Teacher Posts : 23 వేల టీచర్ పోస్టులు ఖాళీ!
ABN, First Publish Date - 2023-01-17T01:11:21+05:30
రాష్ట్ర విద్యాశాఖలో ఎక్కడా లేని హడావుడి కనిపిస్తోంది. చాలాకాలం తర్వాత బదిలీలు, పదోన్నతుల అంశం తెరపైకి రావడంతో అధికారులు, ఉపాధ్యాయుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.
ప్రభుత్వం ప్రకటించిన ఖాళీలు 13 వేలు..
బదిలీలు, పదోన్నతులతో మరో 10 వేల ఖాళీలు..
డీఎస్సీల ద్వారా భర్తీ చేసే అవకాశాలు
హైదరాబాద్, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విద్యాశాఖలో ఎక్కడా లేని హడావుడి కనిపిస్తోంది. చాలాకాలం తర్వాత బదిలీలు, పదోన్నతుల అంశం తెరపైకి రావడంతో అధికారులు, ఉపాధ్యాయుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. అదే సందర్భంలో బీఈడీ, డీఈడీ పూర్తి చేసుకుని, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థుల్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి టీచర్ల రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ‘మెగా మేళా’ ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి ప్రభుత్వం బదిలీలు, పదోన్నతులు, హేతుబద్ధీకరణ ప్రక్రియలన్నింటినీ పూర్తి చేస్తే ఈసారి భారీ మొత్తంలో ఉపాధ్యాయ ఖాళీలు ఏర్పడతాయని భావిస్తున్నారు. అన్నీ కలిపి దాదాపు 23 వేల టీచర్ పోస్టులను భర్తీ చేసే అవకాశాలుంటాయని ఉపాధ్యాయ వర్గాలు వివరిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం వివిధ ఉద్యోగ పోస్టులతో పాటు టీచర్ పోస్టుల ఖాళీలను ప్రకటించింది. ఎస్‌జీటీలు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 13 వేల వరకు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది. మిగతా శాఖల్లోని ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. టీఎస్‌పీఎస్సీ, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ రికూ్ట్రట్‌మెంట్ బోర్డులు పోస్టులకు నోటిఫికేషన్లు కూడా జారీ చేశాయి. కానీ... టీచర్ పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాత ఎన్ని ఖాళీలు తేలుతాయో పరిశీలించి, రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ప్రారంభించాలన్న యోచనలో ఉంది.
ఇందులో భాగంగానే ఆదివారం రాష్ట్ర విద్యా మంత్రి సబిత, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాన్ని నిర్వహించారు. నాలుగు జేఏసీల నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై సుదీర్ఘంగా చర్చించారు. బదిలీలు చేపట్టాలని, పదోన్నతులు కల్పించాలని నిర్ణయించారు. సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ రెండు మూడు రోజుల్లో జీఓను జారీ చేస్తామని మంత్రులు వారికి హామీ ఇచ్చారు. అనంతరం విద్యా శాఖ సంచాలకుల కార్యాలయం బదిలీల షెడ్యూలును జారీ చేస్తుంది. బదిలీలు, పదోన్నతుల అనంతరం మరో 10 వేల ఖాళీలు ఏర్పడుతాయని విద్యా శాఖ అంచనా వేస్తోంది. ఇందులో 9000 వరకు సెకండరీ గ్రేడ్ టీచర్(ఎ్‌సజీటీ) పోస్టులు, మరో 1000 వరకు స్కూల్ అసిస్టెంట్(ఎ్‌సఏ) పోస్టులు ఉండవచ్చని తెలుస్తోంది. ఇదివరకే ప్రకటించిన 13 వేల ఖాళీ పోస్టులతో కలిపి రాష్ట్రంలో మొత్తం 23 వేల ఖాళీలు ఏర్పడనున్నాయి. వీటిని డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత డీఎస్సీలు నోటిఫికేషన్లు జారీచేసే అవకాశాలు ఉంటాయి. 475 ఎంఈఓల ఖాళీలను కలుపుకొని, డైట్ లెక్చరర్లు, బీఈడీ కాలేజీల లెక్చరర్లు, డిప్యూటీ డీఈఓల వంటి పోస్టులన్నీ మరో 2వేల వరకు ఖాళీలున్నాయి. విద్యాశాఖలో 25 వేల పోస్టులను భర్తీచేసే వీలుంటుంది.
