ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కుర్రాళ్లు కుమ్మేశారు

ABN, First Publish Date - 2023-08-13T02:48:15+05:30

సిరీ్‌సలో తొలిసారిగా యువ ఓపెనర్లు అదరగొట్టారు. నువ్వా.. నేనా అనే ఆటతీరుతో యశస్వీ జైస్వాల్‌ (51 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 84 నాటౌట్‌) కెరీర్‌లో రెండో టీ20లోనే అజేయ అర్ధసెంచరీ సాధించగా....

లాడర్‌హిల్‌: సిరీ్‌సలో తొలిసారిగా యువ ఓపెనర్లు అదరగొట్టారు. నువ్వా.. నేనా అనే ఆటతీరుతో యశస్వీ జైస్వాల్‌ (51 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 84 నాటౌట్‌) కెరీర్‌లో రెండో టీ20లోనే అజేయ అర్ధసెంచరీ సాధించగా.. అటు శుభ్‌మన్‌ గిల్‌ (47 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 77) ఎట్టకేలకు తన పేలవ ఫామ్‌కు ముగింపు పలికాడు. ఫలితంగా విండీ్‌సతో శనివారం జరిగిన నాలుగో టీ20లో భారత్‌ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీ్‌సలో 2-2తో సమంగా నిలిచింది. చివరి మ్యాచ్‌ ఆదివారమే జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 178 పరుగులు చేసింది. హెట్‌మయెర్‌ (39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 61), హోప్‌ (29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 45) అండగా నిలిచారు. అర్ష్‌దీ్‌పకు మూడు, కుల్దీ్‌పకు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో భారత్‌ 17 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 179 పరుగులు చేసి నెగ్గింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా జైస్వాల్‌ నిలిచాడు.

ఆరంభం నుంచే దూకుడు: 179 పరుగుల భారీ ఛేదనను భారత్‌ దీటుగానే ఆరంభించింది. ఓపెనర్లు జైస్వాల్‌, గిల్‌ ఈసారి విజృంభించారు. తొలి 15 ఓవర్లు ఇద్దరూ పోటాపోటీ ఆటతీరును కనబరిచి విండీస్‌ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు. తొలి బంతినే ఫోర్‌గా మలిచిన జైస్వాల్‌.. మూడో ఓవర్‌లో మూడు ఫోర్లతో మొదట జోరు చూపాడు. ఇక ఫామ్‌లేమితో ఇబ్బందిపడుతున్న గిల్‌ నాలుగో ఓవర్‌లో సిక్సర్‌తో టచ్‌లోకి వచ్చాడు. ఐదో ఓవర్‌లో జైస్వాల్‌ వరుసగా రెండు ఫోర్లు, తర్వాతి ఓవర్‌లో గిల్‌ 6,6,4తో పవర్‌ప్లేలో జట్టు 66 రన్స్‌ సాధించింది. సరిగ్గా 10 ఓవర్లలో స్కోరు 100 పరుగులకు చేరగా.. 11వ ఓవర్‌లో గిల్‌, జైస్వాల్‌ అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత కూడా జోరు తగ్గలేదు. 13వ ఓవర్‌లో చెరో సిక్సర్‌.. 14వ ఓవర్‌లో జైస్వాల్‌ 4,6తో విండీస్‌ ఓటమి ఖాయమైంది. చివరి ఐదు ఓవర్లలో 22 పరుగులు కావాల్సిన వేళ గిల్‌ను షెఫర్డ్‌ అవుట్‌ చేయడంతో తొలి వికెట్‌కు 165 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. మిగిలిన ఛేదనను జైస్వాల్‌, తిలక్‌ (7 నాటౌట్‌) మరో 18 బంతులుండగానే ముగించారు.

