సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తున్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం
ABN, First Publish Date - 2023-04-03T22:52:42+05:30
ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిని రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా చేపట్టిన పాదయాత్ర సోమవారం జైపూర్ మండలానికి చేరుకుంది. జైపూర్ కార్నర్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
జైపూర్, ఏప్రిల్ 3: ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిని రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా చేపట్టిన పాదయాత్ర సోమవారం జైపూర్ మండలానికి చేరుకుంది. జైపూర్ కార్నర్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్షకు పైగా ఉన్న సింగరేణి ఉద్యోగులను ఇప్పుడు 42 వేలకు తగ్గించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఉపరితల, భూగర్భ గనులను ప్రైవేటుకు అప్పగించడంతో ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయన్నారు. కాంగ్రెస్ హయాంలో మంజూరైన జైపూర్ పవర్ ప్లాంట్‌లో స్థానికులకు ఉద్యో గాలు కల్పించడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. 24 గంటల ఉచిత కరెంటు మా ప్రభుత్వం వల్లనేనని గొప్పలు చెబుతున్న సీఎం కేసీఆర్ 9 ఏండ్లలో ఒక్క పవర్ ప్రాజెక్టు ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలోనే కొత్తగూడెం ఫేజ్ 1 నుంచి ఫేజ్ 5 వరకు, భూపాలపల్లి, ఎన్టీపీసీ ప్రాజెక్టులు పూర్తయ్యాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జైపూర్ పవర్ ప్లాంటు ఏర్పాటు చేశామని ఆయన గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవర్ ప్లాంట్‌లో స్ధానికులకు అన్యాయం జరుగు తుందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇసుక మాఫియాను పోషిస్తుందని విమర్శించారు. ప్రజాస్వామ్యం కావాలని పోరాడుతున్న రాహుల్ గాంధీపై అక్రమ కేసులు పెట్టి జైలు శిక్ష పడేలా చేసి పార్లమెంట్‌లో అనర్హత వేటు వేసిన బీజేపీ కుట్రలను నిరసిస్తూ ఈ నెల 8న సత్యగ్రహ దీక్ష పేరిట బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, సభకు ప్రజలు తరలి రావాలని కోరారు. జైపూర్‌లో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మాజీఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణరావు, నాయ కులు నూకల రమేష్, జైపూర్ పార్టీ అధ్యక్షుడు ఫయాజ్, రిక్కుల శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలి
భీమారం: పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని దశాబ్దాల తరబడి ఈ ప్రాంత దళిత గిరిజనులు ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడం లేదని, అభివృద్ధి పేరిట మొక్కలు నాటే కార్యక్రమాలతో పోడు భూములను లాక్కుంటూ రైతులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం రోడ్డు పాలు చేస్తుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలో పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, తదితర డిమాండ్లతో కూడిన బహిరంగ లేఖను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ఆదివారం జోడో యాత్రలో భాగంగా పోతనపల్లిలో పర్యటించగా గిరిజన మహిళ తన భూమిని అటవీ అధికారులు లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేయడంతో సీఎం కేసీఆర్‌కు లేఖను విడుదల చేసినట్లు తెలిపారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే పాదయాత్ర చేపట్టాన న్నారు. పోడు భూముల విషయాన్ని ఎన్నికల్లో ప్రచారంగా వాడుకున్న కేసీఆర్ సమస్యను పరిష్కరించకుండా విస్మరించారన్నారు. 2019లో గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాధోడ్ అటవీ, రెవెన్యూ శాఖ మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి చేతులు దులుపుకుందే తప్ప పోడు రైతుల సమస్యలను పరిష్కరించలేదన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగౌడ్, వెంకటేశ్వర్లు, నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2023-04-03T22:52:42+05:30 IST