నాలుగున్నరేళ్ల తర్వాత టీచర్ల బదిలీలు
సుదర్ఘీకాలంగా వేచి చూస్తున్న ఉపాధ్యాయ బదిలీలకు రంగం సిద్ధమైంది. నాలుగున్నరేళ్ల తర్వాత ఇప్పుడే బదిలీలు జరగబోతున్నాయి. ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తుల మేరకు బదిలీలు, పదోన్నతులకు ప్రభుత్వం అనుమతించింది. 2018 జూలైలో ప్రభుత్వం టీచర్ల బదిలీలు చేపట్టింది. అప్పటి నుంచి వీరి బదిలీలు జరగడం లేదు. మళ్లీ నాలుగున్నరేళ్ల తర్వాత ఇప్పుడే బదిలీలకు అవకాశం కల్పిస్తోంది. ఈ బదిలీలకు విద్యాశాఖలో దాదాపు 90 వేల మంది ఉపాధ్యాయులు అర్హత సాధిస్తారు. వీటికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలో జారీ చేయనుంది. ఇదివరకున్న నిబంధనల ప్రకారం ఒకచోట ఉపాధ్యాయుడు రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటే బదిలీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హుడవుతాడు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.03,000 మందికి పైగా ఉపాధ్యాయులున్నారు. వీరిలో రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నవారు 90 వేలకు పైగా ఉన్నారు. ఉపాధ్యాయుడు ఒకే చోట ఎనిమిదేళ్లకు మించి, ప్రధానోపాధ్యాయుడు ఐదేళ్లకు మించి పని చేయరాదు. ఇలాంటి గరిష్ఠ సర్వీసును పరిగణనలోకి తీసుకుని బదిలీలు చేపడతారు.
ఉపాధ్యాయులు, ప్రైమరీ స్కూల్ హెడ్‌మాస్టర్లు, గెజిటెడ్ హెడ్‌మాస్టర్లంతా కలిపి దాదాపు 45 వేలకు మించి గరిష్ఠ నిబంధన కింద బదిలీ అవుతారని తెలుస్తోంది. అయితే... 317 జీఓకు సంబంధించిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల బదిలీలపై స్పష్టత రాలేదు. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలో భాగంగా ఉపాధ్యాయులను కూడా 317 జీఓ కింద బదిలీ చేసింది. ఇలాంటివారు 15-20 వేల మంది వరకు ఉంటారని సమాచారం. వీరు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ అయి ఏడాది కూడా పూర్తి కావడం లేదు. బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలంటే రెండేళ్ల కనీస సర్వీసు ఉండాలన్న నిబంధన మేరకు వీరు అనర్హులవుతారు. ఈ దృష్ట్యా వీరి బదిలీలను చేపడుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఉపాధ్యాయ సంఘాలు మాత్రం వీరి బదిలీలను కూడా చేపట్టాలని మంత్రులను కోరాయి. సర్దుబాటు ప్రక్రియపై ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే. సర్దుబాటులో తమ స్థానికతను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని అప్పట్లో ఆరోపించారు. బదిలీల్లో తమను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, రెండేళ్ల కనీస సర్వీసు నిబంధన నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు.
11 వేల మందికి పదోన్నతులు..
విద్యాశాఖలో స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా, ఎస్‌జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించనున్నారు. దాదాపు 11 వేల మంది పదోన్నతులు పొందే అవకాశాలుంటాయని తెలుస్తోంది. విద్యాశాఖలో పదోన్నతుల ప్రక్రియ చేపట్టక ఏడున్నరేళ్లు అవుతోంది. ఆ తర్వాత దాని గురించి ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా ముందు హెడ్‌మాస్టర్ల బదిలీల ప్రక్రియ చేపట్టనున్నారు. దాంతో ఏర్పడే ఖాళీలను స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు ఇవ్వడం(70%కోటా), డైరెక్ట్ రిక్రూట్‌మెంట్(30% కోటా) ద్వారా భర్తీ చేస్తారు. అనంతరం స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు చేపట్టి, ఏర్పడే ఖాళీలను ఎస్‌జీటీలకు పదోన్నతులు ఇవ్వడం, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తారు.
Updated Date - 2023-01-17T01:11:22+05:30 IST