అటు పరుగులు.. ఇటు వికెట్లు: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ ఆరంభంలో పరుగులతో పాటు చకచకా వికెట్లను కూడా కోల్పోయింది. ఓ దశలో 123/7తో ఇబ్బందిపడ్డా హెట్‌మయెర్‌ బాదుడుకు జట్టు పటిష్ఠ స్కోరు సాధించింది. ఓపెనర్‌ మేయర్స్‌ (17) తొలి ఓవర్‌లోనే 6,4తో ఏకంగా 14 పరుగులు రాబట్టాడు. తర్వాతి ఓవర్‌లోనూ ఫోర్‌ బాది అర్ష్‌దీప్‌ చేతికి చిక్కాడు. మరో ఓపెనర్‌ కింగ్‌ (18) రెండు సిక్సర్లతో చెలరేగగా.. అటు హోప్‌ ఐదో ఓవర్‌లో 4,6తో పది రన్‌రేట్‌తో స్కోరు దూసుకెళ్లింది. కానీ అర్ష్‌దీప్‌ ఫుల్‌ లెంగ్త్‌ బంతికి కింగ్‌ను అవుట్‌ చేయడంతో పవర్‌ప్లేలో జట్టు 55/2తో నిలిచింది. ఇక ఏడో ఓవర్‌లో స్పిన్నర్‌ కుల్దీప్‌ డబుల్‌ ధమాకాతో కీలక పూరన్‌ (1), కెప్టెన్‌ పావెల్‌ (1)ను అవుట్‌ చేయడంతో విండీస్‌ షాక్‌తింది. అటు హోప్‌, హెట్‌మయెర్‌ జాగ్రత్తగా ఆడడంతో స్కోరు కూడా నెమ్మదించింది. తిరిగి చాహల్‌ ఓవర్‌లో హోప్‌ వరుసగా 4,6తో 14 రన్స్‌ రాబట్టాడు. అలాగే హార్దిక్‌ ఓవర్‌లో హెట్‌మయెర్‌ 6,4తోనూ 14 రన్స్‌ వచ్చాయి. దీంతో 12 ఓవర్లలోనే స్కోరు 102కి చేరింది. దీంతో ఆట గాడిన పడుతుందనుకున్న వేళ.. చాహల్‌ గట్టి దెబ్బ వేశాడు. చక్కగా క్రీజులో కుదురుకున్న హోప్‌ను 13వ ఓవర్‌లో అవుట్‌ చేయడంతో ఐదో వికెట్‌కు 49 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం వరుస ఓవర్లలో షెఫర్డ్‌ (9), హోల్డర్‌ (3) పెవిలియన్‌ చేరారు. ఈ దశలో హెట్‌మయెర్‌ బ్యాట్‌కు పనిచెప్పాడు. ఎనిమిదో వికెట్‌కు స్మిత్‌ (15 నాటౌట్‌)తో కలిసి 44 పరుగులు జోడించాడు. 16, 17వ ఓవర్లలో ఒక్కో సిక్సర్‌తో 35 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఆఖరి ఓవర్‌లోనూ సిక్సర్‌ బాది రెండో బంతికి తిలక్‌ డైవింగ్‌ క్యాచ్‌తో వెనుదిరిగాడు. అయినా అకీల్‌ హొస్సెన్‌ (5 నాటౌట్‌) ఫోర్‌, స్మిత్‌ సిక్సర్‌తో 17 పరుగులు రావడంతో విండీస్‌ భారీ స్కోరందుకుంది.

టీ20ల్లో భారత్‌ తరఫున తొలి వికెట్‌కు ఎక్కువ పరుగుల (165) భాగస్వామ్యం అందించిన జోడీగా గిల్‌-యశస్వీ. రాహుల్‌-రోహిత్‌తో సమానంగా నిలిచారు.

పిన్న వయస్సులో టీ20ల్లో అర్ధసెంచరీ చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా యశస్వీ (21 ఏళ్ల 227 రోజులు)

స్కోరు బోర్డు

వెస్టిండీస్‌: మేయర్స్‌ (సి) సంజూ (బి) అర్ష్‌దీప్‌ 17, కింగ్‌ (సి) కుల్దీప్‌ (బి) అర్ష్‌దీప్‌ 18, హోప్‌ (సి) అక్షర్‌ (బి) చాహల్‌ 45, పూరన్‌ (సి) సూర్య (బి) కుల్దీప్‌ 1, పొవెల్‌ (సి) గిల్‌ (బి) కుల్దీప్‌ 1, హెట్‌మయెర్‌ (సి) తిలక్‌ వర్మ (బి) అర్ష్‌దీప్‌ 61, షెపర్డ్‌ (సి) సంజూ (బి) అక్షర్‌ 9, హోల్డర్‌ (బి) ముఖేష్‌ 3, స్మిత్‌ (నాటౌట్‌) 15, అకీల్‌ హొస్సెన్‌ (నాటౌట్‌) 5, ఎక్స్‌ట్రాలు 3, మొత్తం: 20 ఓవర్లలో 178/8; వికెట్లపతనం: 1-19, 2-54, 3-55, 4-57, 5-106, 6-118, 7-123. 8-167; బౌలింగ్‌: అక్షర్‌ 4-0-39-1, అర్ష్‌దీప్‌ 4-0-38-3, చాహల్‌ 4-0-36-1, కుల్దీప్‌ 4-0-26-2, హార్దిక్‌ 1-0-14-0, ముకేశ్‌ 3-0-25-1.

భారత్‌: యశస్వీ (నాటౌట్‌) 84, గిల్‌ (సి) హోప్‌ (బి) షెఫర్డ్‌ 77, తిలక్‌ వర్మ (నాటౌట్‌) 7, ఎక్స్‌ట్రాలు 11, మొత్తం: 17 ఓవర్లలో 179/1; వికెట్‌ పతనం: 1-165; బౌలింగ్‌: మెకాయ్‌ 3-0-32-0, అకీల్‌ హొస్సెన్‌ 4-0-31-0, హోల్డర్‌ 4-0-33-0, షెఫర్డ్‌ 3-0-35-1, స్మిత్‌ 2-0-30-0; పొవెల్‌ 1-0-13-0.

Updated Date - 2023-08-13T02:48:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising