గంగాపూర్‌లో ప్రారంభమైన బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతర
ABN, First Publish Date - 2023-02-03T23:22:18+05:30
రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామశివారులోని గుట్టపై ప్రకృతి ఒడిలో వెలసిన బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులకు కొంగుబంగారంగా మారింది. ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ పౌర్ణమి నాడు తిరుమల తిరుపతిలోని వెంకటేశ్వరస్వామి మూడు గడియల పాటు గంగాపూర్ ఆలయంలో కొలువుదీరి భక్తుల కోరికలు తీరుస్తాడని ప్రగాఢ విశ్వాసం. దీంతో మాఘశుద్ధ పౌర్ణమి నాడు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి స్వామి వారికి మొక్కులు సమర్పించుకుంటారు. ఇందుకోసం ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లను చేశారు.
- నేటి నుంచి కొనసాగనున్న జాతర
- భారీగా తరలిన రానున్న భక్తులు
- ఏర్పాట్లు పూర్తిచేసిన ఆలయ నిర్వాహకులు
రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామశివారులోని గుట్టపై ప్రకృతి ఒడిలో వెలసిన బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులకు కొంగుబంగారంగా మారింది. ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ పౌర్ణమి నాడు తిరుమల తిరుపతిలోని వెంకటేశ్వరస్వామి మూడు గడియల పాటు గంగాపూర్ ఆలయంలో కొలువుదీరి భక్తుల కోరికలు తీరుస్తాడని ప్రగాఢ విశ్వాసం. దీంతో మాఘశుద్ధ పౌర్ణమి నాడు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి స్వామి వారికి మొక్కులు సమర్పించుకుంటారు. ఇందుకోసం ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లను చేశారు. -రెబ్బెన
రెబ్బెన మండలంలోని గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వరస్వామికి ఈ సంవత్సరం జాతర ఈనెల 4,5,6 తేదీల్లో నిర్వహించడానికి ఆలయకమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం ఐదు గంటలకే స్వామి వారి దర్శనం ప్రారంభమవుతుంది. సాయంత్రం వరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు తీర్చుకోవటంతో పాటు రథోత్సవంలో పాల్గొని భక్తిని చాటుకుంటారు. జాతర ప్రారంభాన్ని పురస్కరించుకొని స్వామి వారి కల్యాణాన్ని భక్తజన సందోహం మధ్య వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకోనున్నారు. సోమవారంతో జాతర ముగియనుంది. ఈ జాతరకు చుట్టు పక్కల జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తారు. భక్తుల సౌకర్యార్థం విద్యుద్ దీపాలు, మూత్రశాలల ఏర్పాట్లు చేశారు. అలాగే మండల కేంద్రం నుంచి ఆలయం వరకు రోడ్డుకు ఇరువైపులా శుభ్రం చేయించి రాకపోకలకు సులువుగా సాగేలా చర్యలు తీసుకున్నారు. భక్తులకు రాకపోకలకు సులువుగా ఉండేందుకు మండల కేంద్రం నుంచి ఆలయం వరకు రోడ్డుకిరువైపులా పెరిగిన ముళ్లకంచెలు, చెట్లను తొలగించి వెడల్పు చేశారు. శుక్రవారం జాతర ఏర్పాట్లను అదనపు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, ఏఎస్పీ అశ్చేశ్వర్ రావు దగ్గరుండి పరిశీలించారు.
ఆసక్తికరం ఆలయం నిర్మాణం..
గంగాపూర్‌లోని బాలాజీ వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం ఎంతో ఆసక్తికరంగా జరిగింది. చారిత్మక ఆధా రాలను పరిశీలిస్తే 13వ శతాబ్ధంలో ఈ ఆలయాన్ని గంగాపూర్‌కు చెందిన విశ్వబ్రాహ్మణుడు ముమ్మడి పోతాజీ నిర్మించినట్టు తెలుస్తోంది. పోతాజీ తన చిన్నతనం నుంచే ప్రతి సంవత్సరం మాఘ శుద్దపౌర్ణమి నాడు తిరుమల తిరుపతిలోని వెంకటేశ్వరస్వామిని దర్శించుకొని మొక్కులు సమర్పించుకునేవారు. ప్రతి సంవత్సరం తిరుపతికి కాలినడకన వెళ్లి వస్తుండే వారని ఆయన వంశస్థులు తెలుపుతున్నారు. ఇదే క్రమంలో వయస్సు మీదపడిన పోతాజీ ఒకసారి స్వామివారి దర్శనానికి వెళ్లలేక అనారోగ్యంతో బాధపడతుండగా, స్వామి వారు ఆయన కలలోకి వచ్చి గంగాపూర్ శివారులోని గుట్టపై తొలవమని, అక్కడ నీకు, నీలాంటి భక్తులకు దర్శనమిస్తానని చెప్పినట్టు ప్రచారంలో ఉంది. దీంతో పోతాజీ గుట్టకు ముందువైపు ఒక గుహను తొలిచారు. ఇందులో మూడు నామాలు దర్శనమివ్వటంతో ఆయన ఎంతో సంతోషంగా స్వామివారికి అక్కడే పూజలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆలయానికి ప్రతి సంవత్సరం మాఘశుద్ద పౌర్ణమి నాడు భక్తుల రాక మొదలైంది. కాలక్రమంలో కాకతీయ రాజులు సైతం ఈ ఆలయాన్ని సందర్శించి ఇక్కడ బాలాజీ వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగ, పద్మావతి పంచలోహ విగ్రహాలు ప్రతిష్ఠించారు. దీంతో ఆలయానికి మరింత కల వచ్చింది. ఏటేటా భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
గంగాపూర్ జాతరకు ప్రత్యేక బస్సులు
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 3: గంగాపూర్ జాతరకు ఆసిఫాబాద్ డిపో నుంచి పది బస్సులు, కాగజ్‌నగర్ నుంచి 8బస్సులు, బెల్లంపల్లి బజార్ నుంచి 8బస్సులు నడుపుతున్నట్లు డీఎం శ్రీధర్ ఒక ప్రకటనలో తెలి పారు. ఆసిఫాబాద్ నుంచి పెద్దలకు రూ.60, పిల్లలకు రూ.30, కాగజ్‌నగర్ నుంచి పెద్దలకు రూ.60,పిల్లలకు రూ.30, బెల్లంపల్లి నుంచి పెద్దలకు రూ.70, పిల్లలకు రూ.40 నిర్ణయించినట్లు తెలిపారు.
జాతరకు ఏర్పాట్లు పూర్తి చేశాం..
-వెంకటేష్, ఆలయ కమిటీ చైర్మన్
శనివారం నుంచి సోమవారం వరకు జరుగనున్న జాతరకు అన్ని ఏర్పాట్లు చేశాం. బ్యారికేడ్లు, సులభ దర్శనం, ఇతర వసతులు కల్పించాం. ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకోనున్నారు.
Updated Date - 2023-02-03T23:22:19+05:30 IST