KTR : 6 గ్యారెంటీలకు గ్యారెంటీ ఏంటి?
ABN, First Publish Date - 2023-10-22T01:50:29+05:30
‘ఆరు గ్యారెంటీలకు నాదీ గ్యారెంటీ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పదే పదే అంటున్నారు. ఆయనేమైనా కాంగ్రెస్ అధ్యక్షుడా? లేదా
కాంగ్రెస్ నేత రాహుల్ ఏ అర్హతతో మాట్లాడుతున్నారు
’మైనంపల్లి, ఉత్తమ్ కుటుంబాలకు రెండేసి సీట్లా?
ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను వాళ్లే తుంగలో తొక్కారు
కేసీఆర్ రాష్ట్ర ప్రాపర్టీ.. ఎన్ని చోట్లైనా పోటీ చేస్తారు
శివ సేన మాదిరిగా మజ్లిస్ మతతత్వ పార్టీ కాదు
బీజేపీ చేతులెత్తేసింది.. ఈ సారి ఒక్క సీటూ కష్టమే
వచ్చే సారి కేంద్రంలో రానున్నది సంకీర్ణ ప్రభుత్వమే
వామపక్షాలతో చర్చించాం.. కానీ లెక్క కుదరలేదు
ప్రవళిక తమ్ముడికి ఉద్యోగం ఇస్తామని చెప్పలేదు
ప్రగతి భవన్‌లో మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్..
రెండ్రోజుల్లో ఆసక్తికర వార్త వింటారని వ్యాఖ్య
హైదరాబాద్, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ‘‘ఆరు గ్యారెంటీలకు నాదీ గ్యారెంటీ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పదే పదే అంటున్నారు. ఆయనేమైనా కాంగ్రెస్ అధ్యక్షుడా? లేదా మరేదైనా పదవిలో ఉన్నారా? ఏ అర్హతతో ఆయన రాష్ట్రంలో మాట్లాడుతున్నాడు’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఒకే కుటుంబానికి రెండు సీట్లు ఇవ్వబోమంటూ ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌లో పేర్కొన్నారు కదా.. ఇప్పుడు మైనంపల్లి హన్మంతరావుతోపాటు ఆయన కుమారుడికి, ఉత్తమ్‌తోపాటు ఆయన భార్యకు సీట్లు ఎలా కేటాయించారు? అని నిలదీశారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ మాదిరిగానే.. ఇప్పుడు చెబుతున్న ఆరు గ్యారంటీలను తుంగలో తొక్కరన్న గ్యారంటీ ఉందా? ఆరు గ్యారంటీలకు గ్యారంటీ ఏంటి..? అని ప్రశ్నించారు. ప్రగతి భవన్‌లో శనివారం మీడియా ప్రతినిధులతో కేటీఆర్ చిట్‌చాట్‌గా మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్, మజ్లిస్ కలిసి పోటీ చేస్తున్నాయన్న రాహుల్ విమర్శలపై ఆయన స్పందిస్తూ.. అందుకు తగ్గ ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు. బీజేపీతో కలిసి ఉంటే రాష్ట్రంలో ముస్లింలకు ఇన్ని సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేస్తామని ప్రశ్నించారు. ముస్లింలకు దేశంలోనే ఎక్కువ బడ్జెట్ కేటాయించిన రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. ‘‘మహారాష్ట్రలో మతతత్వ పార్టీ అయిన శివసేనతో కలిసి అధికారం పంచుకున్న చరి త్ర కాంగ్రె్‌సది. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తుంది. మాది హిందుత్వ పార్టీ అని అనేకసార్లు శివసేనే బాహాటంగా ప్రకటించింది. ఇక్కడ మాకు ఫ్రెండ్లీగా ఉన్న ఎంఐఎం ఎప్పుడైనా ముస్లింల పార్టీ అని ప్రకటించిందా..?’’ అని ప్రశ్నించారు. బీజేపీని బూచీగా చూపించి ముస్లింల ఓట్లను దక్కించుకునేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని విమర్శించారు. బీఆర్‌ఎస్ ఎవరికీ బీ టీమ్ కాదని స్పష్టం చేసిన కేటీఆర్.. ఏ టు జెడ్ కరప్షన్ పార్టీ కాంగ్రెస్సేనని, ఓ లుచ్చా టీమ్ అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా ఉంద న్న రాహుల్ వ్యాఖ్యలపైనా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ ఒక అజ్ఞాని అని, రాసిచ్చిన ప్రసంగాలను చదివే రీడరే తప్ప లీడర్ కాదని ఎద్దేవా చేశారు. గజ్వేల్‌లో ఓటమి భయంతోనే కేసీఆర్ రెండుచోట్ల పోటీ చేస్తున్నారా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. కేసీఆర్ రాష్ట్ర ప్రాపర్టీ అని, ఆయన ఎన్ని చోట్లైనా పోటీ చేస్తారని స్పష్టం చేశారు.
ఈటల 119 చోట్ల పోటీ చేస్తారేమో..
