నువ్వుంటే నా జతగా..
ABN, First Publish Date - 2023-02-14T01:16:33+05:30
నువ్వుంటే నా జతగా.. నేనుంటా నీ ఊపిరిగా.. అంటూ ప్రేమ కోసం పరితపించే రెండు మనసులను కలిపేదే రెండక్షరాల ప్రేమ.
కాలానికి అనుగుణంగా మారిపోతున్న ప్రేమ సందేశాలు
ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే ప్రేమ విజయం
నేడు ప్రపంచ ప్రేమికుల దినోత్సవం (వాలెంటైన్స్ డే)
ఆదిలాబాద్, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): నువ్వుంటే నా జతగా.. నేనుంటా నీ ఊపిరిగా.. అంటూ ప్రేమ కోసం పరితపించే రెండు మనసులను కలిపేదే రెండక్షరాల ప్రేమ. పలకడానికి రెండక్షరాల ప్రేమ మాత్రమే అయినా.. ఆ పదాలు రెండు మనసులు, రెండు జీవితాలను నిండునూరేళ్లు ఏకం చేస్తున్నాయి. ప్రేమ ఉంటే చాలు ఈ జగత్తులో తమకేమీ వద్దంటూ ప్రేమ కోసం ఎంతటికైనా త్యాగం చేస్తున్నారు. ప్రేమంటే ఆకర్షణ కాదని నిరూపిస్తున్నారు. నిజమైన ప్రేమకు ఏది అడ్డుకాదని, నమ్మకం లేనిచోట ప్రేమకు అసలు చోటు లేదని చెబుతున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటే మనస్పర్థలకు చోటు లేకుడా ప్రేమ విజయం సాధిస్తుందని ప్రేమికులు పేర్కొంటున్నారు. నాటి నుంచి నేటి వరకు ఎంతో మంది ప్రేమికులు ప్రేమతో అన్యోన్యంగా జీవిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మనసులు కలిసినా.. స్థిరపడ్డాకే ప్రేమ పెళ్లి చేసుకుంటే ఎలాంటి ఒడిదుడుకులకు అవకాశం ఉండదంటూ పేర్కొంటున్నారు. జిల్లాలో ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న పలు జంటలు ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నాయి. నేటి తరంలో ప్రేమపెళ్లిలు ఎక్కువగానే జరుగుతున్నాయి. కొందరి ప్రేమ ప్రయాణంలో ముళ్లబాటలు ఎదురవుతున్నా.. మరికొందరి ప్రేమలు పూలబాటలుగా మారుతున్నాయి. ఈ ప్రయాణంలో కొంతమంది ఊపిరి తీసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. చదువుకునే చోట, ఉద్యోగ నేపథ్యంలో ఏర్పడిన పరిచయాలు ఇష్టంగా మారి ప్రేమ పెళ్లిల్లు జరిగిపోవడం సర్వసాధారణంగానే కనిపిస్తుంది. కొందరు పెద్దలు ప్రేమ పెళ్లిలకు అంగీకరించక పోవడంతో తల్లిదండ్రులను సైతం వదిలేసి సుదూర ప్రాంతాలకు వెళ్లిపోయి జీవనం సాగిస్తున్నారు. మరికొందరు ప్రేమ కోసం తల్లిదండ్రులు, పెద్దలను ఎదురించి, ఒప్పించి మరీ ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. అయితే కొన్ని పెళ్లిల్లు రిజిస్ర్టేషన్ కార్యాలయాల్లో జరుగుతుండగా.. మరికొందరు స్నేహితుల సహకారంతో దేవాలయాలు, గుడిల్లో జరుపుకుంటున్నారుప్రపతియేడూ ఫిబ్రవరి 14న ప్రపంచ ప్రేమికుల దినోత్సవం (వాలెంటైన్స్ డే) సందర్భంగా జిల్లాలోని పలువురు ప్రేమ జంటలను ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేకంగా పలుకరించింది.
ఇది నేపథ్యం..
