‘గుర్తింపు’ ఎన్నికలకు మార్గం సుగమం
ABN, First Publish Date - 2023-03-02T23:14:54+05:30
ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు దాదాపుగా మార్గం సుగమం అయింది. ఓ వైపు హైకోర్టు ఉత్తర్వులు, మరోవైపు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ చేపట్టిన ధర్నా కారణంగా ఎట్టకేలకు లేబర్ కమిషనరేట్ అధికారులు దిగి వచ్చారు.
మంచిర్యాల, మార్చి 2(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు దాదాపుగా మార్గం సుగమం అయింది. ఓ వైపు హైకోర్టు ఉత్తర్వులు, మరోవైపు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ చేపట్టిన ధర్నా కారణంగా ఎట్టకేలకు లేబర్ కమిషనరేట్ అధికారులు దిగి వచ్చారు. ఈనెల 13న నిర్వహించే సమావే శానికి హాజరు కావాలంటూ డిప్యూటీ లేబర్ కమిషనర్ నుంచి కార్మిక సంఘాలకు పిలుపు వచ్చింది. ఇప్పటి వరకు గుర్తింపు సంఘంగా బాధ్య తలు నిర్వహించిన టీబీజీకేఎస్ కాల పరిమితి ముగిసి దాదాపు నాలుగు సంవత్సరాలు కావస్తుండటంతో ఎన్నికల నిర్వహణ అనివార్యమైంది. సింగరేణి సంస్థలో 1990 నుంచి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగా రెండు సంవత్సరాల కోసారి ఎన్నికల నిర్వహణ జరిగేది. 1998, 2000ల వరకు జరిగిన ఎన్నికలకు కూడా కాల పరిమితి రెండు సంవత్సరాలే ఉండేది. 2003లో గుర్తింపు సంఘం కాల పరిమితి నాలుగు సంవత్సరాలకు పెంచగా 2017 వరకు కూడా అదే పద్ధతిలో ఎన్నికల నిర్వహణ సాగింది. అయితే చివరి సారిగా 2017 అక్టోబర్ 5న జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాల పరిమితి తిరిగి రెండు సంవత్సరాలకు కుదించారు.
కాలపరిమితి ముగియడంతో
ప్రస్తుతం ఉన్న గుర్తింపు సంఘం నాలుగేళ్ళ క్రితమే కాలపరిమితి ముగియడంతో 7వ దఫా ఎన్నికల నిర్వహణకు కార్మిక సంఘాలు పట్టుబ డుతున్నాయి. అధికార పార్టీ బీఆర్‌ఎస్‌కు అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) 2017 అక్టోబర్ 5వ తేదీన జరిగిన ఎన్నికల్లో సింగరేణి గుర్తింపు సంఘంగా ఎన్నికైంది. రెండేళ్ల కాలపరిమి తితో బాధ్యతలు చేపట్టిన టీబీజీకేఎస్ కాలపరిమితి పూర్తయి మరో ఐదేళ్లు గడిచింది. దీంతో కోల్‌బెల్ట్ ప్రాంతంలోని మంచిర్యాల, కుమరంభీం ఆసి ఫాబాద్, పెద్దపెల్లి, ఖమ్మం, భూపాలపల్లి జిల్లాల్లో విస్తరించిన సింగరేణి వ్యాప్తంగా ఉన్న జాతీయ కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్‌టీ యూసీ, హెచ్‌ఎంఎస్, సీఐటీయూ, బీఎంఎస్‌లు ఎన్నికల కోసం పట్టు బడుతున్నాయి. అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం, గుర్తింపు సంఘం ఎన్నికలను ఇంతకాలం వాయిదా వేస్తూ వస్తున్నాయి.
ఏఐటీయూసీ కృషితో
యూనియన్ కాలపరిమితి ముగిసి నాలుగేళ్లు కావస్తున్నా ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం ఎన్నికల ఊసే ఎత్తకపోవడంతో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య ఆగస్టు 4న హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికలు జరపాలని అక్టోబర్ 28న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తీర్పు వెలువరించిన మూడు నెలల లోపు ఎన్నికలు నిర్వ హించాలని చీఫ్ రీజనల్ లేబర్ కమిషనర్‌తోపాటు సింగరేణి యాజ మాన్యానికి ఆదేశాలు జారీ అయ్యాయి. హైకోర్టు ఆదేశాలను కూడా పట్టిం చుకోకపోవడంతో ఫిబ్రవరి 6న సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకత్వంలో హైద్రాబాద్‌లోని రీజనల్ లేబర్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. దీంతో సెంట్రల్ లేబర్ కమిషనర్ డిప్యూటీ చీఫ్ రీజనల్ లేబర్ కమిషనర్ అయిన శ్రీనివాసరావును ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నియమించారు.
ఎన్నికలు నిర్వహించాలి
వాసిరెడ్డి సీతారామయ్య, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి
హైకోర్టు ఉత్తర్వులు, ధర్నాతో సింగరేణి యాజమాన్యం స్పందించక తప్పని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికలు జరుపకుండా యాజమాన్యం కుట్రలు చేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదు. ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసే సమావేశానికి ప్రభుత్వం నుంచి పిలుపు రావడం కార్మికుల విజయం.
Updated Date - 2023-03-02T23:14:54+05:30 IST