ఈ సారి ఎన్నికల్లో బీజేపీ కనీసం పోటీలో కూడా లేదని, ఎన్నికలకు ముందే చేతులెత్తేసిందని కేటీఆర్ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో 105 స్థానాల్లో డిపాజిట్ కోల్పోతే ఈసారి 110 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయే పరిస్థితి ఉందన్నారు. కనీసం పోటీ చేసేందుకూ వారి కి అభ్యర్థులు లేరని ఎద్దేవా చేశారు. ఈటల రాజేందర్ 119 స్థానాల్లో పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తుందేమోనని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గజ్వేల్‌తోపాటు హుజూరాబాద్‌లోనూ ఈటల ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. రానున్న సాధారణ ఎన్నికల్లో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని, ప్రాంతీయ పార్టీలే కీలకపాత్ర పోషించే అవకాశాలున్నాయని చెప్పారు. జానారెడ్డి కూడా బీఆర్‌ఎ్‌సలో చేరుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి కదా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. అలాంటిదేమీ లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. కానీ, త్వరలోనే ఐదుగురు ముఖ్య నేతలు పార్టీలో చేరుతారని చెప్పారు. రెండు రోజుల్లో ఇంట్రెస్టింగ్ న్యూస్ వింటారని పేర్కొన్నారు.
ఇంటింటికీ మేనిఫెస్టో..
బీఆర్‌ఎస్ మేనిఫెస్టో గురించి పెద్దగా ప్రచారం జరగడం లేదని గుర్తించామని, ఇకనుంచి ప్రతీ ఇంటింటికీ మేనిఫెస్టోను తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. పలువురు ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి ఉన్నా సీట్లు ఎలా ఇచ్చారు? అన్న ప్రశ్నకు కేటీఆర్ బదులిచ్చారు. సహజంగానే కాస్త అసంతృప్తి ఉంటుందని, అంతమాత్రాన ఎమ్మె ల్యే ఓడిపోతాడని కాదని, చిన్నచిన్న సమస్యలను అధిగమిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం ఎవరూ లేరని, గతంతో పోలిస్తే ఒకటి రెండు సీట్లు ఎక్కువే గెలుస్తామన్నారు. మునుగోడు ఉప ఎన్నిక వేళ వామపక్షాలను అక్కున చేర్చుకుని, ఆ తర్వాత పక్కన పెట్టారు కదా? అన్న విలేకరుల ప్రశ్నకు స్పందిస్తూ.. ముందుగానే వారితో ప్రాథమికంగా చర్చలు జరిపామని, కానీ లెక్క కుదరలేదని వెల్లడించారు. బీజేపీని నిలువరించాలని వామపక్షాలు కోరుకున్నట్టుగానే.. బీఆర్‌ఎస్ కూడా కోరుకుంటోందన్నారు. ఈ సారి తమ పార్టీకి 40 మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని, అందులో మంత్రి మల్లారెడ్డి కూడా ఉన్నారన్నారు.
సోషల్ మీడియాలో మల్లారెడ్డికి ఉన్న క్రేజ్.. పార్టీకి ఎంతో ఉపకరిస్తుందన్నారు. ఖమ్మంలో పార్టీ పరిస్థితిపై స్పందిస్తూ.. గతంలో అక్కడ తమ పార్టీకి నేతలు ఎక్కవగా ఉన్నా ఒక్క సీటే వచ్చిందని, ఇప్పుడు నేతలు తగ్గినందున కచ్చితంగా సీట్లు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. మంథని, రామగుండంలో పోటాపోటీ ఉందని, అక్కడ తమ అభ్యర్థులు కాస్త వెనుకంజలో ఉన్నా.. పుంజుకుంటారన్నారు. ప్రవళిక మరణాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తే.. తాము మానవీయ కోణంలో ఆదుకున్నామని చెప్పారు. ప్రవళిక తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తాను అనలేదని, కుటుంబాన్ని ఆదుకుంటామని అన్నానని తెలిపారు.
నల్లగొండలో 12 స్థానాలు గెలుస్తాం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12స్థానాల్లోనూ మంచి మెజారిటీతో గెలుస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ సహా పలువురు నాయకులు శనివారం బీఆర్‌ఎ్‌సలో చేరా రు. కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో చెరుకు సుధాకర్ 46 రోజులు జైలు జీవితం గడిపారని గుర్తు చేశారు. జిట్టా బాలకృష్ణారెడ్డి, ఏపూరి సోమన్న కూడా సొంతగూటికి వచ్చారని, ఇపుడు హరిదీ్‌పరెడ్డి కూడా పార్టీలో చేరారన్నారు. ఇంతమంది తోడైన తరువాత ఉమ్మడి నల్లగొండ జిల్లాను క్లీస్ స్వీప్ చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. అనంతరం ఎన్నికల పాటల సీడీని కేటీఆర్ ఆవిష్కరించారు.
Updated Date - 2023-10-22T01:50:34+05:30 IST