క్రీ.శ.270 రోమ్ రాజ్యంలో చక్రవర్తి రెండో గ్లాడియర్ అనే రాజు తన దేశంలో సైనికులు పెళ్లి చేసుకుంటే ఏకాగ్రతతో యుద్ధం చేయలేరని భావించి ప్రేమ పెళ్లిల్లను నిషేధించాడు. అయినా వాలెంటైన్ అనే యువ సైనికుడు ఎంతో మంది ప్రేమికులను ప్రోత్సహిస్తూ పెళ్లిల్లు జరిపించాడు. దాన్ని సహించని రాజు వాలెంటైన్ అనే సైనికున్ని ఫిబ్రవరి 14న ఉరి తీశాడు. దీంతో అప్పటి నుంచి ఫిబ్రవరి 14ను ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
ఎల్లలు దాటిన ప్రేమ
గుడిహత్నూర్ మండలానికి చెందిన గొల్లపల్లి రవికుమార్, మయన్మార్ దేశానికి చెందిన జిన్‌న్వేథెన్ ప్రేమ జంట . వీరిద్దరు గత కొంత కాలం క్రితం ప్రేమలో పడ్డారు. ఇటీవల తన సొంత గ్రామమైన చింతగూడకు చేరుకుని పెద్దల అంగీకారంతో ఒకటయ్యారు. గత ఆరు సంవత్సరాల క్రితం ఖాతర్ దేశానికి ఉద్యోగరీత్యా వెళ్లిన రవికుమార్ అక్కడ మయన్మార్‌కు చెందిన జిన్‌న్వేథెన్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. దీనికి పెద్దలు కూడా ఒప్పుకోవడంతో మూడు ముళ్లతో ఏకమయ్యారు. ప్రేమకు హద్దులు లేవని, అలాగే కులమత బేధాలు అడ్డుకాదంటూ నిరూపించారు ఈ ప్రేమజంట.
మారిపోతున్న ప్రేమ సందేశాలు
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రేమ సందేశాల్లో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నాటి కాలంలో ప్రేమికులు తమ ప్రేమ సందేశాలను చేరవేసేందుకు వారి స్థోమతను బట్టి వివిధ రకాల పద్ధతుల ద్వారా చేరవేసే వారు. పావురాలు, చిలుకలను రాయబారులుగా ఉపయోగించుకునే వారు. కాలక్రమంగా ప్రేమ లేఖలతో తమ ప్రేమ సందేశాన్ని చేరవేసుకున్నారు. ఆధునిక యుగంలో ప్రస్తుతం ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, మెసింజర్, మేసేజ్‌ల ద్వారా ఒకరికొక్కరు తమ ప్రేమను తెలుపుకుంటున్నారు. ప్రపంచంలోని నలుమూలల నుంచి వీడియో కాలింగ్‌తో నేరుగా ప్రేమానురాగాలను పంచుకుంటున్నారు. భౌగోళిక దూరం ఎంతైనా ప్రేమకు హద్దులు లేవంటున్నారు.
పదో తరగతిలోనే పరిచయం ఏర్పడింది
: అమూల్య-మల్లికార్జున్, ప్రేమజంట, బోథ్
పదో తరగతి చదువుకునే రోజుల్లో మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో ఒకరినొకరిని ఇష్టపడ్డాం. మా పెళ్లికి ఇరువురి కుటుంబ పెద్దలు ఒప్పుకోవడంతో హైదరాబాద్ వెళ్లి ఆర్య సమాజంలో మా స్నేహితుల సహకారంతో గత రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాం. ప్రస్తుతం మా ఇద్దరికి ఒక బాబు. మా తల్లిదండ్రులతోనే కలిసి ఉంటున్నాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎంతో ప్రేమగా కలిసి మెలిసి ఉంటున్నాం.
ఒకరినొకరు అర్థం చేసుకున్నాం..
: పెట్ల భరత్-దివ్య, ప్రేమజంట, తలమడుగు మండలం
గత కొంత కాలం కిందట మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. దీంతో నాలుగేళ్ల క్రితం ప్రేమపెళ్లి చేసుకున్నాం. ప్రస్తుతం ఒకరినొకరు అర్థం చేసుకుని జీవనం సాగిస్తున్నాం. ప్రేమపెళ్లిపై కొందరు ఎన్నో రకాలుగా అనుకున్నా.. మా జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేవు. సొంతంగా వ్యవసాయం, వ్యాపారం చేసుకుంటున్నా. ప్రేమ వివాహాలతో వరకట్నపు మహమ్మారిని అరికట్టే అవకాశం ఉంది. ప్రేమ పెళ్లి చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం.
Updated Date - 2023-02-14T01:16:35+05:30 IST