Kumaram Bheem Asifabad : ఆశాజనకంగా పత్తి
ABN, First Publish Date - 2023-09-21T22:31:05+05:30
చింతలమానేపల్లి, సెప్టెంబరు 21: పత్తి పంటలు సాగు చేసిన రైతాంగానికి గత రెండేళ్లు కలిసి రాలేదు. అధిక వర్షాలు, వాతావరణ పరిస్థితులు, అతివృష్టి, అనావృష్టి తదితర కారణాలతో ఆశించినస్థాయిలో దిగుబడి రాకపోగా తీవ్రంగా నష్టం చవిచూశారు. ఈ ఏడు పత్తి పంట ఆశాజనకంగా ఉండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
- పత్తి రైతుల్లో ఆనందం
- అనుకూలంగా వాతావరణం
- తప్పిన చీడ, పీడల బెడద
- ప్రస్తుతం పూత, కాత దశలో పంట
చింతలమానేపల్లి, సెప్టెంబరు 21: పత్తి పంటలు సాగు చేసిన రైతాంగానికి గత రెండేళ్లు కలిసి రాలేదు. అధిక వర్షాలు, వాతావరణ పరిస్థితులు, అతివృష్టి, అనావృష్టి తదితర కారణాలతో ఆశించినస్థాయిలో దిగుబడి రాకపోగా తీవ్రంగా నష్టం చవిచూశారు. ఈ ఏడు పత్తి పంట ఆశాజనకంగా ఉండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడం పత్తి పంటకు మేలు చేస్తుండడంతో జిల్లాలో పత్తి పంట ఆశాజనకంగా ఉంది. ఈ ఖరీఫ్ సీజన్ కలిసి వస్తుందని రైతలు కోటి ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం పత్తిపంట పూత, కాత దశలో ఉండడంతో చీడ, పీడల నుంచి కాపాడడం కోసం అవసరమైన మందులు స్ర్పే చేయడం, ఎరువులు వేయడం వంటి పనుల్లో రైతులు బిజీగా ఉన్నారు. పత్తి పంట సైతం మంచి పెరుగుదల ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 3,35,188 ఎకరాల్లో సాగు..
జిల్లాలోని 15మండలాల పరిధిలో 1.20లక్షల మందికి పైగా రైతులు ఈ వానాకాలంలో మొత్తం 4.51లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయగా ఇందులో అత్యధికంగా పత్తిపంట 3,35,188ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ప్రధానపంటగా పత్తి, తర్వాతస్థానంలో వరిపంట 54,611 ఎకరాల్లో సాగైంది. ప్రస్తుతం పంటలు కాత, పూత దశలోఉన్నాయి. తొలుత వర్షాకాలం ఆరంభంలో వర్షాలు సరైన సమయంలో కురవక కొంత ఆందోళన చెందారు. అనంతరం జూలై, ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో తెగుళ్ల బెడద లేకపోగా పత్తి పంటలో గడ్డి నివారింంచేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. అయితే ఏడాది క్రితం గులాబి రంగు పురుగు పత్తి పంటను నాశనం చేసి దిగుబడిపై తీవ్రప్రభావం చూపెట్టింది. ఈ ఏడాది సైతం గులాబి రంగు పురుగు సోకే ప్రమాదం ఉంటుందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకు తగ్గ జాగ్రత్తలు చేపడుతూ పంటలను కాపాడు కోవాలంటున్నారు. గతేడాది పత్తి పంటకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు మించి మొదట్లో రూ.8వేల నుంచి 9వేల వరకు పలికింది. దీంతో మరింత ధర పెరుగుతుందన్న ఆశతో రైతులు ఇళ్లల్లోనే పత్తిని నిల్వ చేసుకున్నారు. కానీ ధరలు పెరగకపోగా క్వింటాల్ పత్తి ధర రూ.7000- 8000 వరకే విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గిట్టుబాటు ధర కల్పించి రైతులకు న్యాయం చేకూరేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని పత్తిరైతులు పేర్కొంటున్నారు.
అధిక వర్షాలు లేకుంటే పత్తి పంటకు మేలు..
- నారాయణ, రైతు
ఈ ఏడు పత్తి పంట ఆశాజనకంగానే ఉంది. ప్రస్తుతం పత్తి పంట పూత, కాత దశలో ఉంది. దానికి అవసరమైన ఎరువులు, మందులు వేస్తున్నాం. అధిక వర్షాలు లేకుంటే ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. అయితే పంటకు గిట్టుబాటు ధర ఉండేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి.
Updated Date - 2023-09-21T22:31:05+05:30 IST