10 వేల మంది వీఆర్‌ఏలు నిరక్షరాస్యులు
ABN, First Publish Date - 2023-07-16T02:29:29+05:30
రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న వీఆర్‌ఏలలో దాదాపు 10 వేల మంది నిరక్షరాస్యులు, కేవలం సంతకం మాత్రమే చేయగలిగే వాళ్లు ఉన్నట్లు వెల్లడైంది.
కనీస విద్యార్హత లేకపోవటంతో అధికారులకు సవాల్‌గా మారిన వీరి క్రమబద్ధీకరణ
రాష్ట్రంలో 20,555 మంది వీఆర్‌ఏలు
సగం మందికే విద్యార్హతలు
క్రమబద్ధీకరణపై సీసీఎల్‌ఏ కసరత్తు
నీటిపారుదల, వ్యవసాయ, మున్సిపల్, పంచాయతీరాజ్‌కు బదలాయింపు!
లష్కర్లుగా 5,950 మంది వీఆర్‌ఏలు
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
రెండున్నరేళ్ల తర్వాత కార్యరూపం
హైదరాబాద్, జూలై 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న వీఆర్‌ఏలలో దాదాపు 10 వేల మంది నిరక్షరాస్యులు, కేవలం సంతకం మాత్రమే చేయగలిగే వాళ్లు ఉన్నట్లు వెల్లడైంది. కనీస విద్యార్హత లేకపోవటంతో వీరి క్రమబద్ధీకరణ ఎలా అన్నది అధికారులకు సవాల్‌గా మారింది. వీఆర్‌ఏల క్రమబద్ధీకరణకు సీసీఎల్‌ఏ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 20,555 మంది వీఆర్‌ఏలు పని చేస్తున్నట్లు గుర్తించారు. వీరిలో డిగ్రీ అర్హత ఉన్న వారు 3 వేల మంది వరకు, పదో తరగతి, ఇంటర్మీడియట్ అర్హతలు ఉన్న వారు దాదాపు ఏడు వేల మంది వరకు ఉన్నట్లు అంచనా. ఈ విధంగా దాదాపు 10 వేల మంది వీఆర్‌ఏలు అటెండర్ నుంచి జూనియర్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు కావల్సిన అర్హతలను కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మిగిలిన 10,555 మంది వీఆర్‌ఏలలో నిరక్షరాస్యులు, అంతంత మాత్రమే చదవడం వచ్చిన వాళ్లు, సంతకం చేసేందుకు మాత్రమే పరిమితమైన వాళ్లు ఉన్నారు. అటెండర్ పోస్టుకైనా కనీసం పదోతరగతి పాస్ అయి ఉండాలి. ఈ కనీస విద్యార్హత కూడా లేకపోవడంతో వీరిని ఎలా క్రమబద్ధీకరించాలి? ఏ పోస్టులు కేటాయించాలి? అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. వీఆర్‌ఏలను క్రమబద్ధీకరించేందుకు సీసీఎల్‌ఏ మూడు రోజుల నుంచి తీవ్ర కసరత్తు చేస్తోంది. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్న సబ్‌కమిటీ ఆదేశాలతో సీసీఎల్‌ఏ (చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్) కమిషనర్ నవీన్‌మిట్టల్ యుద్ధప్రాతిపదికన చర్యలు మొదలు పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంత మంది వీఆర్‌ఏలు విధులు నిర్వహిస్తున్నారో క్షేత్రస్థాయి సమాచారాన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి తెప్పించుకున్నారు. మరోవైపు, వంశపారంపర్యంగా వచ్చిన వీఆర్‌ఏలలో కొందరు వయోపరిమితి (ఏజ్ లిమిట్) లేకుండాపనిచేస్తున్నారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవారు, వయస్సు మీద పడి విఽధులు నిర్వహించలేని వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులు కొనసాగుతున్నారు. వీరి క్రమబద్ధీకరణకు న్యాయపరమైన చిక్కులు ఏమైనా తలెత్తుతాయా అన్న అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. క్రమబద్ధీకరించిన అనంతరం పోస్టుల కేటాయింపు, శాఖల సర్దుబాటుపైనా కసరత్తు కొనసాగుతోంది. ప్రధానంగా ఇరిగేషన్, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, మిషన్ భగీరథ, వ్యవసాయశాఖలతో పాటు వివిధ డిపార్ట్‌మెంట్లలో వీరిని సర్దుబాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ప్రాజెక్టులు, తూములపై కాపలా విధులు
5,950 మంది వీఆర్‌ఏలను నీటిపారుదలశాఖలో లష్కర్లుగా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీఆర్‌ఏలను లష్కర్‌లుగా నియమిస్తామని ఇదివరకే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే. ప్రస్తుతం వీళ్లంతా రూ.10,500 గౌరవ వేతనంపై పని చేస్తుండగా... వీరికి రెవెన్యూశాఖలోనే పే స్కేలు అందించి... నీటిపారుదలశాఖలోకి పంపించనున్నారు. రూ.19 వేల మూలవేతనంతో లష్కర్లుగా నియమించనున్నారు. మొత్తంగా రూ.23 వేల దాకా నెలకు వేతనం అందుతుందని నీటిపారుదలశాఖ కీలక అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు, శ్రీశైలంతోపాటు ఎస్సారెస్పీ నిర్వాసిత కుటుంబాలకు చెందిన 200 మందినికూడా లష్కర్‌లుగా నియమించుకోవాలని నీటిపారుదల శాఖ ఇదివరకే నిర్ణయించింది. లష్కర్లుగా వీరు నియమితులైన తర్వాత, ప్రాజెక్టుల నుంచి విడుదలయ్యే నీరు పొలాలకు చేరుతుందా? లేదా? అని పరిశీలించడంతోపాటు కాలువల వద్ద చెట్లు తొలగించడం, కాలువలకు గండ్లు పడితే ఆ సమాచారం అధికారులకు అందించడం వంటి బాధ్యతలు చూడనున్నారు. ప్రాజెక్టులు, కాల్వలు, తూములపై కాపలా కాయడం వీరి ప్రధాన విధి. 9 ఏళ్లలో భారీగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినప్పటికీ ఆయా ప్రాజెక్టుల నిర్వహణకు సిబ్బంది నియామకం జరుగలేదు. రెండున్నరేళ్ల కిందట లష్కర్ల నియామకంపై చర్చ జరగ్గా... వీఆర్‌ఏలను ఈ పోస్టుల్లో సర్దుబాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.
Updated Date - 2023-07-16T02:29:29+05:30 IST