స్టీఫుల్.. జోష్
ABN, First Publish Date - 2023-10-03T01:15:44+05:30
అథ్లెటిక్స్‌లో పతకాల జోరు కొనసాగుతోంది. ఆసియా క్రీడల్లో సోమవారం జరిగిన మహిళల 3000 మీ. స్టీపుల్ చేజ్‌లో పారుల్ చౌదరి రజతంతోపాటు ఒలింపిక్ బెర్త్‌ను కైవసం చేసుకోగా...
పారుల్, ప్రీతికి రజత, కాంస్యాలు
లాంగ్‌జంప్‌లో అదరగొట్టిన అన్సీ
స్కేటింగ్ రిలేలో అనూహ్య పతకాలు
ఆసియా క్రీడల్లో 9వ రోజు స్వర్ణం లేకపోయినా.. మరో ఏడు పతకాలు భారత్ ఖాతాలోకి చేరాయి. స్టీపుల్ చేజ్‌లో పారుల్, ప్రీతి రజత, కాంస్యాలతో మెరవగా.. లాంగ్‌జంప్‌లో అన్సీ సోజన్ రెండో స్థానంతో అదరగొట్టింది. రోలర్ స్కేటింగ్ రిలేలో తొలిసారి రెండు కాంస్యాలు లభించగా.. 4X400 మిక్స్‌డ్ రేస్‌లో రజతం వరించింది. టీటీలో టైటిల్‌పై ఆశలు రేపిన డబుల్స్ జంట సుతీర్థ-ఐహిక సెమీస్‌లో ఓడి కాంస్యంతో సరిపెట్టుకొంది. దీంతో మొత్తం 60 పతకాలు (13 స్వర్ణ, 24 రజత, 23 కాంస్య) సాధించిన భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
హాంగ్జౌ: అథ్లెటిక్స్‌లో పతకాల జోరు కొనసాగుతోంది. ఆసియా క్రీడల్లో సోమవారం జరిగిన మహిళల 3000 మీ. స్టీపుల్ చేజ్‌లో పారుల్ చౌదరి రజతంతోపాటు ఒలింపిక్ బెర్త్‌ను కైవసం చేసుకోగా.. ప్రీతి లాంబా కాంస్యం సొంతం చేసుకొంది. విన్‌ఫ్రెడ్ ముటీలీ (బహ్రెయిన్) ఆసియా రికార్డు (9:18.28) టైమింగ్‌తో స్వర్ణం నెగ్గింది. రెండో స్థానంలో నిలిచిన పారుల్ (9:27.63 సె) కూడా ఆసియా రికార్డును అధిగమించినా, వ్యక్తిగత బెస్ట్ 9:15.31 సెకన్ల టైమింగ్‌ను అందుకోలేక పోయింది. ప్రీతి 9:43.32 సెకన్ల వ్యక్తిగత బెస్ట్ టైమింగ్‌తో మూడో స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకొంది.
రజతమైన కాంస్యం: 4గీ400 మిక్స్‌డ్ రిలే టీమ్ అనూహ్య రజతాన్ని కైవసం చేసుకొంది. మహ్మద్ అజ్మల్, విత్య రామ్‌రాజ్, రాజేష్ రమేష్, శుభా వెంకటేశన్‌ల జట్టు 3 నిమిషాల 14.34 సెకన్ల టైమింగ్‌తో రెండో స్థానంలో నిలిచింది. వాస్తవంగా రేసు ముగిసినప్పుడు శ్రీలంక (3:14.25 సె) రెండో స్థానంలో, భారత్ మూడో స్థానంలో నిలిచాయి. కానీ, లైన్ నిబంధనను అతిక్రమించడంతో లంక జట్టుపై అనర్హత వేటుపడింది. దీంతో భారత బృందం సాధించిన కాంస్యాన్ని.. రజతంగా అప్‌గ్రేడ్ చేశారు. బహ్రెయిన్ (3:14.02 సెకన్లు)కు స్వర్ణం, కజకిస్థాన్ (3:24.85)కు కాంస్యం లభించాయి. పురుషుల 200 మీ. రేసులో అమలన్ బోర్గొహైన్ ఆరో స్థానంలో నిలిచాడు. 2018లో కూడా భారత్ రజతం సాధించినా.. మొదటి స్థానంలో నిలిచిన బహ్రెయిన్ అథ్లెట్లలో ఒకరు డోపింగ్‌లో దొరికిపోయాడు. దీంతో భారత్ సాధించిన రజతాన్ని స్వర్ణంగా అప్‌గ్రేడ్ చేశారు.
ముఖర్జీ ద్వయానికి కాంస్యం: టేబుల్ టెన్నిస్ మహిళల డబుల్స్‌లో సుతీర్థ ముఖర్జీ-ఐహిక ముఖర్జీ జంట కాంస్యానికే పరిమితమైంది. సెమీ్‌సలో సుతీర్థ-ఐహిక ద్వయం 3-4తో ఉత్తర కొరియాకు చెందిన చ సుయోంగ్-పాక్ సుయోంగ్ చేతిలో పోరాడి ఓడింది. సెమీ్‌సలో ఓడడంతో కాంస్యం ఖరారైనా.. మహిళల డబుల్స్‌లో భారత్‌కు పతకం దక్కడం ఇదే తొలిసారి.
పీటీ ఉష రికార్డు సమం: మహిళల 400 మీ హర్డిల్స్ హీట్స్-1లో విత్య రామ్‌రాజ్ 55.42 సెకన్ల టైమింగ్‌తో నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ క్రమంలో తన వ్యక్తిగత టైమింగ్ 55.43 సెకన్లను అధిగమించిన రామ్‌రాజ్.. 1984లో పీటి ఉష నెలకొల్పిన 55.42 సెకన్ల జాతీయ రికార్డును సమం చేసింది. కాగా, హీట్స్-2లో సించాల్ కవేరమ్ ఆరో స్థానంలో నిలిచి.. మెడల్ రేస్‌కు అర్హత సాధించలేక పోయింది.
స్కేటింగ్ రిలేలో తొలిసారి..
3000 మీటర్ల స్పీడ్ స్కేటింగ్‌లో రిలేలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత పురుషులు, మహిళల జట్లు అనూహ్య కాంస్య పతకాలతో ఆశ్చర్యపరిచాయి. మహిళల రేసులో కార్తీక జగదీశ్వరన్, హీరల్ సాధు, ఆర్తీ కస్తూరి రాజ్‌ల జట్టు (4:34.861) మూడో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో దేశానికి తొలి ఆసియాడ్ పతకాన్ని అందించింది. చైనీస్ తైపీ జట్టు స్వర్ణం నెగ్గగా.. కొరియా బృందం రజతం దక్కించుకొంది. కాగా, ఆనంద్ కుమార్, సిద్ధాంత్ రాహుల్, రాజేంద్ర విక్రమ్‌లతో కూడిన పురుషుల రిలే జట్టు 4 నిమిషాల 10.128 సెకన్ల టైమింగ్‌తో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సొంతం చేసుకొంది. చైనీస్ తైపీ, కొరియా జట్టు స్వర్ణ, రజత పతకాలు సాధించాయి.
శభాష్.. సోజన్
లాంగ్‌జంప్‌లో అన్సీ సోజన్ రజతంతో మెరిసింది. రెండుసార్లు వ్యక్తిగత బెస్ట్‌ను అధిగమించిన సోజన్ ఐదో ప్రయత్నంలో 6.63 మీటర్లు దూకి రజతం సొంతం చేసుకొంది. చైనా జంపర్ షికి జియాంగ్ 6.73 మీటర్లు దూకి పసిడి పట్టేయగా.. వియత్నాంకు చెందిన యంగా యాన్ యు 6.50 మీటర్లతో కాంస్యం దక్కించుకొంది. కాగా, మరో భారత జంపర్ షైలి సింగ్ (6.48 మీ) ఐదో స్థానంతో నిరాశపర్చింది.
Updated Date - 2023-10-03T01:22:29+05:30 IST