్టు కుట్రపూరితంగా జరిగిందంటూ బీఆర్‌ఎస్ నేతలు చేసిన ఫిర్యాదుపై పోలీసులు సీరియస్‌గా విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే కొంతమంది నెటిజన్లను గుర్తించినట్లు సమాచారం. ఇందులో కాంగ్రెస్ నేత అభిమానులు కొంతమంది అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారని చెబుతున్నారు. అలాగే బీజేపీకి చెందిన కొంతమంది యువకులు కూడా ఈ పోస్టును వైరల్ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇదే కోణంతో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ కార్యకర్తలపై పోలీసులు నజర్ పెట్టారు.
దర్యాప్తు జరుపుతున్నాం
ఇటీవల సోషల్ మీడియాలో రెండు పార్టీల మధ్య వైరుధ్యాలు సృష్టించేందుకు పెట్టిన పోస్టుకు సంబందించి చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే వివిధ సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశాం. అలాగే పోస్టు చేసిన వారు, ఫార్వర్డ్ చేసిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు మొదలుపెట్టాం. ఇక ముందు ఎవరు కూడా రెండు రాజకీయ పార్టీలు, వర్గాల మధ్య విభేధాలు సృష్టించేందుకు వారిని గందరగోళ పరిచేందుకు అసత్య ప్రచార పోస్టింగులు పెట్టవద్దు. ఇలా పెడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
- మల్లేష్, సీఐ, నిర్మల్
Updated Date - 2023-02-21T02:08:19+05:30 IST